ఐపీఎల్ 2022 సీజన్‌లో నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. సెకండ్ క్వాలిఫయర్‌లో భాగంగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరనుండగా.. ఓడిపోయిన జట్టు ఇంటిదారి పట్టనుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నోపై గెలుపుతో ఆర్సీబీ జోష్ మీద ఉంది. ఇప్పటివరకు టైటిల్ గెలవని ఈ జట్టు ఆ కలను సాకారం చేసుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. డుప్లెసిస్, కోహ్లీ, పటీదార్, మ్యాక్స్‌వెల్, హసరంగ, దినేష్ కార్తీక్, హర్షల్ పటేల్, సిరాజ్ లాంటి ఆటగాళ్లతో ఆర్సీబీ బలంగా కనిపిస్తోంది.
అయితే పాయింట్ల టేబుల్‌లో రెండో స్థానంలో నిలిచిన రాజస్థాన్ జట్టు తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో భంగపడింది. దీంతో ఆ జట్టు ఎలాగైనా బెంగళూరును ఓడించాలనే కసితో కనిపిస్తోంది. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన బట్లర్, సంజు శాంసన్, హిట్‌మెయిర్, అశ్విన్, బౌల్ట్, చాహల్ రాజస్థాన్ జట్టుకు ప్రధాన బలం. అయితే రాజస్థాన్ జట్టు బట్లర్, శాంసన్‌లపై ఎక్కువ ఆధారపడుతోంది. దీంతో ఆర్సీబీ వీళ్లిద్దరిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఒకవేళ వీళ్లిద్దరూ విఫలమైతే రాజస్థాన్ జట్టు ఎలా రాణిస్తుందో అన్న విషయం కీలకంగా మారింది.