Bihar Politics :బీహార్ పరిణామాల తర్వాత దేశంలో పొలిటికల్ సీన్ మారే పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీకి ఒక్కొక్కటిగా మిత్రపక్షాలు దూరం కావడం.. ప్రతిపక్ష శిబిరానికి సంతోషం కలిగించే పరిణామంగా మారుతోంది. కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదంతో మొదలైన బీజేపీ రాజకీయం.. చివరకు ఎన్డీఏలో ఆ పార్టీని ఏకాకిగా మార్చేస్తోంది.
ప్రత్యర్థిని నిర్మూలించడమే నయాబిజెపి విధానం . అయితే, ఇది ప్రత్యర్థుల నుంచి మిత్రుల వరకు వచ్చాక రాజకీయాలు మారుతున్నాయి. ఒకరొకరుగా మిత్రులు దూరమవుతూ, చివరికి ప్రతిపక్షాల ఐక్యతకి దారితీస్తోంది.
బీహార్ వేదికగా ప్రతిపక్షాల ఐక్యత సందేశం ఇచ్చారు నితీష్. 2024 అంత వీజీ కాదంటూ మోడీకి నేరుగా సవాల్ విసిరారు. హిందీ బెల్ట్ లో బీజేపీకి ఒక్క మిత్రపక్షం కూడా లేదని గుర్తుచేశారు తేజస్వి యాదవ్.
బీహార్లో జరుగుతున్న పరిణామాలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. వరుసగా ప్రాంతీయ పార్టీలకు చెక్ పెడుతున్న బీజేపీకి.. ముందస్తు ఝలక్ ఇచ్చిన వ్యక్తిగా నితీష్ ను చూస్తున్నారు. బీహార్ కేంద్రంగా మరోసారి రాజకీయం మారుతుందని నితీష్ ఇచ్చిన పిలుపు కూడా గతాన్ని గుర్తుచేస్తోంది. ఇందిర హయాంలో ఎమర్జెన్సీ పెట్టినప్పుడు.. బీహార్ వేదికగానే సంపూర్ణ క్రాంతి విప్లవం మొదలైంది. ఇప్పుడు కూడా బీజేపీకి వ్యతిరేకంగా బీహార్లోనే విప్లవం మొదలైందంటున్నాయి విపక్షాలు.
బీజేపీతో నితీష్ పొత్తు తెంచుకున్న రోజే.. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కీలక ప్రకటన చేశారు. బీజేపీకి కీలకమైన హిందీ బెల్ట్ లో ఆ పార్టీకి ఇప్పుడు ఒక్క మిత్రపక్షం కూడా లేదని సెటైర్లేశారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక నితీష్ కూడా జాతీయ రాజకీయాల గురించి మాట్లాడారు. మోడీ 2014లో గెలిచి ఉండొచ్చు కానీ.. 2024లో కష్టపడాల్సి వస్తుందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు ఏకమౌతాయనే సందేశం పంపారు. ప్రధాని పదవికి పోటీదారుడ్ని కానని కూడా చెప్పేశారు నితీష్.
కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేది బీజేపీ నినాదం. కానీ ఇప్పుడు ఎన్డీఏ అనేది పేరుకే కానీ.. అందులో బీజేపీ మినహా చెప్పుకోదగ్గ మరో పార్టీ లేని స్థితి వచ్చింది. మిత్రపక్షాలతో బీజేపీ వ్యవహారశైలి కారణంగా కశ్మీర్ నుంచి ఏపీ వరకు చాలా పార్టీలు ఎన్డీఏకి దూరమయ్యాయి. కుదిరితే చీలిక.. కుదరకపోతే బ్లాక్ మెయిలింగ్ అన్నట్టుగా సాగుతున్న బీజేపీ పాలిటిక్స్.. ప్రాంతీయ పార్టీలకు నచ్చడం లేదు. ఫ్రెండ్ షిప్ పేరుతో అసలుకే ఎసరు పెడుతున్నారనే ఆగ్రహం కనిపిస్తోంది. బీజేపీ అంటేనే ఓ అపనమ్మకం ఏర్పడింది. అధికారం కోసం ఏమైనా చేస్తోందనే ఆరోపణలున్నాయి. మిత్రపక్షాన్ని బలహీనపరిచి.. తాను బలపడటం ఏం నైతికత అనే ప్రశ్నలు దూసుకొస్తున్నాయి. అయితే అన్నిచోట్లా తప్పు బీజేపీదే అని చెప్పలేం. కొన్నిచోట్ల మిత్రపక్షాల స్వయంకృతాలు కూడా ఉన్నాయి. ఎవరేమనుకున్నా బీజేపీకి స్పష్టమైన రాజకీయ లక్ష్యాలున్నాయి. తమ అజెండాకు అనుగుణంగా పొత్తులు కలుపుకోవడం, లేకపోతే తీసిపారేయడానికి ఆ పార్టీ పెద్దగా ఆలోచించడం లేదు. ఇప్పుడు బీహార్ లో కూడా జేడీయూని కావాలనే వదిలించుకున్నారనే చర్చ జరుగుతోంది.
ఐదేళ్ల క్రితం బీహార్ సంకీర్ణంలో సీనియర్ భాగస్వామిగా ఉన్న జేడీయూ.. ఇప్పుడు జూనియర్ గా మారిపోయింది. చిరాగ్ పాశ్వాన్ ను పావుగా వాడి జేడీయూను బలహీనపరిచిన బీజేపీ.. తన బలం బాగా పెంచుకుంది. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ గా అధికారంలోకి రావాలని బీజేపీ టార్గెట్ గా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఈలోగా 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ సీట్లు గెలవడం కూడా కాషాయా పార్టీకి అవసరం. బీహార్లో మొత్తం 40 ఎంపీ సీట్లున్నాయి. 2019లో బీజేపీ, జేడీయూ కూటమికి 39 సీట్లు వచ్చాయి. ఈసారి ఆ ఫీట్ రిపీట్ చేయడం కష్టం కావచ్చు కానీ.. అసాధ్యం కాదనే భావనతో ఉంది బీజేపీ.
2014లో ఎన్డీఏ స్వరూపానికి.. ఇప్పటికీ ఎక్కడా పోలికే లేదు. ఇప్పుడు పేరుకే ఎన్డీఏ ఉంది. చెప్పుకోదగ్గ పార్టీ బీజేపీ మాత్రమే. మిగతావన్నీ చిన్నాచితకా పార్టీలు. వీటిలో ఏదీ కనీసం ఒక రాష్ట్రం మొత్తం మీదా ప్రభావం చూపే స్థాయి ఉన్నవి కాదు. తమకు సింగిల్ గా మెజార్టీ వచ్చినా.. మిత్రధర్మానికి కట్టుబడి సంకీర్ణ సర్కారు నడుపుతున్నామనేది బీజేపీ వాదన. నిజానికి బీజేపీ కర్రపెత్తనం చేస్తోందనేది మిత్రపక్షాల ఆవేదన. 2014లో కొత్తగా ఎన్డీఏలో చేరిన పార్టీలే కాదు. దశాబ్దాలుగా సన్నిహితంగా ఉన్న పాతమిత్రులు కూడా బీజేపీని భరించలేని స్థితి వచ్చేసింది. మిత్రుల్ని పొమ్మనకుండా పొగ బెట్ట కళలో కూడా బీజేపీ ఆరితేరింది. బీజేపీతో ఎవరు పొత్తు పెట్టుకున్నా.. అంతే అన్నట్టుగా ఉంది రాజకీయ ముఖచిత్రం.
