దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా పతనమౌతోంది. ఇప్పటికే రికార్డు స్థాయి ద్రవ్యోల్బణం హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు రూపాయి విలువ కూడా జీవనకాల కనిష్ఠానికి చేరుకుంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడగుంటుతున్నాయి. స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకుంటున్నాయి. మరోవైపు నిరుద్యోగం పెరిగిపోతోంది. ధరల మోత మోగిపోతోంది. ఎక్కడ చూసినా ప్రతికూల సంకేతాలే కనిపిస్తున్నాయి. సామాన్యుడి బతుకు మరింత భారంగా మారే ప్రమాదం పొంచి ఉంది.
ఇప్పటికే గ్యాస్, డీజిల్, పెట్రోల్ రేట్లు ఆకాశమే హద్దుగా పరుగులు తీస్తున్నాయి. ఇప్పుడు రూపాయి చారిత్రక కనిష్ఠానికి పతనం కావడంతో.. భవిష్యత్తు ఊహించడానికే భయమేస్తోంది. దిగుమతులన్నీ భారం కానున్నాయి. సామాన్యుడి నడ్డి విరగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఐదు లక్షల ట్రిలియన్ల డాలర్ల ఎకానమీని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ వరుసగా జరుగుతున్న పరిణామాలన్నీ రివర్స్ లోనే ఉన్నాయి. కోవిడ్ తర్వాత ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటుందన్న సంకేతాలు కనిపించినా.. అది నిజం కాదని తేలిపోయింది. మొదట నిరుద్యోగం తీవ్రంగా పెరిగింది. తర్వాత ద్రవ్యోల్బణం కోరలు చాచింది. ఇప్పుడు రూపాయి జీవనకాల కనిష్ఠానికి చేరింది. దీనికి తోడు విదేశీ మారక ద్రవ్యం నిల్వలు కూడా అడుగంటుతున్నాయి. కేవలం 12 నెలల దిగుమతులకు సరిపడా మాత్రమే నిల్వలున్నాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే మన చుట్టుపక్కల దేశాలైనా పాకిస్థాన్, శ్రీలంక, భూటాన్ ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. మన ఆర్థిక వ్యవస్థ కూడా పతనం దిశగా వేగంగా పరుగెడుతున్న పరిస్థితుల్లో.. భవిష్యత్తులో ఏమౌతుందోననే భయాలు పెరిగిపోతున్నాయి.
రూపాయి విలువ జీవనకాల కనిష్ఠానికి పతనం కావడం చిన్న విషయం కాదు. రూపాయి పతనం ప్రభావం పలు రంగాలపై తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా సామాన్యుడి జీవన చక్రానికి కీలకమైన గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు మరింతగా పెరగడం ఖాయం. ఇప్పటికే సబ్సిడీ వంట గ్యాస్ ధర రూ.1052గా ఉంది. ఇప్పుడు రూపాయి పతనంతో గ్యాస్ ధర మరింత పెరుగుతుందనే అంచనాలుపన్నాయి. ఇక పెట్రోల్, డీజిల్ రేట్లు.. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎప్పుడో సెంచరీ కొట్టేశాయి. ఇప్పుడు వీటి రేట్లు కూడా మరింత పెరుగుతాయి. పెట్రోల్ రేటు పెరిగితే ఆటోమేటిగ్గా వస్తువుల రవాణా భారమౌతుంది. దీంతో నిత్యావసరాలు వస్తువులు పెరుగుతాయి. అప్పుడు ఆహార ద్రవ్యోల్బణం మళ్లీ కొండెక్కి కూర్చుంటుంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఆర్బీఐ తీసుకున్న రెపో రేటు పెంపు నిర్ణయం కూడా పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు.
