Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్‌ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు

  • భారత్‌కు కోచ్ కాదు.. మెంటర్ కావాలి
  • టీ20 ప్రపంచకప్ విజయంలో గంభీర్‌కే మొత్తం క్రెడిట్ ఎందుకు?
  • ఆశిష్ నెహ్రా తరహా కోచ్‌లపై ప్రశంసలు
Gautam Gambhir Sreesanth

Gautam Gambhir Sreesanth

Sreesanth Feels Team India Don’t Need a Gautam Gambhir: టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఎస్. శ్రీశాంత్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. భారత జట్టు హెడ్ కోచ్‌ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు చేశాడు. టీమిండియాకు కోచ్ కంటే మెంటర్ అవసరమని, ఆ పాత్రకు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వంటి వ్యక్తి సరైన ఎంపిక అని అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా టీ20 ప్రపంచకప్ 2026 విజయంలో గంభీర్‌కే మొత్తం క్రెడిట్ ఇవ్వడం కూడా సరికాదని శ్రీశాంత్ పేర్కొన్నాడు.

టెస్టుల్లో వైఫల్యాలకు గంభీర్‌నే బాధ్యుడు:

తాజాగా ఓ ఇంటర్వ్యూలో భారత జట్టు ఇటీవల టెస్ట్ క్రికెట్‌లో ఎదుర్కొన్న పరాజయాల గురించి మాట్లాడిన శ్రీశాంత్.. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాల చేతిలో స్వదేశంలో సిరీస్‌లు కోల్పోవడం గౌతమ్ గంభీర్ కోచ్‌గా ఉన్న సమయంలోనే జరిగిందని గుర్తు చేశాడు. గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు కూడా అర్హత సాధించలేకపోయిందని పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌తో 0-3, ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో సిరీస్ ఓటమి, ఇంగ్లాండ్‌తో డ్రా, దక్షిణాఫ్రికాతో మరో సిరీస్ పరాజయం వంటి ఫలితాలు జట్టు ప్రదర్శనపై ప్రశ్నలు లేవనెత్తాయన్నాడు.

×
×
Ad

భారత్‌కు కోచ్ కాదు.. మెంటర్ కావాలి:

గంభీర్ కోచింగ్ విధానంపై తనకు అభ్యంతరాలు ఉన్నాయని శ్రీశాంత్ వెల్లడించాడు. ‘భారత జట్టుకు కోచ్ అవసరం లేదు. ఒక మంచి మెంటర్ అవసరం. ఆటగాళ్లపై అధిక ఒత్తిడి తీసుకురావడం సరైన పద్ధతి కాదు. అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్న ఆటగాళ్లకు తమ బాధ్యతలు తెలుసు. వారికి మద్దతు ఇచ్చే వ్యక్తి కావాలి. ధోనీ సరైన వ్యక్తి. ధోనీ ఎప్పుడూ ఆటగాళ్లపై అనవసర ఒత్తిడి పెట్టేవాడు కాదు. విఫలమైన వెంటనే వారిని పక్కన పెట్టే విధానాన్ని అనుసరించలేదు. ముందుగా ఒక సోదరుడిలా ఉండాలి. గెలిస్తే నవ్వుతూ, ఓడితే కోపపడే వ్యక్తి కాకూడదు. ఆటగాళ్లకు ఆత్మవిశ్వాసాన్ని నింపే వ్యక్తి కావాలి. ధోనీ అదే చేశాడు. అందుకే భారత జట్టుకు ధోనీ లాంటి మెంటర్ అవసరం’ అని శ్రీశాంత్ అన్నాడు.

గంభీర్‌కే మొత్తం క్రెడిట్ ఎందుకు?:

టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత గౌతమ్ గంభీర్‌కు వచ్చిన ప్రశంసలపై కూడా శ్రీశాంత్ స్పందించాడు. ప్రపంచకప్ గెలవడంలో ఆటగాళ్ల పాత్రే కీలకమని, మొత్తం క్రెడిట్ కోచ్‌కు ఇవ్వడం సరికాదని అన్నాడు. ‘భారత్ ప్రపంచకప్ గెలిచినప్పుడు అందరూ గంభీర్‌ను ప్రశంసించారు. కానీ సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్ల ప్రదర్శనలు లేకపోతే.. మైదానంలో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే జట్టు గెలిచేదా?. కోచ్ మైదానంలో నిర్ణయాలు తీసుకోడు కదా’ అని మాజీ పేసర్ శ్రీశాంత్ ప్రశ్నించాడు.

ఆశిష్ నెహ్రా తరహా కోచ్‌లపై ప్రశంసలు:

జట్టుతో ఎప్పుడూ మమేకమై, ఆటగాళ్లతో సన్నిహితంగా ఉండే కోచ్‌లు ఎక్కువ ప్రభావం చూపగలరని శ్రీశాంత్ అభిప్రాయపడ్డాడు. ఆశిష్ నెహ్రా తరహా కోచ్‌లు టీమిండియాకు అవసరం అని చెప్పుకొచ్చాడు. గౌతమ్ గంభీర్ కోచింగ్ శైలిపై శ్రీశాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎంఎస్ ధోనీని మెంటర్‌గా తిరిగి తీసుకురావాలన్న అతని సూచనపై అభిమానులు, మాజీ క్రికెటర్లు ఎలా స్పందిస్తారో చూడాలి.