దేశం అంతా తామే అధికారంలో ఉండాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. బహిరంగంగా అదే విషయం ప్రకటిస్తోంది కూడా. ప్రాంతీయ పార్టీల అండతో రాష్ట్రాల్లో బలపడి .. ఆ తర్వాత అదే ప్రాంతీయ పార్టీలను టార్గెట్ చేస్తూ రాజకీయం చేస్తోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. అలా ఇప్పుడు నితీష్ టార్గెట్ చేసిందనేది కూడా ఓ ఆరోపణ. నిజానికి వరుస పరిణామాలకు ఈ మాటలకు మరింత బలం చేకూర్చేలా కనిపిస్తున్నాయ్. ఇప్పుడు బిహార్ మాత్రమే కాదు.. ఈ మధ్యే ముగిసిన మహారాష్ట్ర పంచాయితీతో పాటు.. పంజాబ్‌లో శిరోమణి అకాళీదళ్‌తో దోస్తీకి కూడా బ్రేక్ పడింది.
రెండు ప్రాంతీయ పార్టీల్లో చెలరేగిన అలజడిని.. బీజేపీ అనుకూలంగా మార్చుకుంది. పరోక్షంగా మద్దతు సంపాదించింది. బిహార్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ.. ఎన్డీఏలో ఒకప్పుడు భాగంగా ఉండేది. కానీ రామ్‌విలాస్ పాశ్వాన్ మరణం తర్వాత ఎల్‌జేపీ పగ్గాలు చేపట్టిన ఆయన కొడుకు చిరాగ్ పాశ్వాన్‌ను బీజేపీ పావుగా వాడుకొందన్న విమర్శలున్నాయి. బీహార్ ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థులున్న చోట బలమైన క్యాండిడేట్లను నిలబెట్టడం ద్వారా ఓట్లను చీల్చింది ఎల్‌జేపీ. ఎన్నికలయ్యాక చిరాగ్‌ను పట్టించుకోవడం మానేసింది బీజేపీ నాయకత్వం. అదే సమయంలో ఎల్‌జేపీలో చెలరేగిన తిరుగుబాటు సమయంలో … చిరాగ్ పాశ్వాన్ స్థానంలో ఆయన బాబాయి పశుపతి కుమార్ పరాస్‌కు బీజేపీ సపోర్ట్ చేసింది. ప్రస్తుతం పార్టీ పూర్తిగా పశుపతి హ్యాండోవర్‌లో ఉంది. పాశ్వాన్ వారసుడిగా చక్రం తిప్పుదామనుకున్న చిరాగ్.. బీహార్ పాలిటిక్స్‌లో కంప్లీట్‌గా సైడ్ అయిపోయారు.
మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి. ఒకప్పుడు శివసేన మద్దతుతో మహారాష్ట్రలో నిలబడ్డ బీజేపీ.. ఇప్పుడు ఆ పార్టీనే మింగేసే పరిస్థితి వచ్చింది. సీఎం పదవి విషయంలో వచ్చిన పేచీతో ఎన్నో ఏళ్లుగా కలిసి వస్తున్న శివసేనకు రాం రాం చెప్పేసింది బీజేపీ. అటు కాంగ్రెస్, ఎన్సీపీతో శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెండున్నరేళ్లు పూర్తికాకముందే.. శివసేనలో రేగిన అసమ్మతిని తమకు పూర్తి అనుకూలంగా మార్చుకుంది కమలం పార్టీ. దీంతో ఇప్పుడు శివసేన పార్టీ అస్తిత్వం కోసం పోరాడాల్సిన వచ్చిన పరిస్థితి. షిండే ప్రభుత్వంతో ఒకరకంగా మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం మనుగడలో ఉన్నట్లే అన్న చర్చ నడుస్తోంది. ఇక తమిళనాడులోనూ ఇదే పరిస్థితి. ఎన్నికల ముందు అన్నాడీఎంకేకు అన్ని విధాలుగా మద్దతు ప్రకటించారు. ఇప్పటికిప్పుడు ఏఐడీఎంకే వచ్చే లాభం లేదని.. కమలం పార్టీ దూరంగా ఉంటోంది.
