VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?

Vvs Laxman Chief Selector

Vvs Laxman Chief Selector

VVS Laxman to Replace Ajit Agarkar as BCCI Chief Selector: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్ సెలెక్టర్ మారనున్నారా? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం చీఫ్ సెలెక్టర్‌గా కొనసాగుతున్న అజిత్ అగార్కర్ పదవీకాలాన్ని బీసీసీఐ మరోసారి పొడిగించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదట. ఈ మేరకు పలు జాతీయ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. అగార్కర్ స్థానంలో భారత మాజీ దిగ్గజ బ్యాటర్, మన తెలుగు ప్లేయర్ వీవీఎస్ లక్ష్మణ్‌ కొత్త చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడని సమాచారం.

ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు ఆశించిన ఫలితాలు సాధించకపోవడం సహా రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు జోరుగా సాగిన సమయంలో అజిత్ అగార్కర్ స్పందించిన తీరుపై బీసీసీఐ పెద్దలు అసంతృప్తిగా ఉన్నారట. ముఖ్యంగా రోహిత్ భవిష్యత్తుపై స్పష్టమైన ప్రకటన చేయకుండా.. సందిగ్ధత కొనసాగేందుకు అవకాశం ఇచ్చారనే అభిప్రాయం బోర్డులో వ్యక్తమైనట్లు కథనాలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సెప్టెంబర్‌లో అగార్కర్ పదవీకాలం ముగియగానే.. కొత్త చీఫ్ సెలెక్టర్‌ను నియమించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌ రేసులో వీవీఎస్ లక్ష్మణ్ పేరు ముందంజలో ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) హెడ్‌గా హైదరాబాద్ సొగసరి లక్ష్మణ్ ఉన్న విషయం తెలిసిందే. భారత జట్టు మాజీ స్టార్ బ్యాటర్‌గా, అలాగే నేషనల్ క్రికెట్ అకాడమీలో యువ ఆటగాళ్ల అభివృద్ధికి కీలక పాత్ర పోషించిన లక్ష్మణ్‌కు భారత క్రికెట్ వ్యవస్థపై మంచి అవగాహన ఉంది. దీంతో సెలక్షన్ కమిటీకి ఆయన నాయకత్వం వహిస్తే.. టీమిండియా భవిష్యత్ బాగుంటుందని బీసీసీఐ భావిస్తోందట. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

వాస్తవానికి చీఫ్ సెలెక్టర్‌ అజిత్ అగార్కర్ పదవీకాలం 2026 జూన్‌తో ముగియాల్సి ఉంది. ఐర్లాండ్, ఇంగ్లండ్, జింబాంబ్వే సిరీస్‌ల నేపథ్యంలో అగార్కర్ పదవీకాలాన్ని బీసీసీఐ 3 నెలల పాటు పొడిగించింది. ఆ మూడు నెలల పదవీకాలం కూడా వచ్చే సెప్టెంబర్‌తో ముగుస్తుంది. అనంతరం అతడికి సాగనంపాలని బీసీసీఐ చూస్తోందట. కొన్ని నెలలుగా టీమిండియా వన్డే జట్టులో రోహిత్ శర్మ భవిష్యత్తుపై నెలకొన్న వివాదాలు కూడా అగార్కర్ పదవికి ఎసరు పెట్టినట్లుగా తెలుస్తోంది.