Site icon NTV Telugu

IND Vs BAN: రాణించిన బౌలర్లు.. నామమాత్రపు మ్యాచ్‌లో భారత్ భారీ గెలుపు

Team India

Team India

IND Vs BAN: బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా విజయంతో ముగించింది. ఇప్పటికే రెండు వన్డేలలో ఓటమి చెంది సిరీస్ కోల్పోగా శనివారం జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో టీమిండియా విశ్వరూపం చూపించింది. దీంతో బంగ్లాదేశ్‌పై 227 పరుగుల తేడాతో భారత్ భారీ విజయం సాధించింది. 410 పరుగుల అతి భారీ లక్ష్యఛేదనలో ఆతిథ్య బంగ్లాదేశ్ 182 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లందరూ సమష్టిగా రాణించారు. శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా ఉమ్రాన్ మాలిక్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు సాధించారు. మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో షకీబుల్ హసన్ (43) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. యాసిర్ అలీ 21, మహ్మదుల్లా 20 పరుగులు చేశారు.

Read Also: Team India: 12 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఎట్టకేలకు టెస్ట్ జట్టులో ఉనద్కట్‌కు చోటు

కాగా వన్డేల్లో ఇది టీమిండియాకు మూడో అతిపెద్ద గెలుపు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 409 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. 131 బంతుల్లో 10 సిక్సర్లు, 24 ఫోర్లతో ఇషాన్ కిషన్ చెలరేగి ఆడాడు. అతడికి విరాట్ కోహ్లీ మంచి సహకారం అందించాడు. విరాట్ కోహ్లీ కెరీర్‌లో 44వ వన్డే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడు 91 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 113 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబుల్ హసన్, ఎబాడట్ హుస్సేన్, టస్కిన్ అహ్మద్ తలో రెండు వికెట్లు సాధించారు. ముస్తాఫిజుర్, మెహిదీ హసన్ మిరాజ్ చెరో వికెట్ తీశారు. కాగా మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది. సొంతగడ్డపై తొలిసారిగా టీమిండియాపై వన్డే సిరీస్‌ను ఆ జట్టు గెలుచుకుంది.

Exit mobile version