నిజానికి కోవిడ్ తర్వాత మన ఆర్థిక వ్యవస్థ పూర్తిస్థాయిలో కోలుకోలేదు. కోవిడ్ కాలంలో కుదేలైన పరిశ్రమలు, వ్యాపారాలు ఇంకా గాడిన పడలేదు. ఉద్యోగాలు కోల్పోయిన కోట్లాది మంది మళ్లీ పనిలో కుదురుకోలేదు. ఈలోగానే ఆర్థిక వ్యవస్థ వేగంగా పతనమౌతుండటంతో.. ప్రమద ఘంటికలు మోగిస్తోంది. దేశంలో ఇప్పటికీ లేబర్ ఫోర్స్ లో 40 శాతం మంది మాత్రమే యాక్టివ్ అయ్యారు. ఇంకా 60 శాతం మంది ఏం చేస్తున్నారో లెక్కల్లేవు. ఆర్థిక వ్యవస్థ వాళ్ల కంట్రిబ్యూషన్ ఏంటో తెలియని అయోమయం నెలకొంది. అటు అగ్రికల్చర్ లేబర్ సంఖ్య గణనీయంగా ఉన్న.. వారి ఆదాయాలు అంతంతమాత్రమే. వాళ్లు బతకడమే కష్టంగా ఉన్నప్పుడు.. ఇక ఆర్థిక వ్యవస్థకు ఏం కంట్రిబ్యూట్ చేస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఆర్థిక వ్యవస్థ కోవిడ్ ముందు నాటికి చేరుకోవాలంటే పుష్కర కాలం పడుతుందన్న అంచనాలున్నాయి. దేశంలో ధనికులు, పేదల మధ్య అంతరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. రాష్ట్రాల తలసరి ఆదాయంలోనూ విపరీతమైన తేడాలున్నాయి. పరిస్థితుల ఇలాగే ఉంటే ఆర్థిక సర్వే రూపొందించడం కూడా చాలా కష్టమైపోతుందని ఆర్థిక వేత్తలు ఆందోళన చెందుతున్నారు. దేశంలో రాజకీయంగా పెరుగుతున్న సంక్లిష్టతలు కూడా పరిస్థితిని మరింత జటిలం చేస్తున్నాయి. చాలా విషయాల్లో రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా కేంద్రం ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలేవీ ఫలితాన్నివ్వడం లేదు. రాష్ట్రాల మనస్ఫూర్తిగా సహకరించకుండా.. వాటిని భాగస్వామ్యం చేయకుండా చేసే ఏ సంస్కరణలతోనూ ఉపయోగం లేదని నిపుణులు తేల్చేస్తున్నారు.
దేశంలో విద్యుత్ సంక్షోభం కూడా తరుముకొస్తోంది. చాలా రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు మొదలయ్యాయి. థర్మల్ విద్యుత్ కు ప్రత్యామ్నాయం చూడకుండా.. హడావుడిగా పునరుత్పాదక ఇంధనాల నుంచి వచ్చే విద్యుత్ వైపు మళ్లాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం ఎదురుతన్నింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు బొగ్గు సంక్షోభంలో కూరుకుపోయాయి. బొగ్గు గనులు లేని రాష్ట్రాలే కాదు.. ఉన్న రాష్ట్రాల్లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఇలా తలాతోకా లేని నిర్ణయాలతోనే కేంద్రం కొంపముంచుతోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అసలు కోవిడ్ ముందు నుంచీ మన ఆర్థిక వ్యవస్థ స్తబ్ధుగానే ఉంది. సజావుగా సాగుతున్న ఆర్థిక రథానికి పెద్ద నోట్ల రద్దు పెద్ద కుదుపే ఇచ్చింది. అప్పట్నుంచీ ఆర్థిక వ్యవస్థ నేలచూపులే చూస్తోంది. ఇంత పెద్ద జనాభా ఉన్న దేశంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకోకుండా.. ఆర్థిక పరమైన సమస్యలు తగ్గే అవకాశం లేదు. కానీ ప్రభుత్వం తీసుకుంటున్న వరుస నిర్ణయాలు.. ఆర్థిక తిరోగమనానికే దారితీస్తున్నాయి. పెద్దఎత్తున ప్రభుత్వ ఆస్తులు అమ్ముతున్నా.. ఫలితం కనిపించడం లేదు. 1991 నాటి ఆర్థిక సంక్షోభం నాటి పరిస్థితులు మళ్లీ వస్తాయా అనే భయాలు కూడా మొదలయ్యాయి. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, ఎవరి సూచనలు పాటించడం లేదన్న వార్తలు కలవరపెడుతున్నాయి. మోడీ ప్రభుత్వంలో ఆర్థిక నిపుణులు ఎవరూ లేకపోవడం, నెలల వ్యవధిలోనే ఆర్బీఐ గవర్నర్లు మారడం, ఆర్థిక సలహాదారుల వరుస రాజీనామాలు.. అన్నీ ఆందోళనకర పరిణామాలుగానే కనపడుతున్నాయి. పైకి ఎన్ని గొప్పలు చెప్పుకున్నా.. ఆర్థిక వ్యవస్థ మేడిపండేనన్న నిజం ఎవరికీ జీర్ణం కావడం లేదు.
