India beat Ireland in T20 World Cup 2024: టీ20లో ప్రపంచకప్ 2024లో భారత్ బోణి కొట్టింది. బుధవారం రాత్రి న్యూయార్క్‌లోని నాసౌవ్ కౌంటీ స్టేడియంలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 97 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 12.2 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (52 రిటైర్డ్ హర్ట్; 37 బంతుల్లో 4×4, 3×6) హాఫ్ సెంచరీ చేయగా.. కీపర్ రిషబ్ పంత్ (36 నాటౌట్; 26 బంతుల్లో 3×4, 2×6) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్థాన్‌తో అసలైన పోరుకు ముందు టీమిండియా అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 16 ఓవర్లలో 96 పరుగులకే ఆలౌట్ అయింది. బౌన్స్‌కు సహకరిస్తున్న పిచ్‌పై భారత పేసర్లు చెలరేగారు. పదునైన పేస్‌తో అర్ష్‌దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలు ఐర్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. టీమిండియా పేసర్ల స్వింగ్, సీమ్, ఎక్స్‌ట్రా బౌన్స్‌కు తేలిపోయారు. డెలాని (26; 14 బంతుల్లో 2×4, 2×6) టాప్ స్కోరర్. మరో ముగ్గురు బ్యాటర్లు 10 రన్స్ దాటారంటే.. బ్యాటర్ల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొన్న హార్దిక్ తన కోటా 4 ఓవర్లు మొత్తం వేయడం భారత్‌కు సానుకూలాంశం.
Also Read: Nainital Accident: నైనిటాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
ఛేదనను రోహిత్ శర్మ ధాటిగా ఆరంభించాడు. లిటిల్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో 4, 6 బాదేశాడు. మరో ఓపెనర్ విరాట్ కోహ్లీ (1) మాత్రం నిరాశపరిచాడు. ఆ తర్వాత పరుగుల వేగం తగ్గింది. పంత్ తాను ఎదుర్కొన్న తొలి 16 బంతుల్లో 17 పరుగులే చేశాడు. రోహిత్ 27 బంతుల్లో 30 చేశాడు. దాంతో భారత్ 8 ఓవర్లకు స్కోరు 52 పరుగులే చేసింది. గేర్ మార్చిన రోహిత్ సిక్స్‌లతో అలరించాడు. అయితే బంతి చేతికి తగలడంతో అతడు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. సూర్యకుమార్ (2) త్వరగానే పెవిలియన్ చేరాడు ధాటిగా ఆడిన పంత్.. దూబె (0 నాటౌట్)తో కలిసి లక్ష్యాన్ని పూర్తి చేశాడు.