భారత యువ సంచలనం ‘వైభవ్ సూర్యవంశీ’ కెరీర్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతున్నాడు. సింగిల్ తీసినంత ఈజీగా.. సిక్సులు బాదేస్తున్నాడు. 14 ఏళ్ల వైభవ్ గత ఏడాది కాలంగా దేశవాళీ, అండర్-19 క్రికెట్‌లో సులువుగా సెంచరీలు చేస్తున్నాడు. ముఖ్యంగా గత నెల రోజుల్లో సునామీ ఇన్నింగ్స్‌లు ఆడుతూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. యువ సంచలనం వైభవ్ ఆటకు టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఫిదా అయ్యాడు. భారీ స్కోర్లను పోల్చుతూ.. ఏంటి తమ్ముడు ఈ అరాచకం అంటూ ఆశ్యర్యం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2026లో వైభవ్ వీరబాదుడు చూసేందుకు తాను ఆత్రుతతో ఉన్నానని యాష్ చెప్పాడు.
‘171(95), 50(26), 190(84), 68(24), 108 (61), 46(25) & 127(74). దేశవాళీ, అండర్-19 క్రికెట్‌లో గత 30 రోజుల్లో వైభవ్ సూర్యవంశీ సాధించిన స్కోర్‌లలో ఇవి కొన్ని మాత్రమే. ఇదంతా ఏంటి తమ్ముడు?, ఈ శాంపిల్ సరిపోతుందా? లేదా మరింత డోస్ పెంచబోతున్నావా?. 14 ఏళ్ల వయసులో ఈ కుర్రాడు ఎలా విధ్వంసం సృష్టిస్తున్నాడో మీరు మాటల్లో వివరించలేరు. అండర్ 19 వరల్డ్ కప్‌లో వైభవ్ చెలరేగుతాడని అంతా అనుకుంటున్నారు. రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజు శాంసన్ వెళ్లిపోయాడు. కాబట్టి వైభవ్ ఐపీఎల్ 2026లో ఓపెనర్‌గా పూర్తి సీజన్ ఆడనున్నాడు. రాబోయే నాలుగు నెలల్లో అతడి ఆటను చూడటానికి ఆత్రుతగా ఉన్నా’ అని రవిచంద్రన్ అశ్విన్ ట్వీట్ చేశాడు. ఐపీఎల్ 2025 చివరలో అరంగేట్రం చేసిన వైభవ్.. గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లోనే సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2026 కోసం ఆర్ఆర్ అతడిని రూ.1.10 కోట్లకు రిటైన్ చేసుకుంది.