మన దేశం చేసే ఎగుమతుల కంటే దిగుమతుల పరిమాణం చాలా పెద్దది. ఏ దేశానికైనా దిగుమతుల బిల్లే.. జీడీపీని నిర్దేశిస్తుంది. దిగుమతుల భారం పెరిగేకొద్దీ.. ఆర్థిక సూచీలన్నీ పతనమౌతాయి. సంక్షోభం ముదురుతున్న కొద్దీ దాన్ని చక్కదిద్దటం కూడా కష్టసాధ్యమౌతుంది. వివేకంతో ముందే మేలుకోవాల్సిన ప్రభుత్వాలు.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఒకదాని తర్వాత మరొకటిగా సంక్షోభాలు ముంచుకొస్తున్నా.. అనుకున్నస్థాయిలో ప్రభుత్వ చొరవ కనిపించడం లేదు. ఇప్పటికే ధరాఘాతంతో అల్లాడుతున్న సామాన్యులకు ముందుంది మొసళ్లపండగ అనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
పప్పులు, ఉప్పుల దగ్గర్నుంచీ పెట్రోల్ వరకూ అడ్డుఅదుపూ లేకుండా పెరుగుతున్న ధరల దెబ్బకు ఇప్పటికే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. రూపాయి పతనంతో దిగుమతుల బిల్లు పెరిగితే.. ఆ భారం సంగతేంటని ఊహించుకుంటేనే భయమేస్తోంది. ఇప్పటికే ట్రేడర్లు దిగాలు పడుతున్నారు. ఎఫ్ఎంసీజీ కంపెనీలు కూడా ద్రవ్యోల్బణం భవిష్యత్తులోనూ గరిష్ఠ స్థాయిలో కొనసాగుతుందని అంచనాలు వేసుకుంటున్నాయి. మధ్యమ స్థాయి ధరలు ఫిక్స్ చేసి.. తమ ఉత్పత్తుల్ని కొత్తగా లాంచ్ చేయాలనే ఆలోచనతో ఉన్నాయి. ప్రస్తుతం ఎటువైపు చూసినా నిరాశాజనకమైన వాతావరణమే కనిపిస్తోంది. ప్రభుత్వం దగ్గర కూడా ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి నిర్దిష్టమైన ప్రణాళిక ఉన్నట్టు కనిపించడం లేదు. ఆర్థిక వ్యవస్థ పతనం కంటే రాజకీయాలపైనే కేంద్రం ఎక్కువగా ఫోకస్ పెట్టడం కూడా ఈ దుస్థితికి ప్రధాన కారణమని చెప్పక తప్పదు.
దేశ ఆర్థిక వ్యవస్థ కొవిడ్ ప్రభావంతో చాలా నష్టపోయింది. ఆలోటు పూడ్చుకోవడానికి కనీసం పన్నెండేళ్లు పడుతుందని ఆర్బీఐ నివేదిక తేల్చింది. కోవిడ్ కారణంగా రూ.52 లక్షల కోట్ల ఉత్పత్తి నష్టం వాటిల్లిందని తెలుస్తోంది.
