ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ఆకస్మిక మరణంపై క్రీడాలోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో షేన్ వార్న్ జ్ఞాపకాలను స్మరించుకుంటోంది. భారత క్రికెట్‌లో కూడా షేన్ వార్న్ తనదైన ముద్ర వేశాడు. ముఖ్యంగా ఇండియాలో సూపర్ డూపర్ హిట్ లీగ్ ఐపీఎల్‌లో తొలి ట్రోఫీని ముద్దాడింది షేర్ వార్న్ జట్టే కావడం విశేషం. ఐపీఎల్ తొలి సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడిన వార్న్ ఆ జట్టుకు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు.
తొలి సీజన్‌లో ఏ మాత్రం గెలుపు అంచనాలు లేకుండానే వార్న్ నేతృత్వంలోని రాజస్థాన్ జట్టు బరిలోకి దిగింది. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఊహకు అందని రీతిలో వార్న్ తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఫైనల్‌లో పకడ్బందీ లైనప్ కలిగిన చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసి రాజస్థాన్ జట్టును విజేతగా నిలిపాడు. నాడు ఐపీఎల్ తొలి టైటిల్‌ను ముద్దాడిన వార్న్.. కప్‌తో జట్టు సభ్యులతో కూర్చుని చిరు నవ్వులు చిందిస్తూ కనిపించాడు. కాగా వార్న్ మృతిపై ఇప్పటికే భారత క్రికెట్ ప్రముఖులతో పాటు పలువురు సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.