Ravi Shastri Suggests To Reduce 10 Overs To Make ODI Interesting: టీ20 క్రికెట్ వచ్చినప్పటి నుంచి వన్డే ఫార్మాట్ శోభ క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇంతకుముందులా వన్డే క్రికెట్‌కు ఆదరణ లభించడం లేదు. టీ20లపైనే క్రీడాభిమానులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వన్డే ఫార్మాట్‌పై టీమిండియా టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వన్డేలు క్రమంగా అంతరించిపోతున్నాయని, అలా జరగకుండా వాటి మనుగడ సాగాలంటే ఓ కీలక మార్పు చేయాలని సూచించారు. వన్డే క్రికెట్ 50 ఓవర్ల పాటు సాగుతుండడంతో.. అంత ఎక్కువసేపు చూడలేక ప్రేక్షకులు విసుగెత్తిపోతున్నారన్నారు. కాబట్టి.. ఈ ఫార్మాట్‌ను 40 ఓవర్లకు కుదించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అలా చేయకపోతే మాత్రం వన్డే క్రికెట్ అంతరించిపోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.
పది ఓవర్లను కుదించడం వల్ల వన్డే ఫార్మాట్‌కు మునపటి కంటే ఎక్కువ ఆదరణ లభిస్తుందని రవిశాస్త్రి పేర్కొన్నారు. గతంలో 60 ఓవర్లుగా సాగే వన్డే ఫార్మాట్‌ను 50 ఓవర్లకు కుదించారని గుర్తు చేసిన ఆయన.. ఇప్పుడున్న పరిస్థితుల్లో వన్డేను 40 ఓవర్లకు కుదిస్తే బెటరని సలహా ఇచ్చారు. 50 ఓవర్ల పాటు ఆట సాగడం వల్ల.. ప్రేక్షకులు బోర్ ఫీల్ అవ్వడంతో పాటు ఆటగాళ్లు సైతం తీవ్ర అలసటకు, ఒత్తిడికి లోనవుతున్నారని చెప్పారు. ఈ విషయంలో ఐసీసీ త్వరగా మేల్కోవాలని, లేకపోతే వన్డే ఫార్మాట్ చచ్చిపోతుందని తెలిపారు. అటు.. షాహిద్ ఆఫ్రిది సైతం ఇదే విషయాన్ని ప్రతిపాదించాడు. వన్డే క్రికెట్‌ను కాపాడాలంటే.. 50 నుంచి 40 ఓవర్లకు ఈ ఫార్మాట్‌ను కుదించాల్సిందేనని అభిప్రాయపడ్డాడు. అయితే.. వసీమ్ అక్రమ్ లాంటి దిగ్గజ ఆల్‌రౌండర్ మాత్రం అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌లో నుంచి వన్డే ఫార్మాట్‌నే తొలగించాలని చెప్పడం షాక్‌కి గురి చేస్తోంది.