ఫిబ్రవరి తొలివారంలో వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ సందర్భంగా ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు జరగనున్నాయి. ఇప్పటికే వన్డే సిరీస్ కోసం ఇరు జట్లను సెలక్టర్లు ప్రకటించారు. అయితే ఈ సిరీస్‌కు ఎంపిక చేసిన వెస్టిండీస్ జట్టులో కొంత మంది సీనియర్ ఆటగాళ్లతో కెప్టెన్ కీరన్ పొలార్డ్‌కు విభేదాలు తలెత్తాయి. ఆల్‌రౌండర్ ఓడెన్ స్మిత్ విషయంలో అతడు వివక్షపూరితంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. దీంతో వెస్టిండీస్ జట్టులో లుకలుకలు బహిర్గతం అయ్యాయని విండీస్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
Read Also: ఆఫ్ఘనిస్తాన్ సంచలనం.. తొలిసారిగా ప్రపంచకప్ సెమీఫైనల్‌లో చోటు
అయితే ఈ వార్తలపై క్రికెట్ వెస్టిండీస్ బోర్డు స్పందించింది. తమ జట్టులో విభేదాలు ఉన్నాయంటూ వచ్చిన వార్తలను బోర్డు ఖండించింది. విండీస్ జట్టులో ఎటువంటి విభేదాలు లేవని, ఆటగాళ్లందరూ బాగానే ఉన్నారని పేర్కొంది. కెప్టెన్ పొలార్డ్ విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ఇటువంటి వదంతులు సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో వెస్టిండీస్ జట్టు పాల్గొంటోంది. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు పూర్తి కాగా విండీస్ 2-1 ఆధిక్యంలో ఉంది.