Women’s IPL likely to happen in next year: భారత క్రికెట్ తో పాటు ప్రపంచ క్రికెట్ లో ఐపీఎల్ ఓ సంచలనం. కొత్త టాలెంట్ ను వెలుగులోకి తీసుకురావడంతో పాటు మరింత ఆర్థికంగా బీసీసీఐ బలోపేతం అయ్యేందుకు ఐపీఎల్ సహకరించింది. ఇక విదేశీ క్రికెటర్లకు కూడా కాసులు వర్షం కురిపిస్తోంది ఇండియన్ ప్రీమియర్ లీగ్. 2008లో ప్రారంభం అయిన ఐపీఎల్ ఇప్పటి వరకు 15 ఎడిషన్లను పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే ఎప్పటినుంచో మహిళ ఐపీఎల్ జరపాలని బీసీసీఐ భావిస్తోంది. మహిళా క్రికెట్ కు ఇటీవల కాలంలో ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో మహిళల ఐపీఎల్ నిర్వహిస్తే సక్సెస్ అవుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే వచ్చే ఏడాది మహిళల ఐపీఎల్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే మహిళల ఐపీఎల్ పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, కార్యదర్శి జై షా సానుకూలంగా ఉన్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే..వచ్చే ఏడాది మహిళల ఐపీఎల్ చూసే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఏడాది మహిళల ఐపీఎల్ నిర్వహించేందుకు వీలుగా షెడ్యూల్ లో మార్పులు చేసింది. సాధారణంగా ప్రతీ ఏడాది భారత మహిళల సీజన్ నవంబర్ తో ప్రారంభం అయి ఏప్రిల్ వరకు కొనసాగుతుంది. ఈ ఏడాది మాత్రం అక్టోబర్ తో ప్రారంభం అయి ఫిబ్రవరి వరకు సీజన్ ఉండబోతోంది. దీంతో పురుషుల ఐపీఎల్ ప్రారంభం అవడానికి ముందే.. 2023లో మహిళల ఐపీఎల్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆరు జట్లతో టోర్నీని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
Read Also: RSS: ప్రొఫైల్ పిక్ మార్చిన ఆర్ఎస్ఎస్.. 75వ స్వాతంత్య్ర దినోత్సవం ముందు కీలక పరిణామం
ప్రస్తుతం పురుషుల ఐపీఎల్ ఫ్రాంచైజీలే మహిళల జట్లను దక్కించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. వీటితో పాటు కొత్త ఫ్రాంచైసీలు కూడా వేలంలో పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే ముంబై, చెన్నై ఫ్రాంచైసీలు మహిళా టీంలను దక్కించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ‘‘వచ్చే ఏడాది మార్చి మొదటి వారంలో మహిళల ఐపీఎల్ ఉంటుందని.. నాలుగు వారాల పాటు కొనసాగుతుంది.. సౌత్ ఆఫ్రికాలో ఫిబ్రవరి 26న మహిళల టీ 20 ప్రపంచ కప్ ముగిసిన వెంటనే టోర్నీ ప్రారంభం అవుతుంది.. ఐదు లేదా ఆరు జట్లతో టోర్నీ జరిగొచ్చని.. త్వరలోనే వేలం ప్రకటన రావచ్చు’’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.