Team india bowler Natarajan: టీమిండియా కీలక బౌలర్ నటరాజన్ ఇటీవల జట్టులో కనిపించడం లేదు. దీంతో నటరాజన్‌కు ఏమైందని అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. టీమిండియా బిజీ బిజీగా పలు దేశాల్లో పర్యటిస్తున్నా నటరాజన్‌కు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే నటరాజన్ ఫిట్‌గా లేకపోవడమే అతడిని ఎంపిక చేయకపోవడానికి కారణమని తెలుస్తోంది. 2020 ఐపీఎల్‌లో సంచలన ప్రదర్శనతో టీమిండియాలో చోటు దక్కించుకున్న నటరాజన్ అరంగేట్ర సిరీస్‌లోనే అదరగొట్టాడు. నెట్ బౌలర్‌గా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి వరుణ్ చక్రవర్తి, నవదీప్ సైనీ గాయపడటంతో తుది జట్టులో స్థానం దక్కించుకుని సత్తా చాటాడు. 31 ఏళ్ల వయసులో ఎంట్రీ ఇచ్చిన నటరాజన్ తరచూ గాయాల పాలవడంతో జట్టుకు దూరమవుతున్నాడు. దీంతో ఇతర బౌలర్లు నటరాజన్ స్థానాన్ని భర్తీ చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.
Read Also: Asia Cup 2022: టీమిండియా మ్యాచ్ ఎఫెక్ట్.. పాకిస్థాన్ ఆటగాళ్లకు జీతాల పెంపు
ఈ ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన నటరాజన్ 11 మ్యాచులు ఆడి 18 వికెట్లు తీశాడు. ఉమ్రాన్ మాలిక్ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అయితే ఉమ్రాన్ మాలిక్ సంచలన ప్రదర్శనతో పాటు టీమ్ చెత్త ప్రదర్శన కారణంగా నట్టు ప్రదర్శన మరుగున పడిపోయింది. కానీ ఐపీఎల్‌లో నటరాజన్ గతంతో పోలిస్తే ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం అతడికి మైనస్ పాయింట్‌గా మారింది. ఇప్పటివరకు అంతర్జాతీయంగా 4 టీ20 మ్యాచ్‌లు ఆడిన నటరాజన్ 7 వికెట్లు సాధించాడు. రెండు వన్డేలు ఆడి 3 వికెట్లు పడగొట్టాడు. గతంలో ఆస్ట్రేలియాలో రాణించిన నటరాజన్‌కు అక్కడి పరిస్థితులు నప్పుతాయి. వచ్చే టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాలోనే జరుగుతున్న నేపథ్యంలో బుమ్రా, హర్షల్ పటేల్ దూరమైన పరిస్థితుల్లో నటరాజన్ ఉంటే జట్టు పటిష్టంగా ఉండేదని పలువురు అభిమానులు భావిస్తున్నారు.