Ravindra Jadeja: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై అభిమానులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. దేశం కంటే భార్య పోటీ చేస్తున్న ఎన్నికలు ముఖ్యమా అని నిలదీస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జడేజా గాయం కారణంగా ఆసియా కప్ నుంచి నిష్క్రమించాడు. ఆ తర్వాత సర్జరీ చేయించుకోవడంతో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీకి కూడా దూరంగా ఉన్నాడు. అయితే వచ్చేనెలలో జరిగే బంగ్లాదేశ్ పర్యటనకు బీసీసీఐ జడేజాను ఎంపిక చేసింది. కానీ తనకు ఇంకా గాయం నయం కాలేదని ఈ టూర్ నుంచి జడేజా తప్పుకున్నాడు. అయితే జడేజా చెప్పిందొకటి.. చేస్తుందొకటి కావడంతో టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాయం నుంచి కోలుకోలేదని చెప్పిన జడేజా విశ్రాంతి తీసుకోకుండా భార్య తరఫున గుజరాత్ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు బంగ్లాదేశ్ పర్యటనకు దూరమయ్యాడని తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
కాగా ఈ ఏడాది డిసెంబర్‌లో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా జామ్ నగర్ నార్త్ నియోజకవర్గం నుండి బీజేపీ తరుఫున బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలో జడేజా తన భార్యకు మద్దతుగా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాడు. ఇటీవల తన భార్యతో దగ్గరుండి నామినేషన్ వేయించిన జడేజా.. భార్య గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాడు. తన భార్యకు ప్రజా సేవ అంటే ఇష్టమని.. తను కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. భార్య కోసం జడేజా ప్రచారం చేయడం బాగానే ఉన్నా.. స్వప్రయోజనాల కోసం దేశం తరఫున ప్రాతినిథ్యం వహించకుండా తప్పించుకోవడం సిగ్గుచేటని జడేజాపై విమర్శలు గుప్పిస్తున్నారు.
Read Also: Selfie Tragedy: సెల్ఫీ మోజులో నలుగురు యువతులు బలి
అయితే బీజేపీ మద్దతుతోనే జడేజా ఇలా వ్యవహరిస్తున్నాడని పలువురు అతడిని ట్రోల్ చేస్తున్నారు. బీజేపీ క్రికెట్‌లో కూడా రాజకీయాలు చేస్తోందని మండిపడుతున్నారు. అమిత్ షా కొడుకు జై షా సపోర్ట్‌తోనే జడేజా బంగ్లాదేశ్ టూర్‌కు వెళ్లకుండా బీజేపీ కోసం ప్రచారం చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. జడేజాకు దేశం కంటే భార్య ఎన్నికలే ముఖ్యమైయ్యాయని.. జడేజాను టీమిండియాను నుండి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.