Pakistan Batting Innings In T20 World Cup Against India: టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఈరోజు భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే! తొలుత టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగిన పాకిస్తాన్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. షాన్ మసూద్ (52), ఇఫ్తికార్ అహ్మద్(51) అర్థశతకాలతో తమ జట్టుని ఆదుకున్నారు. మొదట్లోనే రెండు వికెట్లు కోల్పోవడంతో పాక్ జట్టు తడబడింది. అప్పుడు క్రీజులోకి వచ్చిన మసూద్, ఇఫ్తికార్.. మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడారు. మూడో వికెట్‌కు వీళ్లు 76 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అయితే.. 91 పరుగుల వద్ద ఇఫ్తికార్ ఔట్ అవ్వడంతో పాక్ మళ్లీ ఒత్తిడిలో పడింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు.. ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ చేరారు. షాహీన్ ఆఫ్రీది ఒక్కడే మసూద్‌కి చేయూతనందించడంతో.. పాక్ స్కోర్ ముందుకు కదిలింది.
దీంతో.. ఓవరాల్‌గా 20 ఓవర్లలో పాక్ జట్టు 159 పరుగులు చేయగలిగింది. ఒక రకంగా ఇది పెద్ద లక్ష్యమేమీ కాదు. అలాగనీ.. చిన్నచూపు కూడా చూడకూడదు. పాక్ జట్టులో సమర్థవంతమైన బౌలర్లు ఉన్నారు కాబట్టి, భారత బ్యాటర్లు ఆచితూచి నెట్టుకురాగలిగితే.. సునాయాసంగా విజయం సాధించొచ్చు. ఇక బౌలర్ల విషయానికొస్తే.. అర్ష్‌దీప్ సింగ్ & హార్దిక్ పాండ్యా దుమ్ము దులిపేశారు. చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ చెరో వికెట్ తీసుకున్నారు. మొదట్లో కట్టుదిట్టమైన బౌలింగ్ వేసిన భారత బౌలర్లు, ఆ తర్వాత కాస్త పరుగులు సమర్పించుకున్నారు. అక్షర్ పటేల్ అయితే ఒక్క ఓవర్‌లోనే 21 పరుగులు ఇచ్చుకున్నాడు.