సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీకి ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) జట్టును ప్రకటించింది. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు కాకుండా.. ముంబై జట్టు పగ్గాలను ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు అప్పగించింది. 17 మంది సభ్యుల జట్టులో ఐదుగురు భారత ప్లేయర్స్ ఉన్నారు. శార్దూల్, సూర్యకుమార్ సహా సర్ఫరాజ్ ఖాన్, శివం దుబే, అజింక్య రహానేలు ముంబై జట్టులో ఉన్నారు. గత సంవత్సరం శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలో ముంబై టోర్నమెంట్‌ను గెలుచుకుంది. గాయం కారణంగా శ్రేయాస్ ఈ సీజన్‌కు దూరమయ్యాడు.
వికెట్ కీపర్లుగా అంగ్క్రిష్ రఘువంశీ, హార్దిక్ తమోర్‌లను ఎంసీఏ సెలెక్టర్లు జట్టులోకి తీసుకున్నారు. ఫాస్ట్ బౌలర్లు తుషార్ దేశ్ పాండే, తనుష్ కోటియన్ ఎంపికయ్యారు. ఈ సీజన్ రంజీ ట్రోఫీ తొలి దశలో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లలో 530 పరుగులు చేసిన సిద్ధేష్ లాడ్.. జట్టులోకి వచ్చాడు. రంజీ ట్రోఫీలో ముంబై తరఫున రాణించిన సిద్ధేష్ లాడ్.. వైట్-బాల్ టోర్నమెంట్లో సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నాడు. భారత ఆటగాళ్లతో కలిపి ముంబై టీమ్ పటిష్టంగా ఉంది.
Also Read: Rishabh Pant: కొత్త కెప్టెన్ పంత్ కూడా దురదృష్టవంతుడే.. ఈ గణాంకాలు చుస్తే మెంటలెక్కిపోద్ది!
సయ్యద్ ముష్తాక్ అలీ టీ20 ట్రోఫీ ఎలైట్ డివిజన్ నవంబర్ 26 నుంచి డిసెంబర్ 18 వరకు జరుగుతుంది. మొదటి రౌండ్ లక్నో, హైదరాబాద్, అహ్మదాబాద్ సహా కోల్‌కతాలో జరుగుతుంది. నాకౌట్ రౌండ్ ఇండోర్‌లో జరుగుతుంది. నవంబర్ 26న లక్నోలో రైల్వేస్‌తో ముంబై తన మొదటి మ్యాచ్ ఆడనుంది. ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తరపున సూర్యకుమార్ రాణించాడు.161.97 స్ట్రైక్ రేట్‌తో 717 పరుగులు చేశాడు. అయితే ఈ సంవత్సరం భారతదేశం తరపున ఆ ఫామ్‌ను కొనసాగించలేకపోయాడు. ఆసియా కప్‌లో ఆరు ఇన్నింగ్స్‌లలో 72 పరుగులు మాత్రమే చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో నాలుగు టీ20 ఇన్నింగ్స్‌లలో 84 పరుగులు చేశాడు. ఈ సంవత్సరం ఇప్పటివరకు ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేదు. దక్షిణాఫ్రికాతో వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సూర్య రాణించాలని చూస్తున్నాడు.