2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిపోర్ట్ ఆన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్ నివేదికను ఆర్‌బీఐ రూపొందించింది. కొవిడ్ దశల వారీగా ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసిందని, త్రైమాసిక జీడీపీలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపించిందని వివరించింది. 2020-21 తొలి త్రైమాసికంలో భారీ క్షీణత నమోదు చేసిన ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటుండగా, 2021-22 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రెండో దశ కొవిడ్ పరిణామాలు మళ్లీ దెబ్బతీశాయని నివేదిక వివరించింది. 2022 జనవరిలో కొవిడ్ మూడో దశ ప్రభావం చూపినా, మొదటి రెండు దశలతో పోలిస్తే తక్కువని తెలిపింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఫలితంగా అంతర్జాతీయ, దేశీయ వృద్ధి కూడా తగ్గుతోంది. కమొడిటీ ధరలు పెరగడం, అంతర్జాతీయ సరఫరా చైన్‌లో అంతరాయాలు ఇందుకు కారణమని వివరించింది.
కొవిడ్ ముందు వృద్ధి రేటు 6.6 శాతంగా నమోదైంది. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం శ్రీలంక బాటలో ఉందంటూ గణాంకాల ఆధారంగా అనేక మంది అంచనా వేస్తున్నారు. దేశంలో పెరుగుతున్న ధరలు, GDP రేషియోలో పెరుగుతున్న రాష్టాల అప్పులు, అధిక బడ్జెట్ లోటు, పెరుగుతున్న నిరుద్యోగిత, తక్కువ పెట్టుబడి, పడిపోతున్న డిమాండ్ వాదనలకు బలమిస్తున్న ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. పక్కనే ఉన్న లంక ఆర్థిక అస్థిరతలకు గురైన సందర్భంలో భారత్ అప్రమత్తం కావటం సహజం. ప్రధానంగా ఏడాది కాలంలో దేశంలో ఆహార ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. 2021 లెక్కల ప్రకారం.. శ్రీలంకలో మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం 18.7 శాతం ఉండగా.. భారత్ లో అది 6.95 శాతంగా ఉంది. భారత్ లో ఆహార ద్రవ్యోల్బణం 2021 మార్చిలోని 4.87 శాతం నుంచి 7.68 శాతానికి పెరిగింది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో డబుల్ కంటే ఎక్కువగానే పెరిగింది. 2021-22 ఆర్థిక సర్వే ప్రకారం భారత జీడీపీలో అప్పుల నిష్పత్తి 90.50 శాతంగా ఉంది. ఇది శ్రీలంక విషయంలో 119 శాతాన్ని దాటేసింది.
భారత ఆర్థిక వ్యవస్థ శ్రీలంక పరిస్థితులకు చేరుకోవటం లేదని, కనీసం 1991 నాటి సంక్షోభ పరిస్థితులను కూడా ఎదుర్కోవటం లేదని నిపుణులు చెబుతున్న మాట. ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ విదేశీ మారక నిల్వలు, కరెంట్ ఖాతాలోటుపై అధారపడి ఉంటుందని ఆయన అంచనా. దీని ప్రకారం భారత్ వద్ద ఉన్న ప్రస్తుత 600 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలు ఏడాది దిగుమతుల చెల్లింపులకు సరిపోతుంది. ఇదే సమయంలో కరెంట్ ఖాతా లోటు జీడీపీలో 2.7 శాతంగా ఉంది. బడ్జెట్ లోటు, ఆర్థిక లోటు భారం, కరోనా కేసుల సంఖ్య పెరిగితే వచ్చే అవాంతరాలు వంటి వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే.. ప్రమద సంకేతాలు కనిపిస్తున్నాయి.
ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతున్న కారణంగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది చివరి నాటికి వడ్డీ రేట్లను రెండితలు చేయాలని యోచిస్తోంది. 2023 చివరికి రేట్లను 2.75 శాతానికి చేర్చాలని భావిస్తోంది. కరోనా సందర్భంగా అప్పట్లో ఈ రేటు సున్నాగా ఉంది. అమెరికా, యూరప్ తో పాటు ఇతర దేశాల్లో వడ్డీ రేట్లు పెరిగితే విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను అక్కడికి తరలించే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగానే స్టాక్ మార్కెట్లు పతనం అవుతుండగా.. రూపాయి విలువ క్షీణిస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థ గణాంకాలు ప్రమాదకరంగా ఉన్నప్పటికీ.. బలమైన మూలాధారాలు దేశాన్ని శ్రీలంక మార్గంలో జారిపోనివ్వవనేది నిపుణుల అభిప్రాయంగా ఉంది. అయితే అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదం తప్పదన్న హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8 శాతం వృద్ధిరేటు సాధించగలమని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ నాలుగు వైపులా కమ్ముకొస్తున్న ఆర్థిక పతనపు మేఘాలు ఆ అంచనా కచ్చితంగా తప్పవుతుందని నిరూపిస్తున్నాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, విదేశీ మారక ద్రవ్య నిల్వలు, రూపాయి పతనం.. ఇల ఏ గణాంకాలు కూడా ప్రభుత్వ అంచనాలకు తగ్గట్టుగా లేవు. 17 నెలల దిగుమతులకు సరిపడా ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఇప్పుడు 12 నెలల దిగుమతుల స్థాయికి పడిపోయాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెరిగిన తరుణంలో.. విదేశీ మారక నిల్వలు మరింతగా తగ్గే ప్రమాదం పొంచి ఉంది. అదే జరిగితే మన దేశం కూడా చెల్లింపుల సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుందేమో అనే అనుమానాలు లేకపోలేదు. దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగానే ఉన్నా.. మూడేళ్లుగా ఆర్థిక గణాంకాల్లో ఎలాంటి పురోగతి లేకపోవడం ఆందోళనకరంగా ఉంది.
అంతులేని కథలా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధం, దీనికి తగ్గట్టుగా రష్యాపై కఠినమౌతున్న ఆంక్షలు కూడా ఇండియాను కలవరపెడుతున్నాయి. ఇప్పటికే చమరు బిల్లు భారంగా మారుతోంది. రష్యాపై ఆంక్షలు పెరిగిపోయి.. పెట్రోల్ కొనలేని పరిస్తితి వస్తే.. అప్పుడు చైనా నుంచి పెట్రోల్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే ఆహార ద్రవ్యోల్బణం మరింత పైకి ఎగబాకుతుంది. అప్పుడు సామాన్యుల జీవనం ఇంకా దుర్భరమౌతుంది. సామాన్యుడి ఆదాయంలోంచి గృహావసర ఖర్చులకు పోను.. డబ్బు మిగిలితేనే పెట్టుబడులు, పొదుపు సాధ్యమౌతుంది. కానీ వచ్చే జీతాలు ఖర్చులకే సరిపోని పరిస్థితుల్లో.. ఇక పొదుపు, పెట్టుబడి సంగతేంటనే భావనే భయపెడుతోంది. ధనికులు ఎంత భారీగా పెట్టుబడులు పెట్టినా.. సామాన్యుల భాగస్వామ్యం లేకుండా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం అసాధ్యం. ధరల నుంచి ఉపశమనం లేకుండా.. చమరు బిల్లు తగ్గకుండా సామాన్యుల నుంచి భాగస్వామ్యం ఊహించడం అత్యాశే అవుతుంది.
వీలైనంతగా ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ఆర్బీఐ ప్రయత్నిస్తున్నా.. వరుసగా జరుగుతున్న పరిణామాలు అడ్డుపడుతున్నాయి. ఆర్బీఐ రెపో రేట్ల పెంపు కూడా రాంగ్ టైమ్ లో తీసుకున్న నిర్ణయమనే అభిప్రాయాలున్నాయి. ఇంకా ప్రపంచాన్ని కోవిడ్ భయం వీడలేదని, అప్పుడే హడావుడిగా రేట్లు పెంచాల్సిన అవసరమేముందనే వాదన వినిపిస్తోంది. అయితే ఆర్బీఐ సరైన సమయంలోనే రెపో రేట్లు పెంచిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతున్నాయని, ఈ ట్రెండ్ నే అర్బీఐ అనుసరించిందని అంటున్నారు. ఎవరేం చెప్పినా ఆర్థిక వ్యవస్థ గాడిన పడకుండా ఏం చేసినా.. విమర్శలు తప్పవంటున్నారు నిపుణులు.
