రెండు సార్లు ఒలింపిక్స్ పతకం విజేత, భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు మరోసారి సత్తా చాటుతోంది. డెన్మార్క్ ఓపెన్‌లో ఆమె క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. రెండో రౌండ్‌కు సంబంధించి 67 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో 21-16, 12-21, 21-15 తేడాతో థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్‌పై పీవీ సింధు విజయకేతనం ఎగురవేసింది. ఆగస్టులో టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన అనంతరం సింధుకు ఇది తొలి టోర్నమెంట్.
మహిళల సింగిల్స్ పోటీల్లో పాల్గొంటున్న పీవీ సింధు డెన్మార్క్ ఓపెన్‌లో తొలి రెండు రౌండ్లలో అద్భుత ప్రదర్శన చేసింది. తొలి రౌండ్‌లో టర్నీకి చెందిన నెస్లిహాన్ యిగిట్‌ను ఓడించిన పీవీ సింధు.. రెండో రౌండ్‌లో బుసానన్‌ను ఓడించింది. అయితే బుసానన్ అంత తేలిగ్గా తలవంచకపోవడంతో పీవీ సింధు గంటకు పైగా పోరాడాల్సి వచ్చింది. కాగా భారత్‌కు చెందిన మరో స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ డెన్మార్క్ ఓపెన్ నుంచి ఇప్పటికే నిష్క్రమించింది.