NTV Telugu Site icon

Rohit Sharma: వారి వలనే ఈ విజయం: రోహిత్

Rohit Sharma Interview

Rohit Sharma Interview

Rohit Sharma hails Suryakumar and Hardik’s partnership: అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా భాగస్వామ్యం విజయంలో కీలక పాత్ర పోషించిందని భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. జస్ప్రీత్ బుమ్రా సత్తా ఏంటో అందరికీ తెలిసిందే అని, ఎప్పుడైనా సరే బాధ్యత తీసుకొని జట్టుకు అండగా నిలుస్తాడని ప్రశంసించాడు. ప్రత్యర్థిని బట్టి తుది జట్టులో మార్పులు ఉంటాయని రోహిత్ చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్‌ 2024 సూపర్‌-8లో భాగంగా గురువారం అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 47 పరుగుల తేడాతో గెలిచింది.

ఈ మ్యాచ్‌ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. ‘గత రెండేళ్లుగా విండీస్‌లో కొన్ని టీ20 మ్యాచ్‌లు ఆడాం. ఆ అనుభవంతో పరిస్థితులకు తగ్గట్టుగా ప్రణాళికలను రూపొందించాం. పిచ్ కండిషన్స్‌ను ఉపయోగించుకున్నాం. మా బౌలింగ్ దళం గురించి మాకు బాగా తెలుసు. మేం విధించిన లక్ష్యాన్ని డిఫెండ్ చేయగలమని అనుకున్నాం. జట్టులో ప్రతీ ఒక్కరు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు. మిడిలార్డర్‌ బ్యాటర్లు గొప్ప పరిణతి చూపించారు. సూర్యకుమార్-హార్దిక్ పాండ్య భాగస్వామ్యం చాలా కీలకం. చివరి వరకూ ఒక బ్యాటర్‌ క్రీజ్‌లో ఉండాలనుకున్నాం’ అని రోహిత్ తెలిపాడు.

Also Read: Realme GT 6 Price: ‘రియల్‌మీ’ సరికొత్త ఫోన్‌.. 10 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్‌!

‘బుమ్రా సత్తా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. జట్టు కోసం అతడు ఏమి చేయగలడో మాకు తెలుసు. ఎక్కడ ఆడినా బాధ్యత తీసుకొని జట్టుకు అండగా నిలుస్తాడు. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడంపై చర్చించుకున్నాం. ప్రత్యర్థిని బట్టి తుది జట్టులో మార్పులు ఉంటాయి. ఇక్కడ ముగ్గురు స్పిన్నర్లతో ఆడటం సరైన నిర్ణయమే. ఒకవేళ పిచ్‌ పేసర్లకు అనుకూలంగా ఉంటే.. వారినే తీసుకుంటాం. జట్టు అవసరాలకు తగ్గట్టుగా అందరూ సిద్ధంగా ఉంటారు’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. సూర్యకుమార్‌ (53) హాఫ్ సెంచరీ చేయగా.. బుమ్రా (3/7) మూడు వికెట్స్ తీశాడు.