భారత స్టార్ టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో లియాండర్ పేస్ చేరాడు. దీంతో గోవా అసెంబ్లీ ఎన్నికల ముందు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో జోష్ నెలకొంది. గోవాలో జరిగిన ఓ కార్యక్రమంలో మమతా సమక్షంలో లియాండర్ పేస్ టీఎంసీ పార్టీ కండువా కప్పుకున్నాడు. కోల్‌కతాకే చెందిన లియాండర్ పేస్ తన సుదీర్ఘ టెన్నిస్ కెరీర్‌లో అనేక సంచలనాలు సృష్టించాడు.
Read Also: తీవ్ర విషాదంలో సినీ పరిశ్రమ… పునీత్ రాజ్‌కుమార్ ఇక లేరు
కాగా టీఎంసీ పార్టీలో లియాండర్ పేస్ చేరికను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వాగతించారు. అతడు తనకు సోదరుడు లాంటి వాడని ఆమె వ్యాఖ్యానించారు. తాను యువజన సర్వీసుల మంత్రిగా ఉన్నప్పుడే పేస్‌తో తనకు పరిచయం ఏర్పడిందని.. కాకపోతే అప్పుడు పేస్ చాలా చిన్నవాడు అని తెలిపారు. కాగా అంతకుముందు నటి, సామాజిక కార్యకర్త నఫిసా అలీ కూడా టీఎంసీలో చేరారు. మరోవైపు గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయనుంది. ఈ సందర్భంగా ఎన్నికల సన్నాహాల్లో భాగంగా మూడు రోజుల పాటు మమతా బెనర్జీ గోవాలోనే గడపనున్నారు.