బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా నిలిచింది. కోల్‌కతాలోని ఈడెన్ మైదానంలో చిరుజల్లులు కురుస్తుండటంతో అంపైర్లు టాస్ ప్రక్రియను వాయిదా వేశారు. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ చెత్త రికార్డు బెంగళూరు జట్టును కలవరపరుస్తోంది. 2008 నుంచి ఇప్పటి వరకు మొత్తం 14 ఐపీఎల్ సీజన్‌లు జరగ్గా.. ఆర్సీబీ ఏడు సార్లు ప్లేఆఫ్స్‌లో ఆడింది. కానీ కనీసం ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలవలేకపోయింది. గత 14 ఏళ్లలో ఆర్సీబీ మూడు సార్లు ఫైనల్‌కు చేరినా టైటిల్ అయితే సాధించలేకపోయింది.
ఓవరాల్‌గా ప్లేఆఫ్స్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ టీమ్‌కు మెరుగైన రికార్డు లేదు. ఇప్పటి వరకు ఆ జట్టు 13 ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ఆడగా అందులో కేవలం 5 మ్యాచ్‌లలో మాత్రమే గెలిచింది. 2020లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిన బెంగళూరు, 2021లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. 2009, 2011, 2016లో అడ్డంకులన్నీ దాటుకుని ఫైనల్‌కు చేరినా.. ఒత్తిడిని అధిగమించలేక టైటిల్ చేజార్చుకుంది.