India vs Bangladesh Preview and Playing 11: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8లో అఫ్గానిస్థాన్‌పై విజయంతో శుభారంభం చేసిన భారత్.. మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఆంటిగ్వా వేదికగా నేటి రాత్రి బంగ్లాదేశ్‌ను ఢీకొనబోతోంది. రోహిత్ సేన ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే.. దాదాపుగా సెమీస్ బెర్తు సొంతమైనట్లే. ఈ నేపథ్యంలో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. బంగ్లాదేశ్ తన తొలి సూపర్-8 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. బంగ్లాకు ఇది చావోరేవో మ్యాచ్ కాబట్టి గట్టిగానే పోరాడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మ్యాచ్‌లో భారతే ఫేవరెట్ అయినా.. ప్రపంచ క్రికెట్లో పెద్ద జట్లను బంగ్లా ఓడించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కాబట్టి రోహిత్ సేన జాగ్రత్తగా ఉండాల్సిందే.
టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు ఇప్పటిదాకా ఓటమే లేదు. ఎక్కువగా బౌలర్ల ప్రతిభతోనే గెలుస్తున్న భారత్‌కు బ్యాటింగ్ పెద్ద ఆందోళనగా మారింది. ముఖ్యంగా ఓపెనర్ల ఫామ్ కలవరపెడుతోంది. ఐపీఎల్ 2024లో అదరగొట్టిన విరాట్ కోహ్లీ.. ఒక్కసారీ బ్యాట్ ఝళిపించలేదు. 4 మ్యాచ్‌ల్లో కలిపి 29 రన్స్ మాత్రమే చేశాడు. రోహిత్ శర్మ ఫామ్ కూడా అంతంతమాత్రమే ఉంది. ఈ ఇద్దరు బంగ్లాపై అయినా ఫామ్ అందుకుంటారేమో చూడాలి. సూర్యకుమార్, పంత్, హార్దిక్ ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం. వరుసగా విఫలమవుతున్న శివమ్ దూబె స్థానంలో జైస్వాల్‌ను ఆడించే అవకాశాలు ఉన్నాయి. పేసర్లు బుమ్రా, అర్ష్‌దీప్ రాణిస్తున్నారు. అక్షర్, జడేజాలకు కుల్దీప్ తోడై స్పిన్ బలాన్ని పెంచాడు.
బంగ్లాదేశ్ కూడా బలంగానే ఉంది. ముఖ్యంగా బౌలర్లు నిలకడగా రాణిస్తున్నారు. తంజిద్, ముస్తాఫిజుర్, తస్కిన్‌లతో పేస్ విభాగం.. మెహిదీ హసన్, రిషాద్, షకిబ్‌లతో స్పిన్ విభాగం బాగుంది. అయితే బంగ్లా బ్యాటర్లే తేలిపోతున్నారు. తంజిద్, లిటన్ దాస్, నజ్ముల్ ఫామ్‌లో లేరు. హృదాయ్, మహ్మదుల్లా, షకిబ్‌లతో నెట్టుకొస్తోంది. చావోరేవో మ్యాచ్‌లో బంగ్లా బ్యాటర్లు, బౌలర్లు పుంజుకుంటారనడంలో సందేహం లేదు.
Also Read: China : చైనాలో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు 47 మంది మృతి
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్ (కెప్టెన్), కోహ్లీ, పంత్, సూర్యకుమార్, దూబె/జైస్వాల్, హార్దిక్, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్, అర్ష్‌దీప్, బుమ్రా.
బంగ్లాదేశ్: తంజిద్, లిటన్, నజ్ముల్ శాంటో (కెప్టెన్), తౌహిద్, షకిబ్, మహ్మదుల్లా, మెహదీ హసన్, రిషాద్, తస్కిన్, ముస్తాఫిజుర్, తంజిమ్ హసన్.