T20 World Cup: బ్రిస్బేన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన ప్రాక్టీస్ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా భారీ వర్షం గబ్బా మైదానాన్ని ముంచెత్తడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. మెగా టోర్నీకి ముందు టీమిండియాకు రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లను కేటాయించగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో మ్యాచ్‌ను కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకుని పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు సిద్ధం కావాలన్న టీమిండియాపై వరుణుడు నీళ్లు చల్లాడు. తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్, బౌలింగ్‌లో మహ్మద్ షమీ, ఫీల్డింగ్‌లో విరాట్ కోహ్లీ మెరుపులను చూసి భారత అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.
Read Also: China Blocks India: మరోసారి పాకిస్తాన్‌కు మద్దతుగా చైనా.. ఇండియా ప్రతిపాదనకు అడ్డు
మరోవైపు ఈ ఆదివారం భారత్-పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌పైనా అనుమానాలు నెలకొన్నాయి. మ్యాచ్ జరిగే రోజు మెల్‌బోర్న్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఆస్ట్రేలియా వాతావరణం విభాగం బ్యూరో ఆఫ్ మెటరాలజీ అంచనా వేసింది. ఒకవేళ వర్షం పడితే కుంభవృష్టి తరహాలో పడుతుందని.. సుమారు మూడు మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదు కావొచ్చని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే మ్యాచ్ రద్దవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే వర్షాకాలంలో మెగా టోర్నీ ఎలా నిర్వహిస్తారని ఐసీసీని నెటిజన్‌లు ప్రశ్నిస్తున్నారు. అటు శనివారం ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మ్యాచ్ కూడా వర్షార్పణం కావొచ్చని తెలుస్తోంది. ఒకవేళ ఆయా మ్యాచ్‌లు రద్దయితే పాయింట్లలో కోత పడి టోర్నీలో విజయావకాశాలపై తీవ్ర ప్రభావం పడనుంది.