దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ అనంతరం టీమిండియా స్టార్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఆడుతున్నారు. ఢిల్లీ తరఫున కోహ్లీ.. ముంబై తరఫున రోహిత్ బరిలోకి దిగారు. దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ ఫామ్ కంటిన్యూ చేస్తూ.. పరుగుల వరద పారిస్తున్నారు. ఎంతటి స్టార్స్ అయినా సరే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో ఈ ఇద్దరు విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నారు. అయితే భారత్ తరఫున ఆడినప్పుడు ఒక్కో వన్డేకు రూ. 6 లక్షలు ఫీజు తీసుకునే రో-కోలకు విజయ్ హజారే ట్రోఫీలో ఎంత వస్తుందో అని ఫాన్స్ తెగ వెతుకుతున్నారు.
విజయ్ హజారే ట్రోఫీ లిస్ట్-ఎ మ్యాచ్‌లలో ఆడే ఆటగాళ్లను వారు ఆడిన మ్యాచ్‌ల సంఖ్య ఆధారంగా మూడు కేటగిరీలుగా బీసీసీఐ విభజించింది. సీనియర్ కేటగిరీ, మిడ్-లెవల్ కేటగిరీ, జూనియర్ కేటగిరీలలో ఫీజు చెల్లిస్తారు. సీనియర్ కేటగిరీలో 40కి పైగా లిస్టు-ఎ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్స్ ఉంటారు. మ్యాచ్ ఆడిన ఆటగాడికి రూ.50 వేలు, రిజర్వు అతగాడికి రూ 25 వేల చొప్పున ఫీజును బీసీసీఐ చెల్లిస్తుంది. మిడ్-లెవల్ కేటగిరీలో 21 నుంచి 40 లిస్టు-ఎ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు ఉండగా.. ఒక్కో మ్యాచ్‌కు రూ.50 వేలు, రూ.25 వేల చొప్పున ఫీజు ఉంటుంది. జూనియర్ కేటగిరీలో 0- 20 లిస్టు-ఎ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్స్ ఉండగా.. రూ. 40 వేలు, రూ.20 వేల చొప్పున ఫీజు అందిస్తారు. ఫీజుతో పాటు అలవెన్సులు అదనంగా ఉంటాయి. ట్రావెల్, ఫుడ్ ఖర్చు, వసతి ఏర్పాటును బీసీసీఐ చూసుకుంటుంది.
విజయ్ హజారే ట్రోఫీలో సీనియర్ కేటగిరీలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఉన్నారు. కాబట్టి వారికి రూ.60 వేలతో పాటు అలవెన్సులు దక్కుతాయి. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచిన ఆటగాడికి రూ.10 వేల ప్రైజ్‌మనీ ఉంటుంది. ఇక రో-కో రాకతో విజయ్ హజారే ట్రోఫీ 2025 సీజన్‌కు పండుగ కళ వచ్చింది. కోహ్లీ, రోహిత్ ఆట చూస్తూ స్థానిక ఫాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. 2026 జనవరిలో భారత్‌లో న్యూజిలాండ్ పర్యటించనుంది. ఈ పర్యటన నేపథ్యంలో ఇరు జట్లు మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనున్నాయి. వన్డేల్లో రో-కో ఆడనున్నారు.