Abhishek Sharma: మరో రెండు వారాల్లో 2026 టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా, హోస్ట్‌గా టీమిండియా మరోసారి ట్రోఫీని దక్కించుకునేందుకు బరిలోకి దిగుతుంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన జట్టుతో భారత్ ఈసారి కూడా టైటిల్ కోసం గట్టిగా పోటీ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో మారియట్ బోన్‌వాయ్- ఐసీసీ భాగస్వామ్య కార్యక్రమం ప్రారంభ వేడుకలో పాల్గొన్న సందర్భంగా భారత మాజీ క్రికెటర్, మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి మాట్లాడుతూ.. టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మపై ప్రశంసల జల్లు కురిపించారు. రాబోయే వరల్డ్ కప్‌లో అభిషేక్ ప్రదర్శనే భారత్ విజయంలో కీలకంగా మారుతుందని అన్నారు. ఇతర జట్లు అతడిని ప్రత్యేకంగా గమనిస్తాయని పేర్కొన్నారు.
Read Also: Vasant Panchami 2026: బాసర లో వసంత పంచమి వేడుకలు.. కొనసాగుతున్న అక్షర శ్రీకార పూజలు
అయితే, అభిషేక్ శర్మ బ్యాటింగ్ పై ఎలాంటి సందేహం లేదు.. అతడే ప్రస్తుతం ప్రపంచంలో నంబర్ వన్ టీ20 బ్యాట్స్‌మన్ అని రవిశాస్త్రి తెలిపారు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ను పూర్తిగా తమవైపుకు తిప్పేశాడు.. అతడి ఆత్మవిశ్వాసం అద్భుతంగా ఉంది.. హోమ్ గ్రౌండ్‌లో ప్రేక్షకుల మద్దతు కూడా అతడికి ఉంటుంది.. శర్మ రాణిస్తే, భారత్ కూడా వరల్డ్ కప్ లో దూసుకుపోతుందని వ్యాఖ్యానించారు. కాగా, అభిషేక్‌లో ఉన్న దూకుడు, నిర్భయ బ్యాటింగ్, మ్యాచ్‌ను ఒంటరిగా గెలిపించే సామర్థ్యం టీమిండియాకు పెద్ద బలమని శాస్త్రి తెలిపారు.
Read Also: Union Budget 2026: కేంద్ర బడ్జెట్లో పదవీ విరమణ చేసిన వారికి బిగ్ రిలీఫ్? కనీస పెన్షన్ పెంపు
ఇక, అభిషేక్ శర్మ గతంలో ఇంగ్లాండ్‌పై వాంఖడే స్టేడియంలో ఆడిన చారిత్రక ఇన్నింగ్స్‌ను కూడా రవిశాస్త్రి గుర్తు చేసుకున్నారు. ఆ మ్యాచ్‌లో అభిషేక్ 54 బంతుల్లో 135 పరుగులు చేసి, 7 ఫోర్లు, 13 సిక్సులతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మొత్తం మీద 150 పరుగుల మైలురాయిని అందుకున్న ఆ ఇన్నింగ్స్‌ను అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో తాను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా ఆయన అభివర్ణించారు. ఆ మ్యాచ్ తర్వాత శర్మని ఇంటర్వ్యూ చేసినప్పుడు, అతడి భుజంపై చేయి వేసి ‘యువకా, ఇది నేను చూసిన అత్యుత్తమ టీ20 ఇన్నింగ్స్’ అని చెప్పాను.. ఆ కుర్రాడు నిజంగా ఒక స్టార్ క్రికెటర్.. అతడు బ్యాటింగ్ చేస్తున్నాడంటే టీవీ ఆన్ చేయకుండా ఉండలేం అని రవిశాస్త్రి అన్నారు.