భారత జట్టులో సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల స్థానాన్ని ఎన్నడూ ప్రశ్నించకూడదని టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అన్నారు. రో-కోలకు ఆట కొత్త కాదని, కొన్ని ఓవర్లు ఆడితే లయ అందుకుంటారన్నారు. ఇద్దరిని ఇతర ఆటగాళ్ల కంటే భిన్నంగా చూడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రోహిత్-కోహ్లీలు ఒకే ఫార్మాట్ ఆడుతున్నా.. ఫామ్ విషయంలో పెద్దగా ఇబ్బంది ఉండదని బంగర్ చెప్పుకొచ్చారు. టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన రో-కోలు ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఇద్దరు పరుగుల వరద పారించారు.
తాజాగా సంజయ్ బంగర్ మాట్లాడుతూ… ‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల స్థానాన్ని ఎప్పుడూ ప్రశ్నించకూడదు. భారత జట్టులో ఎన్నో సంవత్సరాలుగా ఆడుతున్నారు. జట్టు కోసం ఎంతో చేశారు. రో-కోలు రెండు టీ20, టెస్టుల నుంచి రిటైర్ అయ్యారు. ఇప్పుడు ఒకే ఫార్మాట్ ఆడుతున్నారు. అయినా వారిద్దరి ఫామ్ విషయంలో ఇబ్బంది ఉండదు. ఇద్దరికీ ఆట కొత్త కాదు కాబట్టి.. కొన్ని ఓవర్లు ఆడితే లయ అందుకుంటారు. యువ ఆటగాళ్ల మాదిరి ఎక్కువ మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం లేదు. ఫిట్‌గా ఉండి నాణ్యమైన ఆటగాళ్లు జట్టుకు అవసరం. ఈ విషయంలో రోహిత్-కోహ్లీలు అద్భుతం. ఇద్దరినీ ఇతర క్రికెటర్ల కన్నా భిన్నంగా చూడాలి’ అని అన్నారు.
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ బాదాడు. రాంచి వన్డేలో 135, రాయపూర్ వన్డేలో 102, విశాఖ వన్డేలో 65 రన్స్ చేశాడు. మొత్తంగా సిరీస్‌లో 302 పరుగులు చేసిమా కోహ్లీ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. మరోవైపు రోహిత్ శర్మ రెండు అర్ధ శతకాలతో సత్తాచాటాడు. ఇద్దరూ 2027 ప్రపంచకప్ వరకు ఆడాలని చుస్తున్నారు. ఇలా ఆడితే కోచ్ గౌతమ్ గంబీర్ కూడా జట్టు నుంచి వీరిని తీసేయలేడు.