తెలంగాణపై ఎన్నడూలేనంతగా ద్రుష్టిపెట్టింది భారతీయ జనతా పార్టీ. ఢిల్లీ టు తెలంగాణ గల్లీ అంటూ అలజడి పెంచుతోంది. హస్తిన పెద్దలు హైదరాబాద్ లో వరుసగా ల్యాండవుతున్నారు. తెలంగాణపై వాగ్ధానాలు కురిపిస్తూనే, టీఆర్ఎస్ సర్కారుపై వాగ్భాణాలు సంధిస్తున్నారు. తెలంగాణలో చీమ చిటుక్కుమన్నా వాలిపోతున్నారు. ప్రతి సమస్యపైనా జెట్ స్పీడ్ తో రియాక్ట్ అవుతున్నారు. ఒకరకంగా కాషాయదళం దండయాత్ర మొదలుపెట్టింది. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పించ్ హిట్టింగ్ చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటోంది. అందులో భాగంగానే ఏకంగా జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించాలని డిసైడ్ చేసి, ఇక సౌత్ లో తెలంగాణే తమ తదుపరి టార్గెట్ అని చెప్పేసింది కమలం సైన్యం.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు…జులై 2,3 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్నాయ్. కార్యవర్గ సమావేశాల్లో…దాదాపు 3వందల మంది ప్రముఖులు ఉండేలా నోవాటెల్ వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు, 18మంది బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, పార్టీ జాతీయ నేతలు హాజరుకానున్నారు. ప్రధాని మోడీ రెండు రోజుల పాటు రాజ్‌భవన్‌లోనే బస చేయనున్నారు. బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హోటళ్లలో బస చేయనున్నారు. రెండు రోజుల పాటు భాగ్యనగరమంతా కాషాయమయం కానుంది. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలక తీర్మానాలు చెయ్యనున్నారు. రాబోయే తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ దూకుడు ఎలా వుండబోతోందో ఇవన్నీ అద్దంపడుతున్నాయ్.
ఈ ఏడాది చివర్లో మోడీ సొంత రాష్ట్రం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయినా అహ్మదాబాద్, లేదంటే సిమ్లాలో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలనుకోలేదు బీజేపీ అగ్ర నేతలు. హైదరాబాద్ నే ఎంచుకుని, దక్షిణ భారతంలో కర్ణాటక తర్వాత బీజేపీకి అవకాశం వున్న రాష్ట్రంగా తెలంగాణను లెక్కలేస్తున్నారు. వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయ్. పార్టీ నేతలతో పాటు కేడర్‌ను సమాయత్తం చేయడం…ప్రత్యర్థులను ఆత్మరక్షణలో నెట్టడం లాంటి వ్యూహాల్లో భాగంగానే…జాతీయ కార్యకర్గ సమావేశాలకు…హైదరాబాద్‌ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది.
2019 ఎన్నికల నాటి నుంచే తెలంగాణపై నజర్ పెట్టింది బీజేపీ. ప్రతి అంశంపైనా దూకుడు ప్రదర్శించడం మొదలుపెట్టింది. కాంగ్రెస్ బలహీనతలను ద్రుష్టిలో పెట్టుకుని, టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని లెక్కలేస్తోంది. సెప్టెంబర్ 17ను విమోచన దినంగా అధికారికంగా జరపాలంటూ, గతేడాది అమిత్ షా నిర్మల్ సభలో పాల్గొనడం, ఆ సందర్భంగా గులాబీ, కమలం నేతల మధ్య మాటల తూటాలు పేలడం టాక్ ఆఫ్ ది తెలంగాణ అయ్యింది. అంతేకాదు, అన్ని ఇష్యూలపైనా శరవేగంగా స్పందిస్తోంది. ధాన్యం కొనుగోళ్లపై పెద్ద ఎత్తున వాదించింది. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలంటూ బండి సంజయ్ దీక్షను భగ్నం చెయ్యడం ఉద్రిక్తతకు దారి తీసింది. బండి అరెస్టును నిరసిస్తూ ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్య మంత్రి రమణ్‌సింగ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం బండి అరెస్టుకు నిరసనగా ఆందోళనకు దిగడం టెన్షన్ రాజేసింది. ఖమ్మంలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్యపై జాతీయ నాయకులు, కేంద్రమంత్రులే కదిలిరావడం రచ్చయ్యింది. తాజాగా సర్పంచ్ ల సమస్యలపైనా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామంటూ, తెలంగాణ పాలిటిక్స్ ను హీటెక్కిస్తోంది కాషాయ పార్టీ.
