NTV Telugu Site icon

IND vs BAN: ఆనందంగా లేను.. విరాట్ కోహ్లీపై కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Virat Kohli

Virat Kohli

India Batting Coach Vikram Rathour on Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై భారత బ్యాటింగ్‌ కోచ్ విక్రమ్‌ రాథోడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అఫ్గానిస్థాన్‌పై విరాట్ పరుగులు చేసినా.. తనకు ఆనందంగా లేదన్నాడు. విలువైన పరుగులు చేసిన కోహ్లీ.. భారీ ఇన్నింగ్స్‌గా మలచకుండా ఔట్‌ కావడం తనను నిరాశపరిచిందన్నాడు. అయితే గత మ్యాచ్‌లతో పోలిస్తే మెరుగైన ఆట తీరును ప్రదర్శించాడని విక్రమ్‌ రాథోడ్ పేర్కొన్నాడు. ఐపీఎల్‌ 2024లో పరుగుల వరద పారించిన కోహ్లీ.. టీ20 ప్రపంచకప్‌ 2024లో రాణించడం లేదు. 4 మ్యాచ్‌ల్లో కలిపి 29 పరుగులు మాత్రమే చేశాడు. అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 24 బంతుల్లో 24 పరుగులు చేశాడు.

టీ20ల్లో తక్కువ స్ట్రైక్‌రేట్‌తో విరాట్ కోహ్లీ పరుగులు చేయడం సరైంది కాదనే అభిప్రాయం అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లలో నెలకొంది. నేడు సూపర్‌-8లో భాగంగా బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనైనా విరాట్ భారీ ఇన్నింగ్స్‌ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. విక్రమ్‌ రాథోడ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించాడు. ‘అఫ్గానిస్థాన్‌పై విలువైన పరుగులు చేసిన కోహ్లీ.. భారీ ఇన్నింగ్స్‌గా మలచకుండా ఔట్‌ కావడం నాకు సంతోషంగా అనిపించలేదు. అయితే గత మ్యాచ్‌లతో పోలిస్తే మెరుగ్గా ఆడాడు. టీ20 ప్రపంచకప్‌లో సవాళ్లు విసిరే పిచ్‌లపై ఇలా ఆడటం కూడా మంచిదే. బంగ్లాపై విరాట్ మంచి ఇన్నింగ్స్ ఆడుతాడు’ అని విక్రమ్‌ రాథోడ్ ధీమా వ్యక్తం చేశాడు.

Also Read: IND vs BAN: భారత్, బంగ్లాదేశ్ ‘సూపర్’ పోరు.. మ్యాచ్‌కు భారీ అడ్డంకి!

‘భారత్‌లో ఎక్కువగా పరుగులు చేయని బ్యాటర్లు.. ఇక్కడ రాణించడం శుభ పరిణామం. రిషబ్ పంత్‌ టాప్‌ ఆర్డర్‌లో దూకుడుగా ఆడుతున్నాడు. ఇదే ఆటతీరును మిగతా మ్యాచుల్లోనూ కొనసాగిస్తాం. పిచ్‌ పరిస్థితులకు అనుగుణంగానే తుది జట్టు ఉంటుంది. అత్యుత్తమ టీమ్‌తోనే బరిలోకి దిగుతాం. అక్షర్ పటేల్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించడం సానుకూలాంశం. న్యూయార్క్‌లో దారుణమైన పిచ్‌లపై ఆడాం. ఇప్పుడు కరేబియన్‌లో కాస్త మెరుగైన మైదానాల్లో ఆడుతున్నాం. బంగ్లాను తక్కువగా అంచనా వేయడం లేదు. నాణ్యమైన స్పిన్నర్లు ఆ జట్టు ఉన్నారు. టీ20 క్రికెట్‌లో ఏ జట్టైనా తీవ్రంగా పోటీనిస్తుంది. విజయం ఎప్పుడైనా తారుమారవుతుంది. పొట్టి క్రికెట్‌లో జాగ్రత్తగా ఉండాల్సిందే’ అని భారత బ్యాటింగ్‌ కోచ్ చెప్పుకొచ్చాడు.