ఐపీఎల్‌లో శనివారం మధ్యాహ్నం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించి ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 41 బంతుల్లో 9 ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 68 పరుగులు చేశాడు. అతడికి మరో ఓపెనర్ జాస్ బట్లర్(30) మంచి సహకారం అందించాడు.
మరోవైపు కెప్టెన్ సంజు శాంసన్ (23), దేవదత్ పడిక్కల్ (31) కూడా రాణించడంతో రాజస్థాన్ విజయం వైపు దూసుకెళ్లింది. చివర్లో హెట్ మెయిర్ (31 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో 2 బంతులు మిగిలి ఉండగానే రాజస్థాన్ లక్ష్యాన్ని ఛేదించింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీయగా, రబాడ, రిషి ధావన్ తలో వికెట్ సాధించారు. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో రాజస్థాన్ 11 మ్యాచ్‌ల ద్వారా 14 పాయింట్లు సాధించి మూడో స్థానానికి ఎగబాకింది.