వన్డే సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య నేడు తొలి వన్డే జరగనుంది. వడోదరలో మధ్యాహ్నం 1.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. మరో 25 పరుగులు చేస్తే.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డు బ్రేక్ అవుతుంది. ఈరోజు (జనవరి 11) కింగ్ కోహ్లీకి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే విరాట్ కుమార్తె వామిక పుట్టినరోజు నేడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో 28,000 పరుగులు పూర్తి చేయడానికి విరాట్ కోహ్లీ కేవలం 25 పరుగుల దూరంలో ఉన్నాడు. నేడు ఆ 25 రన్స్ చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 28 వేల పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలుస్తాడు. ఇప్పటివరకు మాజీలు సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కరలు మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నారు. కోహ్లీ 623 ఇన్నింగ్స్‌లలో 84 సెంచరీలు, 145 హాఫ్ సెంచరీలతో 27,975 పరుగులు చేశాడు. సచిన్ 644 ఇన్నింగ్స్‌లలో 28 వేల పరుగులు చేయగా.. సంగక్కర 666 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను సాధించాడు. సచిన్ కంటే వేగంగా ఈ రికార్డును విరాట్ సాధించగలడు.
కుమార సంగక్కర 28,016 పరుగుల రికార్డును బద్దలు కొట్టడానికి విరాట్ కోహ్లీ ఇంకా 42 పరుగులు మాత్రమే వెనుకంజలో ఉన్నాడు. ఈరోజు విరాట్ హాఫ్ సెంచరీ చేస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం విరాట్ కంటే ముందు సంగక్కర ఉన్నాడు. 594 మ్యాచ్‌లలో 666 ఇన్నింగ్స్‌లలో 28016 పరుగులు చేశాడు. సంగక్కర సగటు 46.77 కాగా.. 63 సెంచరీలు, 153 హాఫ్ సెంచరీలు బాదాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. 664 మ్యాచ్‌లలో 48.25 సగటుతో 34357 పరుగులు చేశాడు. టెండూల్కర్ అన్ని ఫార్మాట్లలో 100 సెంచరీలు, 164 హాఫ్ సెంచరీలు చేశాడు.
న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేల్లో విరాట్ కోహ్లీకి అద్భుత రికార్డు ఉంది. 2010-2025 మధ్య 33 మ్యాచ్‌లలో 6 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలతో 1657 పరుగులు చేశాడు. విరాట్ అత్యధిక స్కోరు 154 నాటౌట్. 2025లో న్యూజిలాండ్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో విరాట్ 1 పరుగుకే ఔటయ్యాడు. అయితే కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన వన్డే సిరీస్‌లోని మూడు మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో 302 పరుగులు చేశాడు.