BCCI Trolls: పర్ఫామెన్స్‌కు విలువ లేదా?.. సిఫార్సుల ద్వారానే ఛాన్స్‌లు.. టీమిండియా ఎంపికలపై విమర్శలు!

  • టీ20ల్లో టీమిండియా వరుస పరాజయాలు
  • ఐర్లాండ్‌పై రెండు, ఇంగ్లండ్‌పై మూడు టీ20ల్లో ఓటమి
  • టీమిండియా ఎంపికలపై విమర్శలు
Bcci

Bcci

Team India Selection Debate: టీమిండియా గత 5-6 టీ20ల్లో వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఐర్లాండ్‌పై రెండు, ఇంగ్లండ్‌పై మూడు టీ20ల్లో భారత్ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఎంపికపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఆటగాళ్ల ఎంపికలో ప్రతిభ కంటే వ్యక్తిగత అనుబంధాలు, లాబీయింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారంటూ అభిమానులు, నెటిజన్లు.. బీసీసీఐ, సెలెక్టర్లపై విమర్శలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వైరల్ పోస్టులో టీమిండియా ఆటగాళ్ల ఎంపికపై నెటిజెన్స్ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. అభిషేక్ శర్మకు యువరాజ్ సింగ్ మద్దతు కారణంగా అవకాశం దక్కిందని, 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అతని వయస్సు కారణంగా ప్రత్యేక ప్రాధాన్యం లభించిందని నెటిజెన్స్ పేర్కొన్నారు. ఇషాన్ కిషన్ మాత్రం దేశవాళీ క్రికెట్‌లో రాణించి తిరిగి భారత జట్టులోకి వచ్చిన ఏకైక ఆటగాడని అభిప్రాయపడ్డారు. శ్రేయస్ అయ్యర్ దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చి జట్టులో చోటు సంపాదించాడని పేర్కొన్నారు. శివమ్ దూబేను స్పిన్ బౌలర్లపై భారీ షాట్లు ఆడగలడనే ఉద్దేశంతో ఎంపిక చేసినా.. స్పిన్ బౌలింగ్‌కే బలవుతున్నాడని విమర్శించారు. తిలక్ వర్మ ఎంపిక వెనుక రోహిత్ శర్మ మద్దతు, ముంబై లాబీ ప్రభావం ఉందని ఆరోపించారు.

అక్షర్ పటేల్‌కు 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆడిన కీలక ఇన్నింగ్స్, ఫీల్డింగ్ కారణంగా అవకాశాలు కొనసాగుతున్నాయని.. వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మద్దతు కారణమని ఆ పోస్టులో నెటిజెన్స్ పేర్కొన్నారు. భారత క్రికెట్‌లో ప్రస్తుతం ప్రదర్శన కంటే ఇతర అంశాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. రజత్ పాటీదార్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ ప్రస్తుత టీ20 జట్టులోని చాలా మంది ఆటగాళ్ల కంటే మెరుగైన ప్రదర్శన చేయగలరని అభిప్రాయపడ్డారు. ఇషాన్, శ్రేయాస్ మాత్రమే అద్భుత ప్రదర్శనతో జట్టులో చోటు సంపాదించారని ఫాన్స్ పేర్కొంటున్నారు.