దేశంలో పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పిస్తున్న వాహన రంగం కూడా ఒడుదుడుకులు ఎదుర్కుంటోంది. ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల్ని ప్రోత్సహిస్తున్న తరుణంలో.. ఈ రంగంలో కార్మిక శక్తి గణనీయంగా తగ్గిపోయే అవకాశాలున్నాయి. అప్పుడు పెద్దఎత్తున రోడ్డున పడే కార్మికులకు ఉపాధి చూపించడం అతి పెద్ద సవాల్ గా మారనుంది. దీనికి వీలైనంత త్వరగా పరిష్కారం కనుక్కోపోతే.. ఉద్యోగ సంక్షోభం తప్పదు. ఛార్జింగ్ స్టేషన్లలో అందరికీ ఉపాధి సాధ్యం కాదనే వాదన కూడా ఉంది. కాలుష్యాన్ని తగ్గించుకోవడానికి పెద్ద ఎత్తున థర్మల్ ప్లాంట్లు, బొగ్గు గనుల మూత కూడా నిరుద్యోగానికి దారితీస్తుంది. ఈ సంక్షోభాల్ని తట్టుకోవాలంటే.. ఆర్థిక వృద్ధి బలంగా ఉండాల్సిందే. ఏ చిన్న తప్పు జరిగినా తట్టుకోలేనంత సున్నితంగా ఆర్థిక వ్యవస్థ ఉందన్న అంచనాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి.
కరోనా విజృంభణ కారణంగా చాలా కాలంగా వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ వచ్చిన ఆర్బీఐ.. ఇప్పుడు ఉన్నట్టుండి పెంచేయడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం బూమరాంగ్ అవుతుందా అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి.
ఇవాళ ఆహారం, వంటగ్యాస్, పెట్రోలు, డీజిల్, దుస్తులు, పాదరక్షలు మొదలుకొని గృహోపకరణాలు, ఎలెక్ట్రానిక్ వస్తువుల వరకు అన్నింటి ధరలూ పెరిగిపోయాయి. దేశమంతటా దాదాపు అన్నిచోట్లా పెట్రోలు ధర లీటరుకు 110 రూపాయలు దాటిపోయింది. పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో సరకుల రవాణా వ్యయం పెరిగిపోయింది. కొవిడ్ వల్ల కోల్పోయిన ఉద్యోగాలు తిరిగిరాలేదు. ఉద్యోగాలు ఉన్నవారికి వేతనాలు స్తంభించిపోయాయి. వెరసి ప్రజల ఆదాయాలు పడిపోవడంతో వ్యాపారాలు దెబ్బతిన్నాయి.
చేతిలో డబ్బు ఆడక ప్రజలు ఖర్చుల్ని తగ్గించుకోవడంపై దృష్టిపెట్టారు. స్తోమత ఉన్నవారూ కార్లు, ఇళ్లు కొనడం వాయిదా వేసుకుంటున్నారు. ఇటీవల ఉత్పత్తి సాధనాల వ్యయం పెరిగిపోవడంతో పరిశ్రమలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. రోడ్డు, నౌకా రవాణా ఖర్చులు తలకుమించిన భారమవుతున్నాయి. వరుసగా రెండేళ్లపాటు కొవిడ్ వల్ల స్తంభించిపోయిన ఆర్థిక వ్యవస్థ తేరుకుంటూ, చమురుతోపాటు ఉక్కు, అల్యూమినియం, రాగి, నికెల్, జింకు తదితరాల అవసరం పెరిగింది. కానీ, అంతర్జాతీయ సరఫరా గొలుసులు విచ్ఛిన్నమైనందువల్ల గిరాకీకి తగిన సరఫరా లేక ధరలు మిన్నంటుతున్నాయి. భారత్‌లో మాత్రం అంతర్గత గిరాకీకన్నా విదేశాల నుంచి దిగుమతుల వ్యయం పెరగడం వల్లనే ద్రవ్యోల్బణం హెచ్చుతోంది. స్వదేశంలో గిరాకీ పడిపోతే పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకురారు. భారతీయ పరిశ్రమలు తమ ఉత్పత్తి సామర్థ్యంలో 65 నుంచి 70 శాతమే వినియోగించుకొంటున్నాయని ఫిక్కి వెల్లడించింది. ఉన్న సామర్థ్యాన్నే పూర్తిగా వినియోగించుకోలేకపోతే అదనపు ఉత్పత్తి సామర్థ్య సృష్టికి పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉండదు.
