Salman Bhatt Blames Babar Azam For Pakistan Failure In Final Match: ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌లో నెదర్లాండ్స్ పుణ్యమా అని ఫైనల్‌కి చేరుకున్న పాకిస్తాన్ జట్టు.. ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే! ఈ ఓటమిని పాకిస్తాన్ వాళ్లు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే జట్టు చేసిన తప్పుల్ని ఒక్కొక్కటిగా ఎత్తి చూపుతున్నారు. ఇప్పుడు పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ ఒక తప్పుని ఎత్తి చూపుతూ.. దాని వల్లే పాక్ ఓడిందంటూ వ్యాఖ్యానించాడు. గాయం కారణంగా షాహీన్ ఆఫ్రిది మైదానాన్ని వీడినప్పుడు.. మిగిలిన బంతుల్ని ఇఫ్తికర్ అహ్మద్‌తో కాకుండా నవాజ్‌తో వేయించి ఉంటే, ఫలితం మరోలా ఉండేదని సల్మాన్ అభిప్రాయపడ్డాడు. ఇక్కడే బాబర్ ఆజమ్ పప్పులో కాలేశాడని, అతడ్ని విమర్శించాడు.
‘‘షాహీన్ ఆఫ్రీది ఫైనల్ మ్యాచ్‌లో చాలా అద్భుతంగా బౌలింగ్ వేశాడు. ఆరంభంలోనే.. మాంచి ఫామ్‌లో ఉన్న హేల్స్‌ను ఔట్ చేశాడు. అలాంటి షాహీన్‌కు, పవర్‌ప్లేలో భాగంగా ఐదో ఓవర్ ఎందుకు ఇవ్వలేదో అర్థం కావట్లేదు. ఆ సమయంలో బంతి బాగా స్వింగ్ అవుతోంది కాబట్టి.. షహీన్, నసీమ్ షాలతో బాబర్ వరుస ఓవర్లు వేయించాల్సింది. పైగా, ఆ సమయంలో ఇంగ్లండ్ ఒత్తిడిలో ఉంది. కానీ.. బాబర్ ఆ ఇద్దరికి బదులు షాదాబ్ ఖాన్‌తో బౌలింగ్ వేయించాడు. ఆ నిర్ణయం ఇంగ్లండ్ బ్యాటర్లపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఇక షాహీన్ గాయం కారణంగా తన సెకెండ్ స్పెల్ కోటాను పూర్తి చేయలేకపోయాడు. ఆ టైంలో క్రీజులో బెన్ స్టోక్స్ ఉండటం వల్ల.. షాహీన్ ఓవర్‌ను పూర్తి చేయించడం కోసం ఇఫ్టికర్‌ను బాబర్ రంగంలోకి దింపాడు. ఇది ముమ్మాటికి సరైన నిర్ణయం కాదు. అతనికి బదులు మహ్మద్ నవాజ్‌తో ఆ మిగిలిన బంతులు వేయించి ఉంటే, రిజల్ట్ మరోలా ఉండేది. కానీ, బాబర్ అలా చేయకుండా ఇఫ్తికర్‌కి బౌలింగ్ ఇవ్వడం వల్ల.. మ్యాచ్ స్వరూపమే మారిపోయింది’’ అంటూ సల్మాన్ భట్ చెప్పుకొచ్చాడు.
కాగా.. ఇంగ్లండ్ బ్యాటింగ్ ఇన్నింగ్స్‌లో భాగంగా 16వ ఓవర్ వేసేందుకు షాహీన్ ఆఫ్రీది రంగంలోకి దిగాడు. మొదటి బంతిని వేసిన అనంతరం అతడు గాయాలపాలయ్యాడు. మిగిలిన బంతుల్ని వేయలేకపోయాడు. దీంతో.. ఆ ఓవర్‌లోని మిగిలిన ఐదు బంతుల్ని ఇఫ్తికర్ అహ్మద్‌తో బాబర్ వేయించాడు. ఆ ఐదు బంతుల్లో ఇంగ్లండ్ బ్యాటర్లు ఏకంగా 13 పరుగులు కొట్టారు. అప్పట్నుంచే మ్యాచ్ ఇంగ్లండ్ వైపు మలుపు తిరిగింది.