క్రికెట్ అన్ని దేశాలు ఆడుతుంటాయి. కాని ఇండియా పాకిస్థాన్ మ్యాచ్‌కు ఒక రేంజ్ ఉంటుంది. ఇదేదో సినిమా డైలాగ్‌లా అనిపించినా.. దాయాది దేశాల మధ్య మ్యాచ్ అంటే దాదాపు యుద్దమే. రెండు దేశాల మధ్య క్రికెట్ అంటే చాలు అనౌన్స్‌మెంట్ నుంచి ఆడే సమయం వరకు అభిమానులు కోటి కళ్లతో ఎదురుచూస్తారు. క్రికెట్ అంటే ఆసక్తిలేనివారు కూడా టీవీలకు అతుక్కుపోతారు. భారత్-పాక్ మ్యాచ్‌కు అంతటి క్రేజ్ కనిపిస్తుంది మరీ. ఇవాళ సాయంత్రమే ఈ హైవోల్టేజీ మ్యాచ్ జరగబోతోంది. భారత్ పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే ప్రజల్లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాక్‌తో మ్యాచ్ జరిగిన రోజు విపరీతమైన దేశభక్తి ఉప్పొంగుతుంది.
శత్రుదేశంగా పాకిస్థాన్‌ను టీమిండియా చిత్తు చేయాలని ప్రతీ భారతీయుడు కసిగా కోరుకుంటాడు. టీమిండియాలోని ప్లేయర్ల పేర్లు తెలియనివారు కూడా భారత జట్టు గెలుపును ఆకాంక్షిస్తూ స్టేటస్ పెడతారు. ఇండియా- పాక్ మ్యాచ్ అంటే టికెట్ల దగ్గర నుంచి టీఆర్‌పీ రేటింగ్ వరకు అందిరికీ పండగే. వరల్డ్ కప్‌లో ఏ మ్యాచ్ కి లేనటువంటి టికెట్ల డిమాండ్… ఇండో పాక్ మ్యాచ్‌కి ఉండటంతో… దుబాయ్‌లో గంటకే టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం కెపాసిటి… 25 వేలు.
24న జరిగే మ్యాచ్ కోసం 75 శాతం సీటింగ్ కెపాసిటీతో టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. పెట్టిన గంటలోపే టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. క్రికెట్ అభిమానులు ఫ్రెండ్స్‌తో కలిసి మ్యాచ్ ను చూస్తూ… సందడి చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మ్యాచ్ ని చూసామన్నది ముఖ్యం కాదు… ఎక్కడ… ఎలా… ఎంతమంది ఫ్రెండ్స్‌తో… సందడి సందడిగా చూశామన్నదే ముఖ్యమంటున్నారు. ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారు.. వీరి జోష్ కి తగ్గట్టుగానే.. బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి పబ్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, హోటల్స్. మ్యాచ్‌ని వీక్షించేందుకు ప్రొజెక్టర్లు, బిగ్ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. అపార్టెమెంట్స్, గేటెడ్ కమ్యూనిటీల్లోనూ మ్యాచ్ ని వీక్షించేలా ప్లాన్ చేసుకున్నారు.