ఇక వ్యవసాయ చట్టాల విషయంలో శిరోమణి అకాళీదళ్ కూడా.. బీజేపీతో దోస్తీ గుడ్‌బై చెప్పింది. అటు అమరీందర్ సింగ్‌ను కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేలా చేసింది. పార్టీ పెట్టించి ఆయనతో పొత్తు పెట్టుకుంది. కానీ.. బీజేపీ-అమరీందర్ కూటమి పంజాబ్‌లో ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. పంజాబ్ సీఎంగా, కాంగ్రెస్ నేతగా తిరుగులేని అధికారం చెలాయించిన అమరీందర్ సింగ్.. ఇప్పుడు అడ్రస్‌లేకుండా పోయారు. ఇలా కొందరు బీజేపీకి దూరంగా ఉంటే.. కొందరిని వ్యూహాత్మంగా బీజేపీ దూరం పెట్టిందన్న చర్చ నడుస్తోంది.
మీ ఇంటికొస్తే నాకేమిస్తావ్.. మా ఇంటికొస్తే నాకేం తెస్తావ్.. అన్నట్టుగా ఉంది మిత్రులతో బీజేపీ వైఖరి. అందుకే కశ్మీర్ నుంచి ఏపీ వరకు చాలా పార్టీలు దూరమయ్యాయి. చివరకు ఎన్డీఏలో బీజేపీ ఏకాకిగా మారింది.
దేశవ్యాప్తంగా తమ పార్టీనే అధికారంలో ఉండాలన్న పట్టుదలతో బీజేపీ కనిపిస్తోంది. దీనికోసం ఎలాంటి ఎత్తుగడలు వేసేందుకయినా సిద్ధం అవుతోంది. మిత్రుడు, శత్రువు అని తేడా లేకుండా తన లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు అడుగులు వేస్తోందన్న చర్చ నడుస్తోంది. ఈ ప్రాసెస్‌లో కొందరు మిత్రులు బీజేపీకి దూరం అవుతుంటే.. కొందరిని బీజేపీ దూరం చేసుకుంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ మాత్రమే కాదు.. పాలిటిక్స్ కూడా అని ప్రస్తుత పరిణామాలను లెక్కేస్తూ మరికొందరు చెప్తున్న మాట.
నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కు ఎగ్జిక్యూటివ్ బోర్డు లేదా పొలిట్‌బ్యూరో వంటి అధికారిక పాలనా నిర్మాణం లేదు. ఎన్నికల్లో సీట్ల పంపకాలు, మంత్రిత్వ శాఖల కేటాయింపులు, పార్లమెంట్‌లో లేవనెత్తే అంశాలపై ఆయా పార్టీల నేతలే నిర్ణయాలు తీసుకోవలసి వస్తోంది. పార్టీల మధ్య భిన్నమైన సిద్ధాంతాల దృష్ట్యా, మిత్రపక్షాల మధ్య అసమ్మతి తలెత్తుతోంది. 2008 వరకు ఎన్‌డీఏ కన్వీనర్‌గా జార్జ్ ఫెర్నాండెజ్ బాధ్యతను నిర్వర్తించారు. ఫెర్నాండేజ్ హెల్త్ బాగాలేని కారణంగా అతని స్థానంలో అప్పటి జేడీయూ జాతీయ అధ్యక్షుడుగా ఉన్న శరద్ యాదవ్‌ను నియమించారు. 2013, జూన్ 16న జేడీయూ ఈ సంకీర్ణాన్ని విడిచిపెట్టింది. దాంతో శరద్ యాదవ్ NDA కన్వీనర్‌గా రాజీనామా చేశారు. ఆ తర్వాత అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు NDA కన్వీనర్‌గా చేశారు. ఇక.. 2017న బీహార్‌లో బీజేపీ సహకారంతో జేడీయూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఇప్పుడు ఎన్డీఏ కూటమి అంటే ఒక్క బీజేపీ మాత్రమే అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ఆ పార్టీ కూటమి పేరుతో చేస్తున్న విపరీత ధోరణులతో అలయెన్స్‌లోని ఒక్కో మిత్రపక్షం దూరమవుతూ వస్తోంది. రాబోయే ఎన్నికల్లో లబ్ధికోసం, ఒంటరిగా బలడేందుకు బీజేపీ ఆడుతున్న ఆటలో మిగతా పార్టీలన్నీ చెల్లా చెదరవుతున్నాయి. అయితే.. తన మిత్రులను కాపాడుకోవడంలో, విశ్వాసం నిలుపుకోవడంలో విఫలమవుతున్నామనే వాదనని బీజేపీ పెద్దలు పెద్దగా పట్టించుకోవడంలేదు.
