శుక్రవారం (నవంబర్ 14) నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ ఆడనున్నాడు. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో మ్యాచ్‌లో పంత్ కాలికి గాయమైంది. గాయం కారణంగా దాదాపు నాలుగు నెలలు జట్టుకు దూరమైన అతడు కోల్‌కతా టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేస్తున్నాడు. వైస్ కెప్టెన్ కూడా అయిన పంత్‌కు టీమిండియా ప్లేయింగ్ 11లో చోటు ఖాయం. మొదటి టెస్టు నేపథ్యంలో పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
గాయం తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టడం అనుకున్నంత తేలిక కాదని రిషబ్ పంత్ అంటున్నాడు. ఆ దేవుడు ఎంతో దయగలవాడని, చాలాసార్లు తనను ఆశీర్వదించాడని పేర్కొన్నాడు. ‘గాయం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేయడం చాలా కష్టం. కానీ ఆ దేవుడు ఎంతో దయగలవాడు. నన్ను ఎన్నోసార్లు ఆశీర్వదించాడు. ఈసారి కూడా నన్ను కరుణించాడు. మైదానంలోకి తిరిగి రావడం పట్టలేని ఆనందంగా ఉంది. గాయం నుంచి కోలుకొనే సమయంలో నా పేరెంట్స్, సన్నిహితులు.. అందరూ నాకు మద్దతుగా నిలిచారు. వారికి నా ధన్యవాదాలు’ అని పంత్ చెప్పాడు.
Also Read: SSMB29: కుంభ, మందాకిని అదుర్స్.. ఇక నెక్స్ట్ రుద్ర, సోషల్ మీడియా షేకే!
అదృష్టం మన చేతుల్లో ఉండదని.. నియంత్రణలో ఉన్న విషయాల మీదే తాను దృష్టిపెడతా అని రిషబ్ పంత్ చెబుతున్నాడు. మనకు నచ్చే పనులనే చేస్తూ ఉండాలని, ఏ పని చేసినా ఆస్వాదిస్తూ చేయాలన్నాడు. మనం చేసే పని మీద 100 శాతం ఎఫర్ట్స్ పెట్టాలని పంత్ అంటున్నాడు. దక్షిణాఫ్రికా ఏతో జరిగిన తొలి అనధికారిక మ్యాచ్‌లో పంత్ దారుణంగా విఫలమయ్యాడు. 20 బంతుల్లోనే ఔటై అభిమానులను నిరాశపర్చాడు. కోల్‌కతా టెస్టులో రాణించాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.