PBKS vs DC : ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ బ్యాటర్లు శివతాండవం ఆడారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసిన పంజాబ్, ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ధర్మశాల పిచ్‌పై బౌలర్లకు కొంత సహకారం ఉన్నప్పటికీ, పంజాబ్ బ్యాటర్లు అద్భుతమైన హిట్టింగ్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్‌ను ప్రియాన్ష్ ఆర్య మెరుపు వేగంతో ప్రారంభించాడు. ముఖ్యంగా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ వేసిన మొదటి ఓవర్‌లోనే ప్రియాన్ష్ విరుచుకుపడి 22 పరుగులు రాబట్టాడు. పవర్ ప్లే ముగిసేసరికి పంజాబ్ వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ప్రియాన్ష్ 33 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 56 పరుగులు చేసి మాధవ్ తివారి బౌలింగ్‌లో అవుటయ్యాడు. మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (18) ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.
ఓపెనర్లు అవుటైన తర్వాత ఇన్నింగ్స్ బాధ్యతను కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ భుజానికెత్తుకున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా తడబడకుండా ఆడిన అయ్యర్, 36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి కూపర్ కానలీ (38) నుంచి మంచి సహకారం లభించింది. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇన్నింగ్స్ చివర్లో సూర్యాంశ్ షెడ్జ్ కేవలం 8 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 21 పరుగులు చేసి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.
ఢిల్లీ బౌలర్లలో యువ బౌలర్ మాధవ్ తివారి ఆకట్టుకున్నాడు. తన 4 ఓవర్లలో 40 పరుగులిచ్చి ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కానలీ వంటి కీలక వికెట్లను పడగొట్టాడు. సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ 19వ ఓవర్‌లో స్టోయినిస్, శశాంక్ సింగ్‌లను వరుస బంతుల్లో అవుట్ చేసి పంజాబ్‌ను కట్టడి చేసే ప్రయత్నం చేశాడు. అయితే, స్టార్క్ తన 4 ఓవర్లలో ఏకంగా 57 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. ముఖేష్ కుమార్ (1/31) పొదుపుగా బౌలింగ్ చేయగా, లుంగి ఎంగిడి ధారాళంగా పరుగులు ఇచ్చాడు.
ధర్మశాల వేదికగా ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఏ జట్టు కూడా 200 పైచిలుకు స్కోరును ఛేజ్ చేయలేదు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ఆ రికార్డును తిరగరాస్తేనే టోర్నీలో తమ అవకాశాలను సజీవంగా ఉంచుకోగలదు. 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగుతున్న ఢిల్లీ బ్యాటర్లు.. పంజాబ్ బౌలర్లను ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ముఖ్యంగా మంచు ప్రభావం (Dew) ఉండటంతో బంతి స్కిడ్ అయ్యే అవకాశం ఉందని, ఇది బ్యాటర్లకు కలిసి వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
