2025-26 విజయ్ హజారే ట్రోఫీ తొలి మ్యాచ్‌లోనే 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సంచలనం సృష్టించాడు. బీహార్ తరపున ఆడుతున్న టీనేజ్ సంచలనం.. అరుణాచల్ ప్రదేశ్‌పై 84 బంతుల్లో 190 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో వైభవ్ 16 ఫోర్లు, 15 సిక్సర్లు బాదాడు. కేవలం 36 బంతుల్లోనే వైభవ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇది వైభవ్ ఖాతాలో ఓ రికార్డుగా నిలిచింది.
విజయ్ హజారే ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ, టీ20 క్రికెట్ రెండింటిలోనూ 15 ఏళ్లకు ముందే సెంచరీ చేసిన ప్రపంచంలోనే తొలి పురుష క్రికెటర్‌గా నిలిచాడు. పురుషుల లిస్ట్-ఏ క్రికెట్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా (14 సంవత్సరాల 272 రోజులు) నిలిచాడు. గతంలో ఈ రికార్డు పాకిస్తాన్‌కు చెందిన జహూర్ ఎలాహి పేరిట ఉంది. అతను లిస్ట్-ఏ క్రికెట్‌లో 15 సంవత్సరాల 209 రోజుల వయసులో సెంచరీ చేశాడు.
Also Read: Bandi Sanjay-KCR: కేసీఆర్‌కు కృష్ణా జలాల గురించి మాట్లాడే హక్కు లేదు!
వైభవ్ సూర్యవంశీ దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజం ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డును కూడా బద్దలు కొట్టాడు. వైభవ్ కేవలం 59 బంతుల్లోనే 150 పరుగుల మార్కును చేరుకున్నాడు. గతంలో లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన 150 పరుగుల రికార్డు డివిలియర్స్ పేరుపై ఉంది. 2015 ప్రపంచకప్‌లో డివిలియర్స్ 64 బంతుల్లో 150 పరుగులు చేశాడు. వైభవ్ కొల్లగొడుతున్న రికార్డులకు అందరూ ఆశ్చర్యపోతున్నారు. టీనేజ్ సంచలనం నెలకొల్పిన రికార్డులు క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు.