ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలంకు సమయం దగ్గరపడుతోంది. డిసెంబరు 16న అబుదాబిలో మినీ వేలం జరగనుంది. వేలంలో 1,355 మంది ప్లేయర్స్ తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు క్రిక్‌బజ్ తన కథనంలో పేర్కొంది. 10 జట్లలో కలిపి 77 స్లాట్‌లు ఖాళీగా ఉండగా.. ఇందులో విదేశీ ప్లేయర్ల స్లాట్‌లు 31 కావడం విశేషం. రిజిస్ట్రేషన్ లిస్ట్‌లో 14 దేశాల నుంచి ఆటగాళ్లు ఉండగా.. మినీ వేలానికి రికార్డ్ రిజిస్ట్రేషన్స్ రావడం గమనార్హం. రిజిస్ట్రేషన్ లిస్ట్‌లో 14 దేశాల నుంచి ఆటగాళ్లు ఉన్నారు. అయితే ఐపీఎల్ 2026కు చాలామంది స్టార్స్ ప్లేయర్స్ దూరం కానున్నారు.
ఐపీఎల్ 2026 మినీ వేలంకు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తన పేరును రిజిస్ట్రేషన్ చేసుకోలేదని తెలుస్తోంది. గతేడాది పంజాబ్ కింగ్స్ జట్టుకు ఆడిన మ్యాక్స్‌వెల్.. తీవ్రంగా నిరాశపర్చాడు. 7 మ్యాచ్‌ల్లో 48 పరుగులే చేశాడు. బౌలింగ్‌లో కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. ఒకవేళ మ్యాక్సీ వేలంలో ఉన్నా.. కొనుక్కోవడానికి ఏ ప్రాంచైజీ ముందుకు రాకపోవచ్చు.
వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ ఆండ్రీ రస్సెల్ తాజాగా ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దాంతో అతడు ఐపీఎల్ 2026కు దూరమయ్యాడు. రస్సెల్‌ను కేకేఆర్ ‘పవర్ కోచ్’గా నియమించింది. దక్షిణాఫ్రికా స్టార్ ఫాఫ్ డుప్లెసిస్, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ కూడా ఐపీఎల్ 2026లో ఆడడం లేదు. ఈ ఇద్దరు పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆడనున్నారు. వివాహం కారణంగా జోష్ ఇంగ్లిస్ అందుబాటులో ఉంటాడో లేదో తెలియదు. ఇప్పటికే నలుగురు ప్లేయర్స్ దూరం కాగా.. వేలంలో మరికొందరు అమ్ముడుపోని లిస్టులో చేరడం ఖాయం.
ఈసారి వేలంలో స్టార్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. కామెరూన్ గ్రీన్, లియామ్ లివింగ్‌స్టోన్, ముజీబుర్ రెహ్మన్, జోష్ ఇంగ్లిస్, స్టీవ్ స్మిత్, ముస్తాఫిజుర్ రెహ్మన్, బెన్ డకెట్, మైకేల్ బ్రాస్‌వెల్, డేవాన్ కాన్వే, మ్యాట్ హెన్రీ, కైల్ జేమీసన్, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, గెరాల్డ్ కొయెట్జీ, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోకియా, వానిందు హసరంగ, మతీశా పతిరన, మహీశ్ తీక్షణ, జేసన్ హోల్డర్, షైయ్ హోప్, అల్జారీ జోసెఫ్ లాంటి స్టార్ ఉన్నారు.