NTV Telugu Site icon

IND vs USA: ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ గెలిచాం: రోహిత్

Rohit Sharma India

Rohit Sharma India

Rohit Sharma Hails Shivam Dube and Suryakumar Yadav: కఠినమైన న్యూయార్క్‌ పిచ్‌పై పరుగులు చేయడం చాలా కష్టం అని.. సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబేల అద్భుత బ్యాటింగ్‌తోనే తాము గెలిచాం అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అర్ష్‌దీప్ సింగ్ అసాధారణ ప్రదర్శన చేశాడని ప్రశంసలు కురిపించాడు. అమెరికా జట్టులోని అందరూ బాగా ఆడుతున్నారన్నాడు. సూపర్ 8కు అర్హత సాధించడం సంతోషంగా ఉందని రోహిత్ చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్‌ 2024 గ్రూప్‌-ఏలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో అమెరికాపై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ… ’11 రన్స్ అయినా కఠినమైన లక్ష్యం అని తెలుసు. పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేసి విజయం సాధించాం. సూర్యకుమార్ యాదవ్‌, శివమ్ దూబేలు ఎంతో పరిణితితో బ్యాటింగ్ చేసి మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ గెలుపు క్రెడిట్ వారిదే. అమెరికా జట్టులోని భారత క్రికెటర్లలో చాలా మంది మాతో కలిసి క్రికెట్ ఆడారు. వారి పురోగతి చాలా సంతోషాన్నిచ్చింది. గత సంవత్సరం ఎంఎల్సీ టోర్నీలో కూడా అద్భుత ప్రదర్శన చేశారు. వారంతా కష్టపడుతున్నారు. వారు మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నా’ అని అన్నాడు.

Also Read: IND vs USA: టీమిండియాకు అదనంగా ఐదు పరుగులు.. అమెరికా కొంపముంచిన ఐసీసీ కొత్త రూల్!

‘ఈ మ్యాచ్‌లో బౌలర్లదే పైచేయి అవుతుందని తెలుసు. ఈ వికెట్‌పై పరుగులు చేయడం చాలా కష్టం. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా అర్ష్‌దీప్ సింగ్ అసాధారణ ప్రదర్శన చేశాడు. మాకు బౌలింగ్ ఆప్షన్‌లు బాగానే ఉన్నాయి. టైమ్ వచ్చినప్పుడు శివమ్ దూబే చేత బౌలింగ్ చేయిస్తా. ఈరోజు పిచ్ సీమర్‌లకు అనుకూలంగా ఉంది. అందుకే దూబేతో బౌలింగ్ చేయించాను. సూపర్ 8కు అర్హత సాధించడం సంతోషంగా ఉంది. ఇక్కడ క్రికెట్ ఆడడం అంత సులభం కాదు. కానీ మేం ఇక్కడ మూడు మ్యాచ్‌లు గెలిచాం. తనలో బిన్న ఆటగాడు ఉన్నాడని సూర్యకుమార్‌ ఈ మ్యాచ్ ద్వారా నిరూపించాడు. అనుభవజ్ఞులైన ఆటగాళ్ల నుండి ఆశించేది అదే. కఠిన పరిస్థితుల్లో చివరి వరకు క్రీజులో ఉన్న సూర్యకు క్రెడిట్ ఇవ్వాలి’ అని రోహిత్ పేర్కొన్నాడు.