శ్రీలంకతో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో టీమిండియా దుమ్ము రేపుతోంది. ఈ టెస్టు ద్వారా టీమిండియా ఆటగాళ్లు పలు రికార్డులు సృష్టిస్తున్నారు. ఇప్పటికే ఈ మ్యాచ్‌తో రోహిత్ 400 అంతర్జాతీయ మ్యాచ్‌ల ఘనతను అందుకున్నాడు, మరోవైపు వికెట్ కీపర్ రిషబ్ పంత్ టెస్టుల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసి 40 ఏళ్ల కిందటి కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టాడు. బెంగళూరు టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ టీ20 తరహా బ్యాటింగ్‌తో లంక బౌలర్లకు చుక్కలు చూపాడు.
కేవలం 28 బంతుల్లోనే రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ చేశాడు. వీటిలో 7 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. 1982లో కపిల్ దేవ్ కరాచీ వేదికగా జరిగిన టెస్టులో పాకిస్తాన్‌పై 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఇప్పుడు కపిల్ రికార్డును రిషబ్ పంత్ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో పంత్ తరువాత శార్దూల్ ఠాకూర్ 31 బంతుల్లో, వీరేంద్ర సెహ్వాగ్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసిన ఆటగాళ్లుగా నిలిచారు. శార్దూల్ ఠాకూర్ 2021లో ఇంగ్లండ్‌పై ఓవల్ మైదానంలో ఈ హాఫ్ సెంచరీని సాధించగా.. సెహ్వాగ్ 2008లో చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో ఈ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.