విశాఖపట్నం వేదికగా బుధవారం రాత్రి న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో భారత్ 50 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఓటమిపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ అనంతరం స్పందించాడు. సిరీస్ సొంతం చేసుకున్న నేపథ్యంలో నాలుగో టీ20లో తమ్మల్ని తామే పరీక్షించుకున్నాం అని చెప్పాడు. త్వరగా వికెట్స్ పడిపోతే.. ఒత్తిడిలో బ్యాటర్లు ఎలా ఆడుతారో తెలుసుకోవాలనుకున్నాం అని తెలిపాడు. ఫలితం కంటే జట్టు సంసిద్ధతకు ప్రాధాన్యం ఇచ్చామని వెల్లడించాడు. టీ20 వరల్డ్‌కప్ 2026ను దృష్టిలో పెట్టుకుని ఈ మ్యాచ్‌ను ఓ పరీక్షగా వాడుకున్నామని సూర్యకుమార్ చెప్పాడు.
‘మ్యాచ్‌లో ఆరు బ్యాటర్లతో బరిలోకి దిగాం. ఐదుగురు బౌలర్లు ఉండాలన్నది జట్టు వ్యూహం. 180 లేదా 200 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసే సమయంలో రెండు లేదా మూడు వికెట్లు త్వరగా పడితే.. పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలనుకున్నాం. మమ్మల్ని మేమే పరీక్షించుకున్నాం. అలాగేవ రల్డ్‌కప్ స్క్వాడ్‌లో ఉన్న ఆటగాళ్లందరికీ అవకాశం ఇవ్వాలనుకున్నాం. మెగా టోర్నీ ముందు ప్రతి ఆటగాడి పాత్ర, సామర్థ్యాన్ని పరీక్షించుకోవడం ఎంతో కీలకం. మొదట బ్యాటింగ్ చేసినప్పుడు జట్టు బాగా ఆడుతోంది. కాబట్టి ఈసారి ఛేదనలో పరీక్షించుకోవాలనుకున్నాం. భారీ లక్ష్యాన్ని ఛేదించే సమయంలో బ్యాటర్లు ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారో చూడాలన్నదే మా ఆలోచన. వచ్చే మ్యాచ్‌లో ఛేజింగ్ అవకాశం వస్తే తప్పక గెలుస్తాం’ అని సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు.
Also Read: Fastest Fifty Record: శివమ్ దూబే ఊచకోత.. ఫాస్టెస్ట్ ఫిఫ్టీస్ రికార్డ్స్ ఇవే!
మ్యాచ్ పరిస్థితులపై సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. భారీ డ్యూ ప్రభావం ఉన్నా ఒకటి రెండు కీలక భాగస్వామ్యాలు ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. శివమ్ దూబే ఆడిన విధానం ప్రశంసనీయమని, అతనితో పాటు మరో బ్యాటర్ క్రీజులో నిలబడి ఉంటే విజయం సాధించేవాళ్ళం అని చెప్పాడు. ఈ మ్యాచ్‌ను ఓటమిగా కాకుండా.. ఓ గొప్ప పాఠంగా తీసుకుంటున్నామని సూర్యకుమార్ స్పష్టం చేశాడు. నాలుగో టీ20లో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేయగా.. భారత్ 18.4 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది.