Tim Southee Shocking Comments On Suryakumar Yadav: టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఫామ్‌తో దూసుకెళ్తోన్న విషయం తెలిసిందే! ఈ ఏడాదిలో అతడు ఎన్నో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు. కొన్ని అరుదైన రికార్డులనూ తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు.. విభిన్నమైన షాట్లు ఆడుతూ, మిస్టర్ 360 డిగ్రీగా పేరుగడించాడు కూడా! ఇటీవల న్యూజీలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో అయితే పెను విధ్వంసమే సృష్టించాడు. 51 బంతుల్లోనే 111 పరుగులు చేసి.. సంచలనాలు నమోదు చేశాడు. ఆ శతకం చేసినందుకు గాను అతనికి సర్వత్రా ప్రశంసలు వచ్చిపడ్డాయి. కానీ.. న్యూజీలాండ్ క్రికెటర్ టిమ్ సౌథీ మాత్రం ఓవైపు ప్రశంసలు కురిపిస్తూనే, మరోవైపు సూర్య గొప్ప ఆటగాడేమీ కాదంటూ బాంబ్ పేల్చాడు.
టీమిండియా నుంచి ఎంతోమంది అద్భుతమైన బ్యాటర్లు వచ్చారని.. కేవలం టీ20 మాత్రమే కాకుండా అన్ని ఫార్మాట్లలోనూ మంచి బ్యాటర్లు ఉన్నారని టిమ్ సౌథీ తెలిపాడు. ఇప్పుడు సూర్యకుమార్ గత 12 నెలల నుంచి అద్భుతంగా రాణిస్తున్నాడని, మంచి ఫామ్‌లో ఉన్నాడని పేర్కొన్నాడు. మైదానం నలువైపులా షాట్లు బాదుతున్న అతడు, ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లోనూ అదరగొడుతున్నాడన్నాడు. అయితే.. టీమిండియా నుంచి అతనొక్కడే అత్యుత్తమ ఆటగాడేమీ కాదన్నాడు. అతడు ఉత్తమ బ్యాటర్‌గా నిలవాలంటే, ప్రస్తుత ఫామ్‌ని ఇలాగే కొనసాగించాల్సి ఉంటుందని సూచించాడు. ఇక ఇదే సమయంలో.. రెండో టీ20లో చివరి ఓవర్‌లో తాను తీసిన హ్యాట్రిక్‌పై ఆనందం వ్యక్తం చేశాడు. ఆ చివరి ఓవర్ వేసినందుకు తాను అదృష్టంగా భావిస్తున్నానని తెలిపాడు. అయితే.. మధ్యలో వర్షం కారణంగా పరిస్థితులు కొంచెం డిఫరెంట్‌గా మారాయని, ఆ పరిస్థితి ఇరుజట్లకూ కష్టమేనని తెలిపాడు.
ఇదిలావుండగా.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఈరోజు (22-11-22) భారత్, కివీస్ మధ్య మూడో మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అవ్వగా.. రెండో మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో విజయం సాధించి, ఈ సిరీస్‌లో 1-0 ఆధిక్యంతో పైచేయి సాధించింది. ఈ మూడో మ్యాచ్‌లోనూ గెలుపొందాలని భారత్ కసిగా ఉంది. అటు.. న్యూజీలాండ్ జట్టు సైతం భారత్‌పై విజయం సాధించి, ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. మరి, ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుపొందుతారో చూడాలి. కాగా.. మెడికల్ అపాయింట్‌మెంట్ కారణంగా ఈ ఆఖరి మ్యాచ్‌కి కేన్ విలియమ్సన్ దూరం కావడంతో, టిమ్ సౌథీ కివీస్ జట్టుకి సారథ్యం వహించనున్నాడు.