అవకాశం దొరికితే చాలు ఎక్కడున్నా హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కేస్తున్నారు కమలం నేతలు. బండి సంజయ్ రెండో విడత పాదయాత్ర ముగింపు సభలో కేంద్రహోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వార్షికోవత్సం కోసం హైదరాబాద్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ, బేగంపేట్ ఎయిర్ పోర్టులో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనంటూ శపథం చేశారు…బైట్…ప్రధాని మోడీ..
ఎప్పుడూ లేనిది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో అమిత్ షా పాల్గొనడం కూడా వ్యూహాత్మకమే. ఢిల్లీలో భారీ ఎత్తున తెలంగాణ అవతరణ ఉత్సవాలు నిర్వహించారు. అమిత్ షా తో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇందులో పాల్గొన్నారు. అప్పుడప్పుడయినా కేసీఆర్ నిజాలు చెప్పాలంటూ అమిత్ షా విమర్శించారు. తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందంటూ కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చి, తాడోపేడోకు సై అంటూ సిగ్నల్ ఇచ్చారు అమిత్ షా….బైట్…అమిత్ షా
కొన్ని రోజుల నుంచి గవర్నర్ తమిళ సైతో, టీఆర్ఎస్ సర్కారు కోల్డ్ వార్ కూడా, రాజకీయ కోణంలోనే చాలామంది చూస్తున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ పై అస్సాం సీఎం హేమంత బిశ్వాస్ శర్మ, సీఎం కేసీఆర్ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో సాగింది. ఇక జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్షణ్ కు రాజ్యసభ సీటు ఇవ్వడం కూడా, వ్యూహాత్మకమే. సోషల్ ఇంజినీరింగ్ లో భాగంగా బీసీలను ఆకట్టుకునేందుకే లక్ష్మణ్ ను పెద్దల సభకు పంపుతున్నారని తెలుస్తోంది. అలాగే గతంలో అమిత్ షా కూడా ఎస్సీలు, గిరిజనులతో సహపంక్తి భోజనాలు చెయ్యడం కూడా సామాజిక సమీకరణల అస్త్రమే అనడంలో ఎలాంటి సందేహం లేదు
ఇలా తెలంగాణలో ప్రతి అంశంపైనా దీటుగా స్పందిస్తోంది బీజేపీ. స్థానిక అంశాలను ఎత్తుకోవడం, రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తడం, కాంగ్రెస్ కంటే వేగంగా పావులు కదపడం, బీజేపీ ఎత్తుగడల్లో భాగమే. బూత్ స్థాయిలో క్యాడర్ ను సమాయత్తం చేస్తోంది. తెలంగాణ బీజేపీ నేతలకు పదవులు ఇస్తూ జోష్ నింపుతోంది. ఇప్పుడు ఏకంగా జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ ను ఎంచుకుని, దండయాత్రను మరింత వేగవంతం చెయ్యాలనుకుంటోంది కాషాయదళం.
భారతీయ జనతా పార్టీ అంటేనే ఉత్తరాది పార్టీగా ముద్ర వుంది. ఉత్తర భారతమే బీజేపీకి బలం కూడా. 2014, 2019లో నార్త్ ఇండియాలో సాధించిన సీట్లే, ఢిల్లీ పీఠంపై కూర్చోబెట్టాయి. ఇప్పటికే 18 రాష్ట్రాల్లో అధికారంలో వుంది. కాషాయ అలజడే లేని నార్త్ ఈస్ట్ లో ఎంట్రీ ఇచ్చింది. ఎర్రజెండాలకు కంచుకోగా భావించే పశ్చిమ బెంగాల్ లో టీఎంసీకి ప్రత్యామ్నాయంగా తిష్టవేసింది. ఇలా నార్త్, నార్త్ ఈస్ట్, బెంగాల్ లో దూసుకొచ్చింది. అయితే, 2024 లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరాదిలో ఎన్ని సీట్లు వస్తాయన్నది చెప్పలేం. పదేళ్ల పాలన కాబట్టి, ప్రభుత్వ వ్యతిరేకత ఏదో ఒకస్థాయిలో వుంటుంది. ఆ మేరకు లోక్ సభలో బీజేపీకి సీట్లు తగ్గుతాయి. వాటిని పూడ్చుకోవడానికి కమలం ముందున్న ఆప్షన్ దక్షిణ భారతమే.
సౌత్ ఇండియాలో పట్టు సాధించాలని దశాబ్దాలుగా కమలం చెయ్యని ప్రయత్నం లేదు. కానీ ప్రాంతీయ పార్టీల బలం ముందు తేలిపోతోంది. తమిళనాడులో స్కోపు లేదు. శబరిమల, లవ్ జీహాద్ తో పాటు అనేక ఇష్యూలు రగిలించినా కేరళలో చొచ్చుకెళ్లలేక చతికిలబడుతోంది. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే పదేళ్లలో కనీసం కనుచూపు ప్రభావం కనిపించడం లేదు. కర్ణాటకలోక్యాస్ట్, మతం అంటూ అధికారంలోకి వచ్చినా, అక్కడా యాంటి ఇమ్ కమ్ బెన్సీ తప్పదు. ఇలా సౌత్ లో అన్ని రాష్ట్రాల్లో లెక్కలూ ముందుపెట్టుకున్న కాషాయదళానికి, తెలంగాణ ద్వారమే రారమ్మంటోందని భావిస్తోంది భారతీయ జనతా పార్టీ.
తెలంగాణలో ముందు నుంచి బీజేపీకి సాంప్రదాయ ఓటు బ్యాంకు వుంది. హైదరాబాద్ క్షేత్రస్తాయిలో కమలం వేళ్లూ బలంగా వున్నాయి. పాతబస్తీలో హిందూ-ముస్లిం పోలరైజేషన్ తో భాగ్యనగరంలో ఎన్నో కొన్ని సీట్లు సాధిస్తోంది. అదేపనిగా ఎంఐఎంతో కుస్తీతో భావోద్వేగాలను మండిస్తోంది. మొదటి నుంచి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజవర్గంలో అడపాదడపా గెలుస్తూ వస్తోంది. హైదరాబాద్ లో కాంగ్రెస్ బలహీనంగా వుండటం కూడా కమలానికి కలిసొస్తోంది. హైదరాబాద్ తో పాటు తెలంగాణలో కొన్ని అర్భన్ ప్రాంతాల్లోనూ బలపడేందుకు ప్రయత్నిస్తోంది. పట్టణ యువకుల్లో రైట్ వింగ్ భావజాలాన్ని వ్యాప్తి చెయ్యడంలో కొంత సక్సెస్ అయ్యింది. నిర్మల్, భైంసా, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ వంటి పట్టణాల్లో తమకు బలం పెరుగుతోందని బీజేపీ గణం భావిస్తోంది.
చిన్న సందు దొరికితే చాలు చెలరేగిపోవడం బీజేపీ స్టైల్. అలాంటిది 2019 ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలు గెలిచిన తర్వాత ఊరుకుంటుందా…చొచ్చుకెళ్లడం ప్రారంభించింది. ఎవరి అంచనాకు అందకుండా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ లో పాగా వేసింది. ఈ ఫలితాలు తెలంగాణ వైపు బీజేపీ అగ్రనాయకత్వం ద్రుష్టిపెట్టడానికి బూస్టింగ్ నిచ్చింది. దుబ్బాక బైపోల్ లో గెలిచిన తర్వాత కమలం కాన్ఫిడెన్స్ మరో రేంజ్ కి వెళ్లింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తర్వాత ఎక్కువ స్థానాలు కొల్లగొట్టడంతో, కాషాయానికి పట్టపగ్గాల్లేకుండాపోయాయి. వీటి తర్వాత నాగార్జున సాగర్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెనకబడినా, హుజూరాబాద్ బంపర్ విక్టరీ మాత్రం ఎనలేని ఆత్మవిశ్వాసం నింపింది కమలానికి. హుజూరాబాద్ గెలుపు తర్వాత ఈటెల రాజేందర్ కు పీఎం మోడీ ఫోన్ చేసి అభినందినంచారు. అమిత్ షా ప్రశంసలతో ముంచెత్తారు. ఈ విజయం జాతీయస్థాయిలో మారుమోగేలా చెయ్యడంలో కాషాయ శ్రేణులు పకడ్బందీగా వ్యవహరించాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో, ఇక గులాబీ దళానికి తామే ప్రత్యామ్నాయం అన్న నిర్ణయానికి వచ్చేసింది కమలం సైన్యం.
