GT vs RCB: సిక్సర్ల సునామీ.. స్టేడియంలో ఆర్సీబీ శివతాండవం! గుజరాత్ టైటాన్స్ గెలవాలంటే 255 కొట్టాల్సిందే..

Phil Salt & Rajat Patidar

Phil Salt & Rajat Patidar

GT vs RCB: ఐపీఎల్ సమరంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్లు ఈ రోజు శివతాండవం చేశారు. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా గుజరాత్‌-బెంగళూరు మ్యాచ్‌‌లో గుజరాత్ టైటాన్స్ (GT) బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ నిర్ణీత ఓవర్లలో పరుగుల వరద పారించారు. రజత్ పాటిదార్ విధ్వంసకర ఇన్నింగ్స్, కోహ్లీ క్లాస్ టచ్, చివర్లో జితేశ్ శర్మ మెరుపులతో ఆర్సీబీ.. గుజరాత్ టైటాన్స్ ముందు 255 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్
టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే గుజరాత్ నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఆర్సీబీ ఓపెనర్లు ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించారు. మహ్మద్ సిరాజ్ వేసిన తొలి ఓవర్లోనే వెంకటేశ్ అయ్యర్ 3 ఫోర్లతో విరుచుకుపడి 14 పరుగులు రాబట్టాడు. అయితే డేంజరస్‌గా మారుతున్న వెంకటేశ్ అయ్యర్ (19)ను కగిసో రబాడా అవుట్ చేసి ఆర్సీబీకి ఫస్ట్ షాక్ ఇచ్చాడు.

విరాటోత్పాతం.. పడిక్కల్ క్లాస్ బ్యాటింగ్
తొలి వికెట్ పడ్డా విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్ జోడి ఏమాత్రం తగ్గలేదు. రబాడా వేసిన ఒకే ఓవర్లో పడిక్కల్ వరుసగా 3 ఫోర్లు బాదగా.. విరాట్ కోహ్లీ సిక్సర్లు, ఫోర్లతో చెలరేగిపోయాడు. కేవలం 23 బంతుల్లోనే వీరిద్దరూ అర్ధశతక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే, జాసన్ హోల్డర్ వేసిన 9వ ఓవర్లో ఆర్సీబీకి గట్టి షాక్ తగిలింది. నిలకడగా ఆడుతున్న విరాట్ కోహ్లీ (43), దేవ్‌దత్ పడిక్కల్ (30)లను హోల్డర్ వరుస బంతుల్లో అవుట్ చేసి ఆర్సీబీని దెబ్బతీశాడు.

రజత్ పాటిదార్ సిక్సర్ల సునామీ..
94 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన రజత్ పాటిదార్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. కృనాల్ పాండ్యతో కలిసి గుజరాత్ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. కుల్వంత్ ఖేజ్రోలియా వేసిన 15వ ఓవర్లో ఇద్దరూ కలిసి ఏకంగా 28 పరుగులు పిండుకున్నారు. మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ వేసిన 16వ ఓవర్లో పాటిదార్ 3 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 21 బంతుల్లోనే రజత్ పాటిదార్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కృనాల్ పాండ్య (43) రబాడా బౌలింగ్‌లో అవుట్ కాగా, టిమ్ డేవిడ్ (4) ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 19వ ఓవర్లో మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌ను ఆర్సీబీ బ్యాటర్లు టార్గెట్ చేశారు. తొలి రెండు బంతులకు రజత్ పాటిదార్ 6, 4 బాదగా.. చివరి రెండు బంతులకు వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ 4, 6 బాది స్టేడియాన్ని హోరెత్తించాడు. ఈ ఓవర్లో ఏకంగా 21 పరుగులు రావడంతో 19 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ స్కోరు 5 వికెట్ల నష్టానికి 235 పరుగులకు చేరింది. లాస్ట్ ఓవర్లో బౌలింగ్‌కు దిగిన ప్రసిద్ధ్‌ కృష్ణ 19 పరుగులు ఇచ్చాడు. దీంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. రజత్‌ పాటిదార్‌ 93, జితేశ్‌ శర్మ 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ విజయం సాధించాలంటే 255 కొట్టాల్సిందే.