ICC Rankings: ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకుల్లో టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ తన ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో 46 పరుగులతో సూర్యకుమార్ రాణించాడు. దీంతో ఐసీసీ ర్యాంకుల్లో పాకిస్థాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్‌ను కిందకు నెట్టి మూడో స్థానానికి చేరుకున్నాడు. బాబర్ ఆజమ్ మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ తన నెంబర్ వన్ స్థానాన్ని నిలుపుకున్నాడు. బ్యాటింగ్ టాప్-10లో సూర్యకుమార్ తప్ప మరో టీమిండియా ఆటగాడు స్థానం దక్కించుకోలేకపోయాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 14, విరాట్ కోహ్లీ 16, కేఎల్ రాహుల్ 18వ స్థానాల్లో కొనసాగుతున్నారు.
Read Also:Love Story: ట్రాఫిక్ జామ్‌లో ప్రేమకథ.. అలా మొదలైంది..!!
అటు టీ20 ఆల్‌రౌండర్ల జాబితాలో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టాప్-5కి చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో మొహాలీ టీ20లో 71 పరుగులతో రాణించడంతో ఏడో స్థానం నుంచి ఐదో స్థానానికి హార్దిక్ ఎగబాకాడు. భారత్ తరఫున టాప్-10లో ఉన్న ఏకైక ఆటగాడు హార్దిక్ మాత్రమే. ఈ జాబితాలో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ తొలిస్థానంలో ఉండగా.. మహమ్మద్ నబీ, మొయిన్ అలీ, హసరంగా వరుసగా 2,3, 4 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మ్యాక్స్ వెల్ ఒక స్థానం పడిపోయి ఆరోస్థానానికి దిగజారాడు. మరోవైపు టీ20 బౌలర్ల ర్యాంకుల్లో భువనేశ్వర్ కుమార్ రెండు స్థానాలు దిగజారి 9వ స్థానంలో నిలిచాడు. బౌలర్ల ర్యాంకుల్లో ఆస్ట్రేలియా బౌలర్ హేజిల్‌వుడ్ టాప్-1లో కొనసాగుతున్నాడు. షాంసీ (దక్షిణాఫ్రికా), ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్), రషీద్ ఖాన్ (ఆప్ఘనిస్తాన్) వరుసగా 2,3, 4 స్థానాలు సంపాదించారు.