హుజూరాబాద్ గెలుపు తర్వాత సమీకరణాలు మారిపోయాయి. బీజేపీ చాపకింద నీరులా విస్తరిస్తోందని భావించిన కేసీఆర్, వరుసబెట్టి విమర్శలు కురిపించారు. క్షేత్రస్తాయిలతో కమలం పార్టీని ఇరుకునపెట్టాలని ఉద్దేశపూర్వకంగా , గులాబీ బాస్ ఆరోపణలు కురిపించారు. జాతీయస్థాయిలో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ కు నడుంకట్టారు. అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నారు. పదేపదే కేంద్రాన్ని ఢీకొడతానంటూ,వ్యూహాత్మకంగా బీజేపీని కార్నర్ చేస్తున్నారు. ఈ స్ట్రాటజీ కమలానికే ప్లస్సయ్యింది. ధాన్యం కొనుగోళ్లు మొదలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల పంపిణీ, అధికారాలు ఇలా అనేక అంశాలపై డైలాగ్ వార్ పీక్స్ చేరింది. కాళేశ్వరంతో పాటు అనేక సాగునీటి ప్రాజెక్టులు కేసీఆర్ కు ఏటీఎంలా మారాయని దుమ్మెత్తిపోస్తోంది. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తున్నారని విమర్శిస్తోంది. శివాలయాలు, మసీదులు వంటి సున్నిత అంశాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి, కావాల్సినంతగా రైట్ వింగ్ భావాజాలాన్ని జనంలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తోంది. పదేపదే కేసీఆర్ తమనే విమర్శించడం, అనుకూలంగా మలచుకుంది బీజేపీ. ఇంకాస్త కష్టపడితే చాలు తెలంగాణ తమదేనని గట్టిగా డిసైడయ్యింది. అందుకే తెలంగాణపై ఈ రేంజ్ లో నజర్ పెట్టింది.
బీజేపీ కేంద్రంలో అధికారం వుంది. అనేక వ్యవస్థల బలం వుంది. బలగానికి కొదువే లేదు. ఆయుధాలకు కరువే లేదు. గ్రౌండ్ లెవల్లో ఆరెస్సెస్ దాని అనుబంధ విభాగాల దన్ను. సోషల్ మీడియా దండు. అమ్ములపొదిలో హిందూత్వ అజెండా. చిన్నపామునైనా పెద్దకర్రతో కొట్టాలన్న నానుడిని, నరనరాన జీర్ణించుకున్న బీజేపీ, ప్రతి సమస్యపై బలంగా కదులుతోంది. ఇష్యూ ఏదైనా ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులను దింపుతోందంటే, తెలంగాణపై ఎంత ఆశ, ఎంత ఆత్మవిశ్వాసంతో వుందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో బీజేపీ అలజడి పెరిగిందన్న చర్చను రేకెత్తించడంలో సక్సెస్ అయ్యింది
మిషన్ తెలంగాణను మరింత స్పీడప్ చేసేందుకే అన్నట్టుగా జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తోంది. వీటికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు 18 రాష్ట్రాల బీజేపీ సీఎంలు హాజరు అవుతుండటం, మామూలు విషయం కాదు. సమావేశాలకు ముందు, ఆ తర్వాత కనీసం వారం రోజుల పాటు హాట్ హాట్ డిస్కషన్ మొత్తం కమలం చుట్టే తిరుగుతుంది. అదే వేదికగా తెలంగాణపై పీఎం మోడీ ఏం మాట్లాడినా సంచలనమే అవుతుంది. అమిత్ షా తనదైన శైలిలో కాక రేపే కామెంట్లు చేస్తే, మాటల యుద్ధం మామూలుగా వుండదు. ఇక బండి సంజయ్, కిషన్ రెడ్డితో పాటు బీజేపీ సీఎంల వ్యాఖ్యలు కూడా కాక రేపడం గ్యారంటీ. దీనికి టీఆర్ఎస్ నుంచి కూడా అదేస్థాయిలో కౌంటర్లు పడిపోతాయి. తమకూ కావాల్సింది అదేనంటోంది బీజేపీ.