ప్రభుత్వం ఇంధనంపై పన్నులతోపాటు జీఎస్టీని తగ్గించి, పేదలకు ఉచిత ఆహార పథకాలను విస్తరించి, ఎంఎస్‌ఎంఈ రంగానికి నగదు బదిలీ చేయడం ద్వారా ఆర్థికాభివృద్ధికి ఊపునివ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. దానివల్ల ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి. అయినా, కేంద్రం ఇంతవరకు ఆ దిశగా చొరవ తీసుకోవడం లేదు.2023లో 14 శాతం వృద్ధిరేటు సాధిస్తే తప్ప, ఆర్థిక రథం పరుగు మొదలుపెట్టదు. ధరలను నియంత్రించడం దానికి తొలి మెట్టు కావాలి. ధరల పెరుగుదలను అరికట్టలేకపోవడం వల్లనే శ్రీలంక, పాకిస్థాన్ నేడు దివాలా స్థితికి చేరాయి. ఆ దుస్థితి భారత్‌కు పట్టకూడదంటే ధరలకు తక్షణం కళ్ళెం వేయాలి. ఇప్పటికే కొవిడ్‌తో సతమతమవుతున్న చిన్నాపెద్దా పరిశ్రమలకు పులిమీద పుట్రలా ఉక్రెయిన్ యుద్ధం వచ్చి పడింది. రష్యా దండయాత్ర ప్రారంభించిన వెంటనే అంతర్జాతీయ విపణిలో చమురు, వ్యాపార సరకుల ధరలకు రెక్కలొచ్చాయి. దీనికి రూపాయి పతనం కూడా తోడవడంతో.. కష్టాలు ఇంకా పెరిగాయి.
ద్రవ్యోల్బణం వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది. నగదు విలువ తగ్గిపోవడంతో ప్రజల పొదుపు చేసే సామర్థ్యం పడిపోతుంది. దీనికి తోడు ఉపాధి అవకాశాలు తగ్గితే, ప్రజలు కష్టాల పాలవుతారు. ఇప్పుడు రూపాయి పతనంతో దిగుమతుల భారం పెరిగితే.. ప్రజల జేబులో చిల్లిగవ్వ లేని పరిస్థితి వస్తుంది. నోట్ల రద్దు, జీఎస్టీ, కార్పొరేట్ టాక్స్‌ను తగ్గించడం వంటి చర్యల వల్ల ద్రవ్యలోటు పెరిగింది. దాన్ని పూరించేందుకు పెట్రోల్‌పై సెస్‌ను కేంద్రం పెంచింది. పెట్రోల్‌పై విధిస్తున్న మొత్తం సుంకంలో కేంద్రం వసూలు చేస్తున్నది 63 శాతం కాగా, రాష్ర్టాలు వసూలు చేస్తున్నది 37 శాతం మాత్రమే. పెట్రోల్ రేట్ల పెంపు ద్వారా లక్షల కోట్లు వెనకేసుకున్న కేంద్రం.. ఈ పెరుగుదలకు అంతమెప్పుడో కూడా దిక్కుతెలియని స్థితిలో ఉండటం అతి పెద్ద విషాదం.
గత పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ ఏ రేంజ్ లో పతనమైందో ఇటీవలే విడుదలైన ఐఎంఎఫ్ గణాంకాలు కళ్లకు కడుతున్నాయి. పదేళ్ల క్రితం చిన్న దేశం బంగ్లాదేశ్ కంటే తలసరి ఆదాయంలో ఎంతో ముందున్న ఇండియా.. ఇప్పుడు అంతకతంకూ దిగజారిపోతోంది. కరోనా తర్వాత మన ఎగుమతులు డీలా పడ్డాయి. ఈ సంవత్సరం రికార్డు స్థాయి ఎగుమతులు చేసినా.. అది మన జీడీపీతో పోలిస్తే పెద్ద ఎక్కువేం కాదు. దేశంలో పడిపోతున్న కొనుగోలు శక్తి కూడా ఆందోళనకు దారితీస్తోంది. కరోనా తర్వాత ఇంతవరకూ ప్రజల ఆదాయాలు పెరగలేదు. ఓవైపు నిత్యావసరాల ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కానీ సామాన్యుడు మాత్రం ఏమీ కొనలేని స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు రూపాయి కూడా జీవనకాల కనిష్ఠానికి పతన కావడంతో.. ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలౌతుందనే మాట నిజం.