2018 నుంచి పరిశీలిస్తే.. ఎన్డీఏ కూటమి నుంచి తొలుత ఏపీలోని తెలుగుదేశం పార్టీ అవుట్.. ఆ తర్వాత పంజాబ్ నుంచి ఆకాళీదల్, మహారాష్ట్రలోని శివసేన దూరం, ఇప్పుడు బీహార్‌లోని జేడీయూ కూడా రాం రాం అనేసింది. ఇంతకుముందే తటస్థుల జాబితాలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ కుడా దూరమయ్యారు. అంతకుముందు కశ్మీర్లో మిత్రపక్షం పీడీపీ కూడా దూరమైంది.
ఇప్పటికైతే ఎన్డీఏలో .. శివసేన రెబల్ గ్రూపు, అన్నాడీఎంకే తప్ప.. దేశంలో బలమైన పార్టీ కానీ, బలమైన లీడర్లు కానీ ఎవరూ లేరనే చెప్పవచ్చు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు. శాశ్వత ప్రయోజనాలు మాత్రం ఉంటాయి. ఒకప్పడు కమల దళం సారథ్యంలో ఏర్పడిన ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పార్టీలుగా ఉన్న మిత్రపక్షాలు చాలావరకు ఇప్పుడు ఆ కూటమిలో లేవు. కలిసి నడుద్దాం.. కలిసి గెలుద్దాం అన్నది ఒకనాటి భారతీయ జనతా పార్టీ నినాదం. చిన్నపాయగా మొదలైన బీజేపీ తర్వాతకాలంలో మహాప్రవాహంగా మారి, నేడు దేశంలోనే అతిపెద్దపార్టీగా రూపుదాల్చడం వెనుక ఎంతో కృషి దాగి ఉంది. అనేక ప్రాంతీయశక్తులు, సంప్రదాయవాదులు అండదండలనిస్తూ పార్టీ మహావృక్షంగా ఎదగడానికి, వేళ్లూనుకోవడానికి దోహదం చేశారు. అయితే ఒకప్పడు కమల దళం సారథ్యంలో ఏర్పడిన ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పార్టీలుగా ఉన్న మిత్ర పక్షాలు చాలావరకు ఇప్పుడు ఆ కూటమిలో లేవు.
కేంద్ర మంత్రివర్గంలో బీజేపీయేతర పార్టీలకు చెందిన మంత్రులు, ఇద్దరు ముగ్గురు కంటే లేరు. అటు ఎన్డీఏలో మిగిలిన పార్టీలను కూడా వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఒకప్పటి బిజెపి తమకు పట్టు ఉన్నచోట్ల బలపడుతూ బలహీనంగా ఉన్నచోట్ల ఇతర పార్టీలకు చేయందించి పట్టు సాధిస్తూ మూడున్నర దశాబ్దాల ప్రస్థానంలో జాతీయ పక్షంగా స్థిరపడింది. దీనికి ప్రధాన కారణం ఒక నమ్మకం. పెద్ద పార్టీ అయినప్పటికీ తమ మనుగడను దెబ్బతీయదని చిన్నపార్టీల విశ్వాసం. తమ ఉనికికి భంగం వాటిల్లకుండా తమ మాటను గౌరవిస్తుందనే భావన బీజేపీ పట్ల మిత్రపక్షాల్లో నిన్నామొన్నటి వరకూ నెలకొని ఉండేది. అయితే, ఇప్పుడు మిత్రపక్షాలు, ఇతర పక్షాల్లో ఉన్న నమ్మకం, విశ్వాసం సడలిపోతూ వస్తోంది. ప్రత్యేకించి మోడీ, అమిత్ షా ద్వయం పార్టీ, ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత అపరిమితమైన అధికారాలు వారిద్దరి వద్దే కేంద్రీకృతమై పోయాయి. దీంతో మిత్రపక్షాలూ కుచించుకుపోయాయి.
ఇక్కడ మిత్రులు, శత్రువులు వంటి భేదభావం, సంకీర్ణధర్మం అన్న రాజనీతికి నూకలు చెల్లిపోతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2019 ఎన్నికల్లో, బీజేపీ సొంత బలం మరింతగా పెరిగి 303 కు చేరిన తరుణంలో, మోడీ షా జోడీ మిత్ర పక్షాలను మెల్ల మెల్లగా సాగనంపే వ్యూహానికి మరింతగా పదును పెట్టారు. 2019 ఎన్నికల్లో, శివసేన, రామ్ విలాస్ పాశ్వాన్ పార్టీ లోక్ జన శక్తి, అకాలీ దళ్, అన్నా డీఎంకే, జేడీయు తో పాటుగా అప్నా దళ్, ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ వంటి చిన్నాచితక పార్టీలు సహా మొత్తం తొమ్మిది పార్టీలు ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి. ఎన్నికలో పోటీచేసి, గెలిచాయి. అయితే ఆ తర్వాత రెండు సంవత్సరాలకే శివసేన, అకాలీ దళ్, ఎల్జీపీ ఇలా ఒకొక్క పార్టీ బయటకు వెళ్లిపోయిన పరిస్థితి. బీజేపీ ప్లాన్ సంపూర్ణం అయితే, శివసేన సైతం త్వరలోనే చరిత్రగా మిగిలిపోతుంది.
దేశంలో ఏకఛత్రధిపత్యం చేయాలన్న దురాశకుతోడు, అన్ని రాష్ట్రాల్లో తామే విస్తరించాలనే రాజకీయ ఆపేక్షతోనే బీజేపీని ఇతర పార్టీలు నమ్మడం లేదన్న వాదనలున్నాయి. అందుకే ఆ కూటమిలోని పార్టీలన్నీ ఎన్డీఏకి దూరం అవుతూ వస్తున్నాయి.
బీజేపీ దూకుడు రాజకీయం.. అనుకోకుండా కాంగ్రెస్ కు మేలు చేస్తోంది. ప్రతపక్ష శిబిరంలో లేని ఐక్యతను కూడా కాషాయా పార్టీ తెచ్చేలా కనిపిస్తోంది. బీజేపీకి దూరమైన ప్రతి పార్టీ.. కాంగ్రెస్ కు దగ్గరౌతోంది. బీజేపీకి మిత్రులుగా ఉండటం కంటే శత్రువులగా ఉండటమే మేలనే పరిస్థితి వచ్చేసింది.
హాలీవుడ్ సినిమా ది గాడ్ ఫాదర్ లో ఒక డైలాగ్ ఉంటుంది. కీప్ యువర్ ఫ్రెండ్స్ క్లోజ్ అండ్ ఎనిమీస్ క్లోజర్ అని. గాడ్ ఫాదర్ కోట్స్ లో ఇది బాగా పాపులర్. మిత్రులు, శత్రువులతో ఎలాంటి సంబంధాలను మెయింటెయిన్ చేయాలనే అంశంపై ఒక మాఫియా డాన్ తన తనయుడికి ఇచ్చే సలహా అది. బీజేపీ తన మిత్రపక్షాలు, విపక్షాలతో వ్యవహరించే తీరును గమనిస్తే… గాడ్ ఫాదర్ కోట్ గుర్తుకు వస్తుంది. బీజేపీ దాన్ని పాటిస్తోందని అనలేం కానీ, బీజేపీతో రాజకీయ శత్రుత్వాన్ని మెయింటెయిన్ చేసే పార్టీలు, అదే సమయంలో మిత్రపక్షాలుగా చలామణి అవుతున్న పార్టీలు కూడా తలపట్టుకుంటున్నాయి.
