ఒకప్పుడు జట్టులో సచిన్ టెండూల్కర్ ఉంటే చాలు.. చింతించాల్సిన అవసరం లేదని చెప్పుకునే వారు. అంతటి గొప్ప ఆటగాడు ఆ మాస్టర్ బ్లాస్టర్. ఆయన క్రీజులో అడుగుపెట్టాడంటే.. బౌలర్లందరికీ హడల్. అందుకే, ముందుగా ఆయన్నే ఔట్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకునేవారు. ఎట్టి పరిస్థితుల్లో అయినా పెవిలియన్ పంపాలని.. రకరకాల వ్యూహాలకు పాల్పడేవారు. తానూ అలాంటి వ్యూహమే 2006లో రచించానని, కానీ అది ఫలించలేదని తాజాగా ఓ సీక్రెట్ రివీల్ చేశాడు పాక్ మాజీ పేసర్ షోయబ్ అఖ్తర్.
2006లో పాకిస్థాన్‌లో టీమిండియా పర్యటించినప్పుడు.. తాను సచిన్ టెండూల్కర్‌ను గాయపరచాలని అనుకున్నానని షోయబ్ తెలిపాడు. సచిన్‌ను గాయపరచాలనే ఉద్దేశంతో.. పదేపదే అతడికి తగిలేలా బంతులు వేయాలని ప్రయత్నించానని అన్నాడు. అప్పటి కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ మాత్రం నేరుగా వికెట్లకు బంతిని వేయాలని పదే పదే చెప్పినా.. తాను మాత్రం సచిన్ శరీరాన్నే లక్ష్యంగా చేసుకుని బంతులు విసిరానని తెలిపాడు. సచిన్‌కు గాయమైతే, త్వరగా పెవిలియన్ చేరుతాడని భావించానన్నాడు. ఒకానొక సమయంలో తన ప్రయత్నం ఫలించినట్టే అనిపించిందని, ఓ బంతి అతడి హెల్మెట్‌కి తాకిందని షోయబ్ గుర్తు చేసుకున్నాడు.
కానీ.. సచిన్ మాత్రం దాన్ని పెద్దగా పట్టించుకోలేదని, ఏదో బూజు దులుపుకున్నట్టు దులిపేసుకొని తిరిగి విజృంభించాడని అఖ్తర్ పేర్కొన్నాడు. ఆ తర్వాత కూడా సచిన్‌ను గాయపరచాలని ప్రయత్నించినా, తాను సఫలం కాలేకపోయానన్నాడు. అయితే.. ఆ మ్యాచ్‌లో తాను విఫలమైనప్పటికీ, ఆసిఫ్ మాత్రం అద్భుతంగా బౌలింగ్ వేశాడని కొనియాడాడు. అతడు భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశాడని షోయబ్ అఖ్తర్ చెప్పుకొచ్చాడు.