NOW ARE NEVER. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ అన్నట్టుగా తెలంగాణలో బీజేపీ అడుగులు పడుతున్నాయి. తెలంగాణలో గతంలో ఎప్పుడూ లేనంత అనుకూల పరిస్థితులున్నాయని, పూర్తిస్థాయి శక్తియుక్తులు కేంద్రీకరించి పనిచేయాలని కాషాయ పార్టీ భావిస్తోంది. అమిత్ షా దగ్గర్నుంచీ.. బండి సంజయ్ వరకు ఎవర్ని కదిలించినా.. ఎన్నికలు రావడమే ఆలస్యమని ఢంకా బజాయిస్తారు. కానీ వాస్తవంగా తెలంగాణలో బీజేపీకి అధికారం ఖాయమేనా.. అంటే కచ్చితంగా అవును అని చెప్పలేని పరిస్థితి. ఈ విషయం కాషాయ పార్టీ నేతలకు కూడా బాగా తెలుసు. కానీ లక్ష్యం ఎప్పుడూ పెద్దదిగా ఉండాలనేది బీజేపీ మౌలిక సూత్రం. అధికారంలోకి వస్తామా.. రాదా అనేది తర్వాత విషయం. కానీ టార్గెట్ మాత్రం కచ్చితంగా అధికారమే అయ్యుండాలనేది ఆ పార్టీ ప్లాన్. అందుకు అనుగుణంగానే కింది స్థాయి నుంచి క్యాడర్ ను సిద్ధం చేస్తోంది. కానీ అన్ని పార్టీల్లాగే బీజేపీలోనూ సవాలక్ష అంతర్గత సమస్యలు, కోల్డ్ వార్ లు తిష్టవేసుకు కూర్చున్నాయి. కాంగ్రెస్ వంటి పార్టీల్లో విభేదాలు బయటపడితే, బీజేపీలో మాత్రం లోలోపల రగులుతున్న అగ్నిపర్వతంలా మండుతుంటాయి..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడు మీద బీజేపీ చాలా ఆశలే పెట్టుకుంది. శివం, శవం అంటూ ఆయన వదిలే డైలాగ్ బాంబ్స్ కాంట్రావర్సీలు క్రియేట్ చేస్తుంటే సంబరపడుతోంది. బండి అధ్యక్షుడైన తర్వాత తెలంగాణ బీజేపీలో అలజడి పెరిగిందని ఢిల్లీ పెద్దలు లెక్కలేస్తున్నారు. కానీ బండి సంజయ్ వర్సెస్ సీనియర్లుగా తెలంగాణ కాషాయం లోలోపల కస్సుమంటోంది. బండికి బ్రేకులేసేందుకు శాయశక్తులా కొందరు సీనియర్లు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నారన్నది పార్టీలో టాక్. బండితో మిగతా సీనియర్ల మధ్య సమన్వయం కనిపించడం లేదు. తెలంగాణ బీజేపీ అగ్రనేతలంతా కలిసి పాల్గొనే కార్యక్రమాలు అరుదు. గ్రామీణ ప్రాంతానికి చెందిన బండి సంజయ్ చెప్పినట్టుగా నడుచుకునేందుకు హైదరాబాద్ కాషాయ నేతలకు ఈగో అడ్డొస్తోందన్న చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది….విజువల్స్
రాష్ట్రమంతా బలమైన ఫేస్ వున్న పాపులర్ లీడర్ కొరత
కాషాయ పార్టీలో ప్రజాకర్షక, క్రౌడ్ పుల్లర్ల ఎక్కడ?
బీజేపీకి తెలంగాణలో క్యాడర్ వున్నా లీడర్ లేడన్న మాటలు కొత్తకావు. రాష్ట్రమంతా కాషాయ పార్టీకి బలమైన ఫేస్ వున్న పాపులర్ లీడర్ లేకపోవడం మైనస్ గా కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ వంటి నాయకున్ని ఎదుర్కొనే, సరిజోడయిన ఆ స్థాయి లీడర్ లేరు. హుజూరాబాద్ గెలుపు తర్వాత ఈటల రాజేందర్ ను ప్రొజెక్ట్ చెయ్యడానికి ఒకవర్గం ప్రయత్నించినా, మరోవర్గం అడ్డుపుల్ల వేసిందన్న చర్చ జరిగింది. బండి సంజయ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడైనా, ఆయన నాయకత్వానికి సొంత పార్టీలోనే ఆమోదంలేదన్నది బహిరంగ రహస్యం. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వంటి అగ్రెసివ్ లీడర్సున్నా, కాషాయ పార్టీలో అలాంటి ప్రజాకర్షక, క్రౌడ్ పుల్లర్ల కొరత వుందన్నది రాజకీయ పండితుల విశ్లేషణ.
2019 నుంచి తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. కానీ అప్పటి నుంచి పార్టీలో పెద్దగా చేరికల్లేవు. టీఆర్ఎస్, కాంగ్రెస్ ల నుంచి గెలుపు గుర్రాలు అనదగ్గ లీడర్లు కాషాయ కండువా కప్పుకునేందుకు ముందుకు రాకపోవడం మైనస్సే. 119 నియోజకవర్గాలకు సరిపడ ఎమ్మెల్యే అభ్యర్థులు బీజేపీలో వున్నారా అన్న ప్రశ్న పొలిటికల్ సర్కిల్ వినిపిస్తోంది. అధికారంలోకి రావాలంటే నియోజకవర్గస్థాయిలో అభ్యర్థులు వుండాలి. కేసీఆర్, జగన్ ల మాదిరి, అభ్యర్థులను గెలిపించే టాప్ లీడర్ లేడు. మోడీ, అమిత్ షాల పేర్లు చెబితే కొన్ని ఓట్లు పతాయేమో కానీ సీట్లు రావు. అటువంటప్పుడు, సెగ్మెంట్ లో ఫెమిలియర్ అభ్యర్థులు కావాలి. మిగతా టీఆర్ఎస్, కాంగ్రెస్ లలో నియోజకవర్గస్థాయిలో రాష్ట్రస్థాయి నేతలని పేరున్న నాయకులున్నారు. బీజేపీలో అదే కొరతగా వుంది.
ప్రస్తుతం తెలంగాణలోని అనేక నియోజకవర్గాల్లో బలమైన నాయకులను తమ పార్టీలో చేర్చుకోవాలనే వ్యూహంతో వుంది బీజేపీ. ఈ మేరకు పలువురు నేతలతో ఆ పార్టీ స్థానిక నేతలు సంప్రదింపులు కూడా జరుపుతున్నారనే వార్తలు వినిపించిన మాట కూడా వాస్తవమే. అయితే బలమైన నేతలను పార్టీలో చేర్చుకోవడం కంటే ముందు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వారిని పార్టీలో చేర్చుకోవాలని ఈటల రాజేందర్ బీజేపీ పెద్దలకు సలహా ఇచ్చారని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఎలాగైనా మళ్లీ తెలంగాణవాదాన్ని, సెంటిమెంట్‌ను రగిలించే ప్రయత్నం చేస్తారని.. అప్పుడు దాన్ని ఎదుర్కొనేందుకు పార్టీలో ఉద్యమంలో పని చేసిన వాళ్లు ఉంటే బాగుంటుందని ఆయన పార్టీ పెద్దలకు చెప్పినట్టు టాక్. ఈటల రాజేందర్ ప్రతిపాదనకు బీజేపీ పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? ఇచ్చినా చేరికలు ఎందుకంతగా లేవనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
తెలంగాణలోని 31 ఎస్టీ, ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాలపై ఆ పార్టీ చాలాకాలం క్రితమే ఫోకస్ పెట్టడం మొదలెట్టింది. రాష్ట్రంలోని ఈ రిజర్వ్‌డ్ స్థానాల్లో దాదాపు సగం గెలుచుకుంటేనే తమకు తెలంగాణలోని అధికారం దక్కుతుందనే నిర్ణయానికి వచ్చారు కమలం పార్టీ నేతలు. అయితే ఈ నియోజకవర్గాల్లో బీజేపీ అంతగా బలంగా లేదు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఏ రకంగా గెలవాలనే దానిపై ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది బీజేపీ. కానీ అభ్యర్థుల కొరతే పెద్ద సమస్యగా వుంది..
కాంగ్రెస్ బలహీనతలే తనకు బలమమని బీజేపీ లెక్కలేస్తోంది. కానీ క్షేత్రస్తాయిలో కాంగ్రెస్ కు చెక్కుచెదరని క్యాడర్ వుంది. సాంప్రదాయ ఓటు బ్యాంకు వుంది. హస్తం గుర్తు అంటే నిరక్షరాస్యులు కూడా గుర్తించే పరిస్థితి వుంది. కానీ పట్టణాల్లో బలంగా కనిపించే కాషాయదళానికి గ్రామాల్లో మాత్రం ఇప్పటికీ పెద్దగా బలం కనపడ్డం లేదు. పట్టణ యూత్ లో మన జాతి, మన దేశం వంటి భావాలు రేకెత్తించినా, పల్లెల్లో వుండే సామాన్య జనానికి అవి అంత తొందరగా ఎక్కే అవకాశం తక్కువ. గ్రామీణంలోనూ బలం పెంచుకుంటేనే బీజేపీ టార్గెట్ రీచ్ అవుతుంది..