బీజేపీతో ఒక్కసారి దోస్తీకి దిగి ఆ తర్వాత దాన్ని వదిలించుకున్నా, అతిగా అతికించుకున్నా.. తలపోటే తప్ప మరో దారి కనిపించడం లేదు. మిత్రపక్షాల శక్తిని కూడా తనలోకి ఇముడ్చుకోవడం కాదు, ఆ పార్టీలనే నామరూపాలు లేకుండా చేయడానికి బీజేపీ వెనుకాడుతున్నట్టుగా లేదు. అధికారం లో భాగస్వామ్యాన్ని ఇచ్చినట్టే ఇచ్చి బీజేపీ వాటిని భ్రష్టు పట్టిస్తోందని జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి.
శివసేనకు ఇదే అనుభవం అయ్యింది. ఎల్జేపీ పరిస్థితీ అదే. ముందే మేలుకున్నాడో ఏమో నితీష్ కుమార్ బీజేపీతో బంధాన్ని తెంచుకున్నాడు. తమిళనాడు పార్టీ అన్నాడీఎంకే బీజేపీతో ఎలా డీల్ చేయాలో తెలియక పిల్లిమొగ్గలు వేస్తోంది. జయలలిత మరణం తర్వాత దిక్కూదివాణం లేకుండా పోయిన ఆ పార్టీ బీజేపీ ఆటలో పావుగా మారింది. బీజేపీ అండతో కొన్నాళ్లు అధికారాన్ని నిలుపుకున్నా.. అన్నాడీఎంకేను అరిగించేసుకుని తను తమిళనాట బలోపేతం కావాలనే దురాశతో ఉంది బీజేపీ. ఇది సాధ్యం కావడం లేదు. దీంతో బీజేపీతో మైత్రి ఇప్పుడు అన్నాడీఎంకు తలనొప్పే తప్ప మరో ఉపయోగం లేదు.
రెండున్నరేళ్ల కిందట జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ- శివసేనలు మిత్రపక్షాలే. అప్పుడు రెండు పార్టీలూ కలిసి అధికారాన్ని పంచుకున్నాయి. సీఎం పీఠాన్ని ఇవ్వకపోయినా.. శివసేన ఫ్యామిలీ పాలిటిక్స్ కు అయితే ఇబ్బంది లేదు. అయితే శివసేనను బీజేపీ అవమానించని తీరంటూ లేదు. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయినా.. శివసేనను తగు రీతిన గుర్తించడానికి బీజేపీ ససేమేరా అంటూ వచ్చింది. దీంతో.. సేనకు చిర్రెత్తి కాంగ్రెస్ , ఎన్సీపీలతో చేతులు కలిపింది.
సీఎం పదవిని పొందింది. మరి ఆ పార్టీ ప్రజా వ్యతిరేకతను పెంచుకుని దెబ్బతింటుందిలే అంటూ బీజేపీ ఏమీ వేచి చూడలేదు. ఆ ప్రభుత్వాన్ని కూలదోసేదాకా నిద్రపోలేదు. మిత్రపక్షంగా ఉండీ శివసేనను అవమానించింది. శత్రువుగా చేసుకుని.. మరింత దెబ్బేసింది.
బీహార్ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి అయినప్పటికీ, ప్రభుత్వ తప్పులన్నింటికీ ముఖ్యమంత్రే కారణమనేలా ఆ పార్టీ విమర్శలు గుప్పించటం నితీశ్‌కుమార్‌లో మరింత అభద్రతాభావాన్ని పెంచింది. తనకు కూడా వెన్నుపోటు తప్పదని ఊహించిన ఆయన, ఎన్డీయే నుంచి దూరం జరుగుతూ వచ్చారు. బీజేపీ వ్యతిరేకిస్తున్నప్పటికీ దేశంలో ఓబీసీ కుల గణన చేపట్టాలని తీర్మానం చేశారు. జేడీయూను బలహీనపరుస్తూ బీహార్‌లో బీజేపీ బలపడుతున్నదని బహిరంగంగానే ఆరోపించారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు త్వరలోనే ధ్వంసమైపోతాయని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా బీహార్‌కే వెళ్లి ప్రకటించటంతో పరిస్థితులు మరింత క్షీణించాయి. తక్కువ సీట్లు వచ్చిన జేడీయూకు అధికారం అప్పగించినప్పుడే.. నితీశ్ పరిస్థితి.. కర్ణాటకలో కుమారస్వామి మాదిరి తయారైంది. నితీశ్‌ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టి.. రాష్ట్రంలో తాను బలపడాలని బీజేపీ ఎత్తుగడ. రెండేండ్లుగా బీహార్‌లో సాగుతున్న రాజకీయం అదే. అసెంబ్లీ స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ను నియమించారు. ఆయన నితీశ్ సర్కారుపై పదేపదే విమర్శలు చేస్తున్నా.. తొలగించలేని నిస్సహాయ స్థితిలో నితీశ్ ఉండిపోయారు.
