IND Vs WI: పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ రెండు వికెట్ల తేడాతో అద్భుత రీతిలో విజయం సాధించింది. ఒక దశలో ఓడిపోయేలా కనిపించిన టీమిండియాను స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఆదుకున్నాడు. అతడి ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 311 పరుగులు చేసింది. ఓపెనర్ హోప్ తన వందో వన్డే మ్యాచ్‌లో సెంచరీ(115)తో మెరిశాడు. కైల్ మేయర్స్(39), బ్రూక్స్(35), నికోలస్ పూరన్(74) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు, దీపక్ హుడా, అక్షర్ పటేల్, చాహల్ తలో వికెట్ తీశారు.
Read Also: Subhash patriji: పిరమిడ్ ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ కన్నుమూత
వెస్టిండీస్ విధించిన 312 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 49.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 13 పరుగులకే వెనుతిరిగాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 43 పరుగులు చేశాడు. ధావన్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ ఆచితూచి ఆడాడు. అతడికి సంజు శాంసన్ 54 పరుగులతో చేయూత అందించాడు. సూర్యకుమార్ యాదవ్(9) మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. ఆఖరి 10 ఓవర్లలో 100 పరుగులు అవసరమైన వేళ.. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ టెయిలెండర్లతో కలిసి జట్టును ఆదుకుని అపురూప విజయాన్ని అందించాడు. కేవలం 35 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 64 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. వన్డేల్లో తొలి హాఫ్ సెంచరీ సాధించాడు. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. విండీస్ బౌలర్లలో జోసెఫ్ 2 వికెట్లు, కైల్ మేయర్స్ 2 వికెట్లు తీశారు.