ఉన్న రాష్ట్రాల్లో అధికారం నిలబెట్టుకోవడం, కొత్త రాష్ట్రాల్లో బలపడటం.. ఇదే జాతీయ స్థాయిలో బీజేపీ అనుసరిస్తున్న విధానం. ఏటా దేశంలో పార్టీ బలపడటానికి అవకాశం ఉన్న రాష్ట్రాల్ని, జాతీయ నాయకత్వం ఐడెంటిఫై చేస్తోంది. అలా గుర్తించిన రాష్ట్రాల్లో బెంగాల్ తో పాటు తెలంగాణ కూడా ఉంది. బెంగాల్లో ఇప్పటికే బీజేపీ ప్రతిపక్ష స్థాయికి చేరుకుంది. ఇక నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే. తెలంగాణలో కూడా అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రతిపక్షమైనా.. ఎంపీ స్థానాల పరంగా తామే సెకండ్ ప్లేస్ లో ఉన్నామని బీజేపీ చెప్పుకుంటోంది. ఇదే ఊపులో ఎమ్మెల్యే స్థానాల సంఖ్యలోనూ రెండో స్థానానికైనా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. కుదిరితే అధికారం.. లేకపోతే ప్రతిపక్షం.. అంతకుమించి తగ్గడానికి అస్సలు వీల్లేదని అమిత్ షా నుంచి జేపీ నడ్డా వరకు రాష్ట్ర బీజేపీకి టార్గెట్లు ఫిక్స్ చేశారు. ఇప్పటికే బీజేపీ బలంగా ఉన్న నియోజకవర్గాలు, గెలుపు అవకాశాలు ఉన్న స్థానాలు, పూర్తిగా బలహీనంగా ఉన్న నియోజకవర్గాల లెక్కలు తీసినట్టు తెలుస్తోంది. కానీ క్షేత్రస్తాయిలో లోపాలు సరిచేసుకుంటూనే, ఆ లక్ష్యానికి చేరుకోవడం సాధ్యమంటున్నారు విశ్లేషకులు.
మొత్తానికి కొన్ని నెలలుగా అనేక ఇష్యూల మీద టీఆర్ఎస్, బీజేపీ మధ్య సాగుతున్న మాటల యుద్ధం నెక్ట్స్ లెవల్ కు వెళుతోంది. అటు కేసీఆర్ జాతీయ రాజకీయాలపైనే ద్రుష్టిపెట్టడంతో, బీజేపీ కూడా గులాబీ గ్రౌండ్ లో బలంగా ఢీకొట్టాలని ఫిక్సయ్యింది. తెలంగాణలో కేసీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తే, నేషనల్ లెవల్లోనూ ఆయనకు బ్రేకులు వెయ్యొచ్చని భావిస్తోంది. అందులో భాగంగా వరుసబెట్టి అగ్రనేతలు హైదరాబాద్ లో వాలిపోతున్నారు. నెల రోజుల వ్యవధిలో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా వంటి టాప్ లీడర్స్ భాగ్యనగరానికి వచ్చి కాషాయ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. జులైలో జరగబోయే జాతీయ కార్యవర్థ సమావేశాలతో, ఇక మరింత అలజడి పెంచాలని డిసైడయ్యారు. దేశం ద్రుష్టిని హైదరాబాద్ పై మళ్లించాలనుకుంటున్నారు. మరి కాషాయ దూకుడుకు కేసీఆర్ ఎలా బ్రేక్ వేస్తారు? బీజేపీ దండయాత్రను ఎలా అడ్డుకుంటారు? రాహుల్ గాంధీ టూర్ తో మాంచి జోష్ మీదున్న కాంగ్రెస్, పొలిమేరల్లోనే కమలదళానికి కళ్లెం వెయ్యడానికి ఎలాంటి అస్త్రాలు తీస్తుంది? ఒక్కటి మాత్రం ఫిక్స్. రాబోయే కొన్ని నెలలు తెలంగాణ రాజకీయం…రణరంగమే.