ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం అవ్వగా.. మంగళవారం తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఇందులో శ్రీలంక ఆటగాళ్ళు దారుణమైన ఆటతీరుని ప్రదర్శించడం పట్ల.. ఆ దేశ క్రికెట్ ప్రియులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. 11.5 ఓవర్లలో కేవలం ఒక వికెట్ నష్టానికి 100 పరుగులు చేసింది. అది చూసి.. లంక కచ్ఛితంగా 200 పరుగుల మార్క్‌ని దాటేస్తుందని అంతా భావించారు.
కానీ, ఆ తర్వాత ఓ వికెట్ పడిన తర్వాత లెక్కలన్నీ తారుమారు అయిపోయాయి. స్టార్క్ బౌలింగ్‌లో 36 వ్యక్తిగత పరుగుల వద్ద పాతుమ్ నిస్సాంక ఔటవ్వగా.. అక్కడి నుంచి లంక బ్యాట్స్మన్లు వరుసగా టపీటపీమని ఔటయ్యారు. టాప్ త్రీ బ్యాట్స్మన్లు, వనిందు హసరంగా (17) మినహాయిస్తే.. మిగతా ఆరుగురు బ్యాట్స్మన్లు (1,0,0,1,1,1,1) సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు. దీంతో.. 19.3 ఓవర్లలో శ్రీలంక 128 పరుగులకే ఆలౌటైంగి. అంటే.. 28 పరుగుల వ్యవధిలోనే 9 వికెట్లు పడిపోయాయి. దీంతో, శ్రీలంక ఆటతీరుపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. కాగా.. ఆస్ట్రేలియా బౌలింగ్ విషయానికొస్తే.. హాజిల్‌వుడ్ 4, మిచెల్ స్టార్క్ 3, కేన్ రిచర్డ్‌సన్ ఒక వికెట్ తీశాడు.
ఇక 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు.. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్లు ఆరోన్ ఫించ్ (40 బంతుల్లో 61), డేవిడ్ వార్నర్ (44 బంతుల్లో 70) వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూనే.. వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లతో చెలరేగిపోయారు. దీంతో.. 14 ఓవర్లలోనే 134 పరుగులు చేసి, మ్యాచ్‌ని కైవసం చేసుకున్నారు. శ్రీలంక బౌలర్లలో మహీశ్ తీక్షణ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ వేయగా.. మిగతా బౌలర్లు భారీ పరుగులు సమర్పించుకున్నారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా హాజిల్‌వుడ్ నిలిచాడు.