Sanju Samson React on 97 Runs vs West Indies: క్రికెట్ ఆడడం మొదలుపెట్టినప్పటి నుంచి తాను ఈ రోజు కోసమే ఎదురుచూశాను అని టీమిండియా వికెట్ కీపర్ సంజు శాంసన్ చెప్పాడు. ఇలాంటి ఇన్నింగ్స్‌ను ఆడతానని తాను అస్సలు ఊహించలేదని, తన జీవితంలో అద్భుతమైన రోజు ఇది అని సంతోషం వ్యక్తం చేశాడు. కొన్ని ఏళ్లుగా టీ20 ఫార్మాట్‌లో ఆడుతున్నా అని.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ లాంటి దిగ్గజ ఆటగాళ్లతో ఆడిన అనుభవం దోహదపడిందని చెప్పాడు. మ్యాచ్ పరిస్థితికి అనుగుణంగా బ్యాటింగ్ చేశానని, తనకు నడిపించిన ఆ దేవుడికి కృతజ్ఞతలు అని సంజు భావోద్వేగానికి గురయ్యాడు. టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సులతో 97 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు.
అద్భుత ఇన్నింగ్స్ ఆడిన సంజు శాంసన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా సంజు మాట్లాడుతూ… ‘చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రపంచం అంతా నాదే అని అనిపిస్తోంది. నేను క్రికెట్ ఆడటం ప్రారంభించిన రోజునుంచే దేశానికి ఆడాలని కలలు కనేవాడిని. నేను ఎదురుచూస్తున్న రోజు ఇదే అనిపిస్తోంది. నా ప్రయాణం ఎప్పుడూ ప్రత్యేకమే. కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. ‘నేను సాధించగలనా?’ అని.. ఎన్నోసార్లు నన్ను నేనే అనుమానించుకున్నా. కానీ నమ్మకం మాత్రం వదల్లేదు. ఈ రోజు నన్ను ఆశీర్వదించిన ఆ దేవుడికి కృతజ్ఞతలు. నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను’ అని చెప్పాడు.
Also Read: T20 WC 2026 Semi Final Schedule: సెమీస్ షెడ్యూల్.. భారత్ ప్రత్యర్థి, వేదిక డీటెయిల్స్ ఇవే!
‘పొట్టి ఫార్మాట్‌లో నేను చాలా కాలంగా ఆడుతున్నాను. సుమారు 10–12 సంవత్సరాలుగా ఐపీఎల్ ఆడుతున్నా. భారత్ తరఫున గత 10 ఏళ్లుగా జట్టులో ఉన్నా.. ప్రతి మ్యాచ్ ఆడలేదు. కానీ డగౌట్‌లో కూర్చుని ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలను చూసి నేర్చుకున్నాను. ఆటను పరిశీలించడం చాలా ముఖ్యం. నేను 50–60 మ్యాచ్‌లే ఆడినా.. 100కి పైగా మ్యాచ్‌లు చూశాను. గొప్ప ఆటగాళ్లు ఎలా మ్యాచ్ ఫినిష్ చేస్తారో, పరిస్థితులకు అనుగుణంగా ఎలా ఆట మార్చుకుంటారో గమనించాను. అది నాకు చాలా సహాయపడింది. గత మ్యాచ్‌లో మేము ముందుగా బ్యాటింగ్ చేశాం కాబట్టి పెద్ద స్కోర్ చేయాలనే ఉద్దేశంతో మొదటి బంతి నుంచే పెద్ద షాట్లు ఆడాలని అనుకున్నాను. కానీ ఈ మ్యాచ్ పూర్తిగా భిన్నం. నేను దూకుడుగా ఆడాలని అనుకునే సరికి వికెట్లు పడిపోయాయి. అందుకే భాగస్వామ్యం నిర్మించాలనుకున్నాను’ అని సంజు తెలిపాడు.
‘నేను ఇంత అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడతానని అస్సలు అనుకోలేదు. ఒక్కో బంతిపై దృష్టి పెట్టి నా పాత్రను నిర్వర్తించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇది నా జీవితంలోని గొప్ప రోజులలో ఒకటి. ప్రేక్షకుల మద్దతు అద్భుతం. వాళ్లు చాలా ఎనర్జీని, మద్దతు ఇస్తారు. కానీ ఓవైపు బాగా ఆడకుంటే ఎలా అన్న ఆలోచన కూడా మనసులో ఉంటుంది (నవ్వుతూ). ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా.. నేను ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టి బంతిని గమనిస్తూ, దానికి తగిన విధంగా ఆడాను. అదే ఈరోజు నాకు బాగా పని చేసింది. నన్ను ముందుకు నడిపించిన ఆ దేవుడికి కృతజ్ఞతలు’ అని సంజు శాంసన్ పేర్కొన్నాడు.