NTV Telugu Site icon

Virat Kohli: ఫామ్‌లో లేకపోయినా అగ్రస్థానంలోనే విరాట్ కోహ్లీ..!!

Virat Kohli

Virat Kohli

Virat Kohli in Top Place: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ గత మూడేళ్లుగా ఫామ్‌లో లేడు. దీంతో జట్టులో అతడి స్థానంపై మాజీ క్రికెటర్లు ఆరోపణలు చేసే పరిస్థితి నెలకొంది. అయితే మూడేళ్లుగా ఒక్క సెంచరీ చేయకపోయినా టీమిండియా తరఫున అత్యధిక పరుగుల జాబితాలో మాత్రం విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలవడం విశేషం. 2019 ప్రపంచకప్‌ తర్వాత టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కోహ్లీనే. అప్పటినుంచి ఇప్పటివరకు కోహ్లీ 83 మ్యాచ్‌ల్లో 3564 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఒక్క సెంచరీ చేయకపోయినా కోహ్లీ టాప్ ప్లేస్‌లో ఉండటం చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అటు ఈ జాబితాలో రోహిత్‌ శర్మ 70 మ్యాచ్‌ల్లో 3,318 పరుగులు చేసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ 75 మ్యాచ్‌ల్లో 2,593 పరుగులు చేసి మూడో స్థానంలో, కేఎల్‌ రాహుల్‌ 57 మ్యాచ్‌ల్లో 2,524 నాలుగో స్థానంలో ఉన్నారు.

Read Also: IND Vs WI: నేడు మూడో వన్డే.. క్లీన్‌స్వీప్‌పై టీమిండియా గురి..!!

2019లో 44 ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్‌ కోహ్లీ 64.60 సగటుతో 2455 పరుగులు సాధించాడు. అయితే వీటిలో అత్యధిక పరుగులు ప్రపంచకప్ ముందు చేసినవే ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో 7 శతకాలు కూడా ఉన్నాయి. ప్రపంచకప్ తర్వాతే కోహ్లీ ప్రదర్శన మసకబారింది. అటు 2020లో 22 ఇన్నింగ్స్‌ల్లో 36.60 సగటుతో 842 పరుగులు, 2021లో 24 ఇన్నింగ్స్‌లు ఆడి 37.07 సగటుతో 964 పరుగులు, 2022లో 16 ఇన్నింగ్స్‌ల్లో 25.05 సగటుతో 476 పరుగులు చేశాడు. మూడేళ్లుగా కోహ్లీ ప్రదర్శన కారణంగా అతడి మొత్తం సగటు కూడా తగ్గుతూ వస్తోంది. ఐసీసీ ర్యాంకుల్లోనూ నెమ్మదిగా కోహ్లీ తన ప్రభావాన్ని కోల్పోతున్నాడు. అయితే విరాట్‌ ఒక్క భారీ ఇన్నింగ్స్‌తో శతకాల బాట పడతాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కోహ్లీకి సెలెక్టర్లు విరామం ఇచ్చారు. ఆగస్టులో జరిగే ఆసియా కప్‌ లేదా దానికి ముందు జరిగే జింబాబ్వే సిరీస్‌లో విరాట్ కోహ్లీ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి.