భారత్‌లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్ 2026 నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడంపై మాజీ భారత క్రికెటర్ మనోజ్ తివారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారం క్రికెట్ నుంచి రాజకీయాల దాకా వెళ్లిందని, ఆ భారాన్ని పూర్తిగా బంగ్లాదేశ్ ఆటగాళ్లే మోయాల్సి వస్తోందన్నారు. జీవితంలో ఒక్కసారే వచ్చే వరల్డ్‌కప్ వేదికపై ఆడే అవకాశాన్ని రాజకీయ నిర్ణయాలు హరించేశాయని తివారి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల వల్లే బంగ్లాదేశ్ వరల్డ్‌కప్ ఆడేందుకు రావడం లేదని, చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. ఏఎన్ఐతో మాట్లాడిన తివారి.. ఈ నిర్ణయం బంగ్లాదేశ్ క్రికెటర్ల కెరీర్‌లకు పెద్ద దెబ్బ అని అన్నారు.
‘ప్రతి ఆటగాడు తన దేశం తరపున వరల్డ్‌కప్ ఆడాలని కలలు కంటాడు. అలాంటి అవకాశం కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుంది. కానీ ప్రస్తుతం బంగ్లాదేశ్ ఆటగాళ్ల చేతిలో ఏమీ లేదు. ఆడండి లేదా తప్పుకోండి అని ఐసీసీ స్పష్టంగా చెప్పింది. ఐసీసీ చాలా శక్తివంతమైన సంస్థ. కానీ ఇక్కడ బీసీబీ నిర్ణయం ఏమీ లేదు. బయట నుంచి చూస్తే ఇది పూర్తిగా స్పోర్ట్స్ మినిస్ట్రీ నిర్ణయమే అనిపిస్తోంది. క్రీడల్లో రాజకీయాలు జోక్యం చేసుకుంటే ఇలానే జరుగుతుంది. రాజకీయాల కారణంగా ఒక టెస్ట్ ఆడే దేశం వరల్డ్‌కప్‌కు రాకపోవడం చరిత్రలో ఇదే తొలిసారి. ఇది చాలా దురదృష్టకరం’ అని మనోజ్ తివారి అన్నారు.
టీ20 వరల్డ్‌కప్ టోర్నీ కోసం భారత్‌కు తమ జట్టు రావడం లేదని బంగ్లాదేశ్ స్పోర్ట్స్ అడ్వైజర్ ఆసిఫ్ నజ్రుల్ మరోసారి స్పష్టం చేశారు. భద్రతా కారణాలతో శ్రీలంకకు మ్యాచ్‌లు మార్చాలని బంగ్లాదేశ్ కోరినా.. భారత్‌లో ఎలాంటి భద్రతా ముప్పు లేదని ఐసీసీ తేల్చి చెప్పింది. వేదికలు మార్చడం కుదరదని.. ఆడతారా? లేదా వదిలేస్తారా? తేల్చుకోండని.. టోర్నీ యథావిధిగా కొనసాగుతుందని కూడా స్పష్టం చేసింది. టీ20 వరల్డ్‌కప్ నుంచి బంగ్లాదేశ్ బహిష్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని బీసీబీ కూడా అంగీకరించింది. బోర్డు అధికారులు, సీనియర్ ఆటగాళ్లు, తాత్కాలిక ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశాల అనంతరం భద్రతా ఆందోళనలే తమను కఠిన నిర్ణయానికి కారణమని బీసీబీ వెల్లడించింది. ఆటగాళ్లకు ఇందులో ఎలాంటి ప్రమేయం లేదని కూడా పేర్కొంది. తొలి ఐసీసీ టైటిల్ కోసం ఎదురు చూస్తున్న బంగ్లాదేశ్‌కు.. ఈ వరల్డ్‌కప్ మిస్ కావడం తీవ్రంగా నష్టం చేకూర్చే అంశంగా మారనుంది.