ఇప్పటివరకు అనుకున్న స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యత సాధ్యం కాలేదు. దానికి కాంగ్రెస్ బలపడకపోవడం కూడా ఓ కారణం. బీజేపీ అతి దూకుడుతో.. కాంగ్రెస్ కు పరోక్షంగా మేలు జరుగుతోంది. బీజేపీకి దూరం జరుగుతున్న పార్టీలన్నీ.. హస్తం పార్టీకి దగ్గరౌతున్నాయి. యూపీలో అఖిలేష్, బీహార్లో నితీష్, మహారాష్ట్రలో శివసేన అలాగే చేరువయ్యాయి. బీజేపీ వ్యవహారశైలి ఇలాగే ఉంటే.. కాంగ్రెస్ నాయకత్వానికి కూడా ప్రతిపక్షాలు ఓకే చెప్పే అవకాశం కనిపిస్తోంది. మోడీ మిస్టర్ క్లీన్ అంటున్న బీజేపీకి ప్రతిగా అదే క్లీన్ ఇమేజ్ ఉన్న నితీష్ ను ముందుకు తేవాలనే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. 2014 ఎన్నికల టైమ్ లోనూ ప్రధాని పదవికి పోటీదారుగా నితీష్ పేరు వినిపించింది. అయితే ఈసారి మాత్రం అది మరింత గట్టిగా వినిపించే అవకాశం కనిపిస్తోంది.
బీహార్లో నితీష్ తిరుగులేని నేత అనడంలో ఎలాంటి సందేహం లేదు. మిత్రులుగా ఎవరున్నా.. సీఎంగా నితీష్ కొనసాగడమే ఆయన ఇమేజ్ కు నిదర్శనం. అయితే బీహార్ బయట ఆయనకు ఇంత ఇమేజ్ ఉందా అనేది ప్రశ్న. నితీష్ రాజకీయ నైతికత విషయంలోనూ సందేహాలున్నాయి. పదేపదే మిత్రుల్ని మార్చే నితీష్.. మళ్లీ బీజేపీ వైపు చూడరనే గ్యారెంటీ ఏంటని అడిగితే చెప్పడం కష్టమే. మిత్రులు దూరం కావడం తాత్కాలికంగా బీజేపీని సంతోషపెట్టొచ్చేమే కానీ.. దీర్ఘకాలంలో కఠిన పరీక్షలు తప్పవు. శత్రువుల్ని పెంచుకోవడం ఎవరికీ మంచిది కాదనేది సాధారణ రాజనీతి. కానీ కమలం పార్టీ చేస్తున్న పనులు.. ప్రతిపక్ష శిబిరాన్ని బలోపేతం చేస్తున్నాయి. అసాధ్యం అనుకున్న కాంబినేషన్లు కూడా సాకారమౌతున్నాయి.
ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అని చెప్పుకుంటున్న బీజేపీ.. దేశాన్ని దశాబ్దాల తరబడి ఏలాలని కంకణం కట్టుకుంది. ప్రాంతీయ పార్టీల్ని చెల్లాచెదురు చేసి.. కాంగ్రెస్ ను నిర్వీర్యం చేసి.. ఏక పార్టీ వ్యవస్థ కోసం ప్లాన్ చేస్తోంది. అయితే ఈ ప్రాసెస్ లో తానే ఏకాకిగా మిగిలిపోవడమే ఇక్కడ అసలైన రాజకీయం.