Singing On Metro, Balloons, Umbrellas And Others Things Banned By Qatar At Football World Cup: ఇస్లామిక్ దేశం ఖతార్ ఫిపా వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇస్తోంది. అయితే అక్కడి చట్టాలు మాత్రం విదేశాల నుంచి వచ్చే ప్రేక్షకులను తెగ ఇబ్బంది పెడుతున్నాయి. ఇస్లామిక్ దేశం అయిన ఖతార్ లో సంస్కృతి, సంప్రదాయాలకు చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఇప్పుడు విదేశీ ప్రేక్షకులు కూడా వీటినే పాటించాలని ఖతార్ ప్రభుత్వం కోరుతోంది. ఖతార్ ఆచారాలను గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తోంది. ఫుట్ బాల్ మ్యాచులు చూసేందుకు వస్తున్న ఏ విదేశీయుడైన అక్కడి చట్టాలను మీరి ప్రవర్తిస్తే స్టేడియాల్లోకి అనుమతించడం లేదు. ఆల్కహాల్, డ్రగ్స్, లైంగికత, డ్రెస్ కోడ్ ఇలా దేన్నైనా ఉల్లంఘిస్తే జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.
Read Also: ISRO: PSLV-C54 రాకెట్ ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్.. 26న ముహూర్తం
ముఖ్యంగా మద్యాన్ని స్టేడియంలోకి అనుమతించమని టోర్నీ మొదలయ్యే రెండు రోజుల ముందు ఖతార్ ప్రభుత్వం తెలిపింది. ఈ విషయంపై విదేశీ ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏ రకమైన ఆహారాన్ని అయినా స్టేడియంలోకి తీసుకురావడానికి అనుమతి లేదు. కేవలం పిల్లలు, వైద్యపరంగా అవసరం అయ్యే వారికి మాత్రమే ఆహారాన్ని అనుమతిస్తున్నారు. ముఖ్యంగా స్వలింగ సంపర్కానికి చిహ్నంగా భావించే ‘రెయిన్ బో’ గుర్తుపై అక్కడి అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. రెయిన్ బో టీషర్టులు, టోపీలను ధరించి వస్తే వారిని నిర్భందిస్తున్నారు.
ఇతర దేశాల నుంచి వచ్చే అభిమానులు ఎక్కువగా శరీరం కనిపించేలా దుస్తులు ధరించవద్దని ఖతార్ ప్రభుత్వం ఆదేశించింది. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే ఖతార్ చట్టాల ప్రకారం జైలు పక్కా. ఇక మెట్రోలో పాటలు పాడటం, బిగ్గరగా నినాదాలు చేయడంపై కూడా ఖతార్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. సైకిళ్లు, రోలర్ బ్లేడ్స్, స్కేట్ బోర్డులు, ఎలక్ట్రిక్ స్కూటర్లు, గొడుగులు, బెలూన్లను స్టేడియంలోకి అనుమతించడం లేదు. పెద్ద ఎత్తున శబ్ధాలు చేసే పరికరాలను, వస్తువులను స్టేడియంలోకి అనుమతించడం లేదు ఖతార్ ప్రభుత్వం.