NTV Telugu Site icon

Virat Kohli Retirement: అభిమానులకు బ్యాడ్ న్యూస్.. రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ!

Virat Kohli Retirement

Virat Kohli Retirement

Virat Kohli Retirement: టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. శనివారం రాత్రి బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌ అనంతరం విరాట్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. భవిష్యత్తు తరాలకు అవకాశం ఇవ్వాలనే తాను అంతర్జాతీయ టీ20ల నుంచి తప్పుకుంటున్నట్లు కింగ్ కోహ్లీ స్పష్టం చేశాడు. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది.

ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 76 రన్స్ చేశాడు. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. అవార్డ్ అందుకున్న అనంతరం మాట్లాడిన విరాట్.. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. కోహ్లీ వీడ్కోలు ప్రకటించిన కొన్ని నిమిషాల తర్వాత టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ సైతం అంతర్జాతీయ టీ20కి వీడ్కోలు పలికాడు. దీంతో ఒకేరోజు ఇద్దరు స్టార్‌ ఆటగాళ్లు టీ20ల నుంచి తప్పుకోవడం భారత క్రికెట్‌ చరిత్రలో మరిచిపోలేని రోజుగా మిగిలిపోనుంది.

విరాట్ కోహ్లీ మాట్లాడుతూ… ‘ఇది నా చివరి టీ20 ప్రపంచకప్. మేం సాధించాలనుకున్నది ఇదే. ఈ ప్రపంచకప్‌ గెలవాలని నేను కోరుకున్నా. దేవుడు గొప్పవాడు. కీలక మ్యాచ్‌లో జట్టును గెలిపించే అవకాశాన్ని నాకు ఇచ్చాడు. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. భారత్‌ తరఫున ఇదే నా ఆఖరి టీ20 మ్యాచ్. ఇది ఓపెన్ సీక్రెట్. ఒకవేళ ప్రపంచకప్‌ సాధించకపోయినా రిటైర్మెంట్ ఇచ్చేవాడిని. భవిష్యత్తు తరాలకు అవకాశం ఇవ్వాలనే ఈ నిర్ణయంతీసుకున్నా. ఐసీసీ టోర్నమెంట్‌ను గెలవడానికి మేము చాలా కాలం వేచి చూశాం. రోహిత్ శర్మ 9 టీ20 ప్రపంచకప్‌లు ఆడాడు. ఇది నాకు ఆరో ప్రపంచకప్‌. ఈ విజయానికి రోహిత్ పూర్తి అర్హుడు. భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా కష్టంగా ఉంది. ఇది అద్భుతమైన రోజు’ అని అన్నాడు.

Also Read: Rohit Sharma Retirement: రోహిత్‌ శర్మ సంచలన నిర్ణయం.. టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్‌!

విరాట్ కోహ్లీ 2010లో జింబాబ్వేపై టీ20 అరంగేట్రం చేశాడు. కెరీర్‌లో 125 టీ20లు ఆడిన కోహ్లీ.. 48.69 సగటుతో 4,188 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 38 అర్ధ సెంచరీలు ఉన్నాయి. వన్డే ప్రపంచకప్‌, టీ20 ప్రపంచకప్‌ సాధించిన కొద్దిమంది భారత క్రికెటర్లలో కోహ్లీ ఒకడు. 2011 వన్డే ప్రపంచకప్‌ సాధించిన జట్టులో విరాట్ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఎంఎస్ ధోనీ, వీరేందర్ సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్.. వన్డే, టీ20 ప్రపంచకప్‌లు గెలిచిన జట్టులో ఉన్నారు.

Show comments