చిన్న మధ్య తరహా పరిశ్రమలు కష్టాల్లో కొట్టుమిట్టాడుతూనే ఉన్నాయి. వాటి ఉత్పత్తి కార్యకలాపాలు మామూలు సామర్ధ్య స్థాయికి చేరుకోడానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. ఉత్పత్తి సామర్థ్యం పెరగకుండా ఉపాధి అవకాశాలు మెరుగుపడవు. ఉత్పత్తి పెరగాలంటే మార్కెట్‌లో సరకులకు గిరాకీ పెరగాలి. మార్కెట్‌లో వినియోగ వస్తువులకు గిరాకీ పెరగాలంటే ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. అదే ఇప్పుడు లోపించింది. అన్ని వైపుల నుంచి మోపుతున్న భారాల నుంచి ప్రజలకు ఊరట కలిగించడానికి బదులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు, యూజర్ ఛార్జీలు, సెస్సులు, సర్‌చార్జీలు, విద్యుత్, ఆర్టీసీ చార్జీలను పెంచుతూ వారి నడ్డి విరుస్తున్నాయి.
పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం ఎడాపెడా పెంచుతూ పోతోంది. ఉక్రెయిన్ సంక్షోభాన్ని సాకుగా చూపి వంట నూనెలు, ఆహార వస్తువుల ధరలు కూడా ముండుతున్నాయి. పారిశ్రామిక మాంద్యం నుంచి బయటపడేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కోవిడ్ సమయంలో ప్రకటించిన 21 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో ప్రజలకు ఇచ్చింది ఒక శాతం మాత్రమే. తక్కినదంతా కార్పొరేట్లకు దోచిపెట్టింది కేంద్రం. ఎంఎస్‌ఎంఇలకు ఇచ్చింది అత్యల్పమే. ఇటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాల ప్రభావం జిడిపిపై కూడా పడింది. ఈ ఆర్థిక సంవత్సరం జిడిపి అంచనాలు తలకిందులయ్యే పరిస్థితి నెలకొంది. ఆర్థిక మందగమనం వల్లే దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోంది. దేశీయంగా డిమాండ్ మందగించడం, పెరుగుతున్న ధరలతో ఆర్థిక వ్యవస్థ రికవరీ నెమ్మదించడం వలన ఉద్యోగ అవకాశాలు దెబ్బతిన్నాయి.
మన దేశానికి సంబంధించినంత వరకు 2003-13 మధ్య కాలం జీడీపీకి సువర్ణాధ్యాయం అనే చెప్పాలి. ఆ దశాబ్దంలో వృద్ధిరేటు పరుగులు పెట్టింది. కానీ ఆ తర్వాతే మందగమనం మొదలైంది. సంక్షోభాలు మనకి కొత్తేం కాదు. కోవిడ్ లాంటి ఆరోగ్య మహమ్మారి నుంచి కూడా అతి తక్కువ నష్టంతో బయటపడ్డ సమర్థత మనకుంది. ఇప్పుడు పొంచి ఉన్న ఆర్థిక సంక్షోభాన్ని కూడా నివారించే మార్గాలున్నాయి. అయితే దీనికి ప్రభుత్వమే చొరవ చూపాల్సి ఉంటుంది. ప్రపంచ పరిస్థితుల్ని గమనిస్తూ వేగంగా సరైన నిర్ణయాలు తీసుకుంటేనే.. ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుంది. లేకపోతే మనమే సంక్షోభాన్ని ఆహ్వానించినవారమౌతాం.